Tuesday, January 21, 2014

Veerabhadra swamy-kottakonda(Karimnagar dist),వీరభద్రస్వామి దేవాలయం-కొత్తకొండ గ్రామం (కరీంనగర్‌ జిల్లా)

  •  

  •  

-భీమదేవరపల్లి మండల పరిధిలోని కొత్త కొండ గ్రామంలో గల వీరభద్రస్వామి దేవాలయం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచినది. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామిగా ప్రసిద్ధిగాంచిన వీరభద్రుడిని దర్శిం చుకునేందుకు కరీంనగర్‌ జిల్లా నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవం గా జరుగుతాయి. స్వామివారి కళ్యాణం తో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు, నెలరోజులపాటు జరిగే జాతర ఉత్సవాల లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

దేవాలయం చరిత్ర...
క్రీశ 1600 ప్రాంతంలో కొంతమంది శాలివాహనులు కొత్త కొండ గ్రామశివారులోని కొండపైకి వంట చెరుకు కోసం వెళ్లారు. వారు కర్ర కొట్టుకొని తాము తెచ్చిన ఎడ్లు, బండ్లు కనిపించ కుండా పోయాయి. అంతటా తిరిగి అలసిపోయి ఆ రాత్రి కొండపైనే నిద్రించారట. స్వామివారు వారికి స్వప్నంలో కనిపించి కొండలోని గుహలో విగ్రహ రూపం లో ఉన్న నన్ను కొండపై నుంచి దించి క్రింద ఆలయంలో ప్రతిష్టింపమని ఆజ్ఞాపించారు. దీంతో స్వామి ఆజ్ఞ ప్రకారం స్వామివారిని దూదిమెత్తలలో విగ్రహాన్ని ఉంచి ఆలయంలో శ్రీ మల్లిఖార్జున పండితుని మనవడు కేదారి పండితునిచే ప్రతిష్టించారనే ప్రతీతి ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

స్వామిని దర్శిస్తే... సంతానయోగం...
-కొత్తకొండలోని వీరభద్రస్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తుల అపార నమ్మకం. సంతానం లేనివారు స్వామి వారికి కోరమీసాలు సమర్పించు కుంటే పుత్రసంతానం కలుగుతుందని, కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. భక్తుల ద్వారా జరిగే ముఖ్య పూజల్లో కోడెలు కట్టటం, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరములు, అమ్మ వారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, నవగ్రహ పూజలు, ఆంజనేయునికి ఆకుపూజ లు, చందనోత్సవాలు నిర్వహిస్తారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు...
కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారికి పూ జలు చేస్తారు. జనవరి మాసంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారే ఈ సమయంలో స్వామి వారికి జరుగు బ్ర హ్మోత్సవాల్లో మకర సంక్రాంతి రోజున స్వామివారి సర్వాలంకార నిజదర్శనం చేసుకున్న భక్తులకు సర్వ పీడల నుంచి విముక్తి కులుగు తుందనేది శాస్త్రోక్తి. బ్రహ్మోత్సవాలలో భద్ర కళ్యాణం, భోగి పండుగ రోజున మొక్కుల సమర్పణ, మకర సంక్రాంతి తెల్లవారు జామున అనగా ఉత్తరాయణ పుణ్య కాలంలో స్వామివారిని దర్శించు కుంటారు. మకర సంక్రాంతి రోజున వందలాది ఎడ్లబండ్లు దేవాలయం చుట్టు తిరుగుతాయి. జాతర ముగింపు రోజున అగ్నిగుండాలు జరుగుతాయి, అగ్నిగుండాలలో వందలాది మంది భక్తులు నడిచి పాపాలను పోగొట్టుకుంటారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరించి 27 రోజులు దీక్షలు చేపడతారు.

ఆలయానికి ఎలా వెళ్లాలి....
- వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లాలంటే వరంగల్‌ నుంచి 30 కిలో మీటర్లు, కరీంనగర్‌ నుంచి 70 కిలోమీటర్లు, సిద్దిపేట నుంచి 63 కిలో మీటర్ల దూరం ఉంటుంది. సిద్దిపేట నుంచి హన్మకొండకు నిత్యం ప్రతి ఆరగంటకు ఒక ఆర్టీసి బస్సు ఉంటుంది. ఈ రూటు మధ్య లో ఉండే ముల్కనూర్‌ నుంచి కొత్తకొండ వరకు 8 కిలో మీటర్ల ప్రయాణానికి పలువాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపుతుంది.

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు...
-వారం రోజుల పాటు కన్నుల పండువగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ఆలయ పూజారులు వేద మంత్రాల మధ్య నిర్వహిస్తారు. జనవరి నెల  9న స్వామివారి కల్యాణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్ర మాలు జరుగుతాయి. కళ్యాణానికి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. 10 వ తేదీన మహాన్యాస పూర్వక రుద్రాభిషే కం, 11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్యహోమం, నవగ్రహ హోమా లు, 12న బలిహరణ, సూర్యయంత్ర పతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకా దశి రుద్రహోమం, 14న భోగిపండుగ రోజు న చండీహోమం, వేదపారాయణం, 15న జాతర ప్రారంభం, బండ్లు తిరుగుట, శత రుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16 న స్వామివారి నాగవెల్లి మహోత్సవం, 17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు, స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

జాతరకు భారీ ఏర్పాట్లు...
-లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కొత్తకొండ జాతరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, సత్రాలు, వైద్య సౌకర్యాలను ఆలయ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌గుప్తా, ఇ.ఓ రామేశ్వర్‌రావు లు ఏర్పాటు చేశారు. హుజురాబాద్‌ డిఎస్‌పి సుదర్శన్‌గౌడ్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించా రు. నలుగురు సిఐలు, 12మంది ఎస్‌ఐలు, 50మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 150మంది కానిస్టేబుళ్లు, 150 మంది హోంగార్డులు, 30 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు, ఒక మహిళా ఎస్‌ ఐ, 4 మహిళా కానిస్టేబుళ్లు, 30 మంది డిస్టిక్‌ గార్డులు మొత్తం సుమారు 500 మంది పోలీసులు జాతర బందోబస్తులో పాల్గొన్నారు.

Courtesy with : Surya Telugu daily - ఆదివారము(ఎడిషన్‌) 02-01-2011.

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment