Sunday, June 7, 2015

నరసింహుడు తాతయ్యాడు,Narasimhaswami temple Singarayakonda









మీన కూర్మ వరాహావతారాల తరువాత తనేసర్వం అని ప్రార్థించిన భక్తుని కోసం మహా విష్ణువు నరమృగ అవతారాన్ని ఎత్తాడు. ఆయన్నే నారసింహుడనీ పిలుస్తాం. అయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మాత్రం ఆయనకు తాతయ్య అన్న బిరుదు కూడా ఉంది. అదెలా వచ్చిందో... మనమూ తెలుసుకుందాం!
ఒకవైపు మహోగ్ర రూపం.. మరోవైపు ప్రసన్న వదనం... ఓ పక్క లక్ష్మీ నారసింహుడు, మరో పక్క యోగ నారసింహుడు... ఇలా ఒకే క్షేత్రంలో రెండు గర్భగుడుల్లో స్వామి భక్తులకు కొంగు బంగారంగా అలరారుతున్న దివ్యక్షేత్రం ప్రకాశంజిల్లాలోని సింగరాయకొండ. ద్వాదశ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి పొందింది. సింగరాయకొండ పట్టణంలోని ఓ కొండమీద వెలసిన ఈ క్షేత్రపు ప్రధాన ప్రాంగణంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన వరాహ లక్ష్మీనరసింహస్వామి రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేతంగా కొలువై ఉంటాడు. అదే దేవాలయపు తూర్పుభాగంలో తాతగుడిలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి వెలసి ఉంటాడు. పర్ణశాలలో దేవరుషి నారద మహాముని తపమాచరించి నృసింహ స్వామిని ప్రసన్నం చేసుకోగా- ఆయన కోరిక మేరకే యోగానంద నరసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడని ప్రతీతి. యోగ ముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు.
తాతగుడిగా...
కారడవిలో వెలసిన నరసింహస్వామికి గతంలో రెండు కిలోమీటర్ల దూరంలోని సోమరాజుపల్లి నుంచి అర్చకుడు వెళ్లి నిత్యం నైవేద్యం సమర్పించి వచ్చేవాడు. ఒకనాడు ఆయన అర్చన నిమిత్తం వెళుతూ తన ఆరేళ్ల పిల్లాడిని కూడా గుడికి తీసుకువెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటుండగా- నైవేద్యం పెట్టిన అర్చకుడు బిడ్డను మరచి ఆలయ తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. తరువాత గుర్తుకు వచ్చినా ఆ కారడవి ప్రాంతానికి రాత్రి పూట వెళ్లలేక పొద్దున్నే వెళ్లాడు. బిడ్డను ఏ క్రూరమృగాలో తినేసి ఉంటాయని అనుకుంటూ గుడి తలుపులు తీసిన అర్చకుడికి బిడ్డ ఆడుకుంటూ కనిపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అర్చకుడు బిడ్డను అక్కున చేర్చుకుని ఆరా తీయగా- గుడిలోని తాత అన్నం పెడితే తిని ఆడుకుంటున్నానని చెప్పాడు. అలా నాటి నుంచీ యోగ నరసింహస్వామిని తాత నారసింహస్వామిగా పిలుస్తున్నారు.
స్వామి వెలసిన ప్రాంతం ఒకప్పుడు కారడవి. ఇక్కడ కరాటి రాజ్యం ఖరదూషణాదుల పాలనలో సాగేది. ఖరాసురుడు నరసింహస్వామి భక్తుడు. అహోబిలం నుంచి వచ్చి స్వామిని దర్శించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే ఖరాసురుడు స్వామిని వరం కోరగా.. శ్రీరామచంద్రుని రూపంలో కటాక్షిస్తానని అభయమిచ్చాడు. దానికి మనస్తాపం చెందిన ఖరాసురుడు యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగించడం మొదలు పెట్టాడు. తర్వాత వనవాస కాలంలో రుషి ఆశ్రమాల రక్షణ నిమిత్తం రామచంద్రుడు కరాటి రాజ్యం చేరాడు. ఖరుడు నరసింహ భక్తుడు కావడంతో శ్రీరామచంద్రుడు యోగనిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్ఠించి, అనంతరం ఖరదూషణాదులను వధించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
స్వామికి జ్యేష్ఠమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

- కోనేటి సురేష్‌బాబు, ఈనాడు, ఒంగోలు--ఫొటోలు: నూకసాని శ్రీనివాసులు

  • *=================================* 

* Visit my website : Dr.Seshagirirao.com _ 

Saturday, June 6, 2015

Janardhana swamy temple Dhavaleswaram,జనార్దనస్వామి ఆలయం ధవళేశ్వరం

  •  

  • Janardhana swamy temple Dhavaleswaram,జనార్దనస్వామి ఆలయం ధవళేశ్వరం

రాజమండ్రికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జనార్దనస్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో ఐతిహ్యాలూ పురాణగాథలూ! స్వామిని సాక్షాత్తూ నారద మహర్షే కొలిచాడంటారు. నదీమతల్లి గోదావరి జనార్దనుని సేవకే అవతరించిందంటారు.

భూమ్మీద వెలసిన తొలి వైష్ణవాలయం ధవళేశ్వరంలోని జనార్దనస్వామి దేవాలయమేనంటాయి పురాణాలు. నారదమహర్షి స్వహస్తాలతో జనార్దనుడికి పూజలు నిర్వహించాడని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు ఇక్కడికొచ్చి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడని కూడా పురాణగాథ. ఒకానొక సందర్భంలో నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని 'పితృదేవా! భక్తితో కొలిచిన వెంటనే, కోర్కెలు తీర్చే క్షేత్రం ఏది?' అని అడిగాడట. అందుకు బ్రహ్మదేవుడు 'గౌతమీనదికి ఉత్తరదిశలో ఆప్రాంతం ఉంది. అది జనార్దన క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. ఆదిలో నా నాలుగు ముఖాల నుంచీ నాలుగు వేదాలూ కోటిసూర్య ప్రచండ కాంతులతో బయటకు వచ్చాయి. మహర్షులూ దేవతలూ ఆ వేద కాంతినీ, కాంతి కారణంగా ఉద్భవించిన వేడినీ తట్టుకోలేక శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారు. అప్పుడే, దేవదేవుడైన నారాయణుడు వేయిబాహువులతో వేదాల్ని ఒడిసి పట్టుకుని, భూమిపై ఒక పర్వతంగా నిలిపాడు. ఆ వేదరాశియే జనార్దన పర్వతంగా ఏర్పడింది' అని చెప్పాడు.

 స్థల పురాణం.-వేదాలు వెలసిన కొండ...
పురాణ గాథల ప్రకారం...వ్యాస మహర్షి వేదాల అంతరార్థం తెలుపమంటూ ఘోరతపస్సు చేశాడు. జనార్దనుడు ప్రత్యక్షమై ఈ పర్వతం నుంచి నాలుగు పిడికిళ్ల మట్టిని తీసి వ్యాసుడికి అందించాడు. అతను వాటిని చతుర్వేదాలుగా విభజించాడు. అవే రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంగా వెలుగులోకి వచ్చాయి. కృతయుగంలో ఏర్పడిన ఈకొండ మీద తూర్పుచాళుక్యుల కాలంలో పూర్తి స్థాయిలో జనార్దనుడి ఆలయాన్ని నిర్మించారు.


భూదేవీ శ్రీదేవీ సమేతంగా...
గోదావరి సమీపంలో ఎత్త్తెన కొండ మీద నిర్మించిన ఆలయం... ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజిల్లుతోంది. జనార్దనుడు ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు. భువి మీదున్న 108 వైష్ణవాలయాలలో ఇదే ప్రథమమని బ్రహ్మదేవుడే చెప్పాడంటాయి పురాణాలు. ఈకొండ మీదే, ఓ గుహలో సంతాన గోపాలస్వామి వెలిశాడు. సంతానంలేని దంపతులు స్వామిని కొలిస్తే... పండంటి పిల్లలు పుడతారని ఓ నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముడు జనార్దనస్వామిని దర్శించుకున్నాడట. రావణుడిని చంపాక... బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోడానికి ఈ క్షేత్రానికి వచ్చాడని ఐతిహ్యం. తన వెంట వచ్చిన ఆంజనేయుడిని ఈ ప్రాంతానికి రక్షకుడిగా ఉండమని ఆదేశించాడట శ్రీరాముడు. కాబట్టే, క్షేత్రపాలకునిగా మారుతి పూజలందుకుంటున్నాడు. 'నిన్ను వదలి ఉండలేను స్వామీ!' అని వేడుకున్న హనుమ కోసం తన పాదముద్రల్ని వదిలి వెళ్లాడు సీతారాముడు. శ్రీరాముని పాదాలు తాకిన ప్రదేశం కావటంతో రామపాదక్షేత్రంగానూ పిలుస్తారు.

గోదావరి జన్మస్థలి...
జనార్దన స్వామి అభిషేకం కోసమే గోదావరి పుట్టిందని పురాణ కథ. కృతయుగంలో నారదమహర్షి...సొరంగ మార్గం ద్వారా కాశీ వెళ్లి గంగాజలాన్ని తెచ్చి జనార్దనుడికి అభిషేకించేవాడట. 'నేనైతే మంత్రశక్తితో అంతదూరం వెళ్లి గంగాజలం తెస్తున్నా. కలియుగంలో పరిస్థితి ఏమిటి? స్వామివారి అభిషేకం ఎలా జరుగుతుంది?' అని ఆలోచించాడు. ఆ కార్యాన్ని గౌతముడి ద్వారా పూర్తిచేయాలని సంకల్పించాడు. ఆ సమయానికి గౌతముడు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద తపస్సు చేసుకుంటున్నాడు. ఆరోజుల్లో పంటలు సరిగా పండక ప్రజలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవించేవారు. గౌతముడు తన తపశ్శక్తితో ధాన్యాన్ని పండించి, ప్రజలకు నిత్యం అన్నదానం చేసేవాడట. నారదుడు తన చాతుర్యంతో, ఒకరోజు ఆయన సృష్టించిన పంటను గోవు తినేలా చేశాడు. అన్నదానానికి ఉపయోగించే ధాన్యాన్ని గోవు తినేసిందనే బాధతో, గౌతమ మహర్షి దర్భతో గోవును అదిలించాడు. ఆమాత్రానికే ఆ గోమాత చనిపోవటంతో గోహత్యా పాతక నివృత్తి కోసం గౌతముడు ఘోరతపస్సు ఆచరించి భువిపైకి గంగను రప్పించాడు. గోవు నడిచిన ప్రదేశంలో గంగ పుట్టటంతో ఆప్రాంతానికి గోదావరిగా నామకరణం చేశాడు. ఆ గోదావరి జలంతోనే జనార్దనుడికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తారు.


ఘనంగా రథోత్సవం
భీష్మ ఏకాదశి రోజున జనార్దన క్షేత్రంలో భవంగా రథోత్సవం జరుగుతుంది. కార్తీక, ధనుర్మాసాల్లో ప్రత్యేక పూజలూ వ్రతాలూ నిర్వహిస్తారు. మిగతా రోజుల్లోనూ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఉదయాస్తమాన పూజలు నిర్వహిస్తారు. కొండపైకి వెళ్లేదారంతా శ్రీమహావిష్ణు స్వరూపంగా కొలుస్తారు భక్తాదులు. రాజమండ్రి నుంచి బస్సులూ ఆటోలూ పుష్కలంగా ఉంటాయి.

- సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమండ్రి

  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _

Wednesday, June 3, 2015

Fifty four temples at one place,54 ఆలయాలు ఒకేచోట..గాదరాడ గ్రామం

  •  



    దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలూ శైవ ఆలయాలూ శక్తి పీఠాల నమూనాలూ అక్కడ కొలువయ్యాయి. మూలవిరాట్టుల పూజలూ నైవేద్యాలూ నిజ క్షేత్రాల్ని తలపించేలా ఉంటాయి. రాజమండ్రికి దగ్గర్లోని గాదరాడ గ్రామాన్ని సందర్శిస్తే సంపూర్ణ తీర్థయాత్రలు చేసొచ్చినంత సంతృప్తి.

ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిదీయతే - అంటుంది భగవద్గీత. ఈ శరీరమే ఓ క్షేత్రమని గీతావాక్కు. క్షేత్రం అంటే దేవాలయమన్న అర్థమూ ఉంది. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః - అన్న ఆగమవాక్యం కూడా ఆ విషయాన్నే చాటుతోంది. భారతదేశంలో యాభై లక్షలకుపైగా ఆలయాలున్నాయని అంచనా. స్వయంభూ ఆలయాలూ, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలూ, శంకరభగవత్పాదులు-రామానుజులు- మధ్వాచార్యులూ తదితర దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులూ, చోళులు-పల్లవులు- కాకతీయులు-విజయనగర ప్రభువులూ...పాలకులు ప్రాణంపోసిన క్షేత్రాలూ - ఒకటారెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు. అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే...నమూనాలేమిటి, అక్కడ జరిగే పూజాదికాలన్నీ ఇక్కడా జరిగితే... నైవేద్యాలూ అచ్చంగా అలానే ఉంటే...ఇంకేముంది, సంపూర్ణ యాత్రా ఫలమే, సర్వదేవతా కటాక్షమే!

రాజమండ్రి సమీపంలోని గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో... 'ఓం శివశక్తి పీఠం' పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు. బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలాకాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయినా, మూలాల్ని మరచిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వూళ్లో చిన్నచిన్న గుళ్లూ గోపురాలూ చాలానే ఉన్నా, చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటీ లేకపోవడం లోటుగా అనిపించేది. దీంతో, వూరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవెల నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు. 'ఏ ఆలయాన్ని నిర్మించాలి?' అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతోమంది మఠాధిపతుల్నీ గురువుల్నీ కలిశారు. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమన్నారు, మరొకరు శివ లింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు. అన్నీ ఉత్తమంగానే అనిపించాయి. సర్వదేవతల ఆలయాల్నీ నిర్మించాలన్న ఆలోచన అప్పుడు కలిగిందే. జీవితభాగస్వామి వెంకటలక్ష్మి భర్త సంకల్పానికి మద్దతు ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులూ మేమున్నామని ముందుకొచ్చారు. విరాళాల కోసమో సాయం కోసమో ఎవర్నీ ఆశ్రయించకూడదనే నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి శిల్పుల్నో పిలిపించారు. ఇంజినీర్లతో మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమించినా, ఆలయ సముదాయానికి ఓ రూపం రావడానికి నాలుగేళ్లు పట్టింది.
ఎన్నో ఆలయాలు...
పీఠం ఆవరణలో మొత్తం యాభై నాలుగు దేవాలయాలున్నాయి. ఎనభై నాలుగు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు. కైలాస మహాక్షేత్రాలుగా (21), వైకుంఠ క్షేత్రాలుగా (15), శక్తిపీఠాలుగా (18) వాటిని విభజించారు. కైలాసక్షేత్రాల్లో...ద్వాదశ జ్యోతిర్లింగాలైన సౌరాష్ట్రలోని సోమనాథ లింగం, శ్రీశైలంలోని మల్లికార్జున లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం...ఇలా పన్నెండు లింగాలూ కొలువయ్యాయి. ఇక్కడే ఆనందనిలయ వాసుడిని అర్చించుకోవచ్చు - భూదేవి, శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడే షిర్డీనాథుడిని ప్రార్థించుకోవచ్చు - సద్గురు సాయిబాబా మందిరం ఉంది. ఇదే భద్రాది, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవల్లి...కోదండ రామస్వామి, రమాసత్యనారాయణ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఇక్కడున్నాయి.

పూజాదికాలు ఇలా...
శివుడి పరివార దేవతలకు శైవాగమం ప్రకారమూ వైష్ణవాలయాల్లో వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారమూ పూజలు నిర్వహిస్తారు. మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేదపండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో ఓ గోశాల ఉంది. వేదపాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయంలోకి వెళ్లగానే, 32 అడుగుల ఎత్తుతో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతాడు. భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మవరపు వెంకటనారాయణశర్మ. రాజమండ్రి నుంచి కోరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గాదరాడకు ఆటోలు ఉంటాయి. తిరుగు ప్రయాణంలో కోరుకొండలోని లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. గుట్టమీదున్న ఆలయం త్రేతాయుగం నాటిదని అంటారు.

- సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమండ్రి సాంస్కృతికం
  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _