Saturday, December 21, 2013

Sri Vasavi kanyakaparameswari temple-Penugonda,శ్రీవాసవీ కన్య కాపర మేశ్వరీ దేవి ఆలయం-పెనుగొండ




ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ వేలకొలది భక్తులను ఆకర్షిస్తూ వుంది వాసవీ కన్య కాపర మేశ్వరీ దేవి. అక్కడ వెలిసిన వాసవీ అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్ధకమైందను కుంటారు భక్త జనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి, యుక్త వయస్సు వరకు పెరిగిన వాసవీ మాత విశేషాలు

-పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్టి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్లయ్యి చాలాకాలం దాకా సంతాన భాగ్యం కలుగలేదు. అందుకని కుసుమశ్రేష్టి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి, రెండు ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది. ఆ ఫలములను భుజించిన కౌసుంబి పది నెలలో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను కవలపిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడశివుకు వాసవి అని విష్ణు అంశంతో పుట్టిన మగశిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్టి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసినవారందరు ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమశ్రేష్టి. వాసవి విరూపాక్షలు యుక్తవయస్కులైయ్యారు.

ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్టి ఇంటిముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా వున్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి, వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్టికి తెలియజేయగా... అయ్యా మేము వైశ్యులము. క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యమందుకోలేము. ఇది అసాధ్యం కుసుమశ్రేష్టి. ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలపమని మంత్రిని మళ్లీ రాయాబారానికి పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు.

-ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయల్దేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీరించమని కుసుమశ్రేష్టి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్టి. తండ్రి! అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలాచేసినా నాకేం కాదు మీరు దిగులుచెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు. ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది. అందరు అగ్నిగుండం లోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి.

అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దు ల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేందడు క్రుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంవరించ బడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్ధించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు.

ఆలయ నిర్మాణం...
-పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటిచెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు. ధ్వజస్తంభం. దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్టించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి. ఆ తర్వాత తోరణమండపం వెనుకవైపు ద్వారం కనిపిస్తుంది.

వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్నగోపురం వున్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు. పుట్టలో వున్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం. ప్రధాన మండపంలో మూడు గర్భగుడులు వరుసగా వున్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువైయ్యాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం.

ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైం ది. ఒకచేత చిలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు, పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది. వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి.. ఆ వాసవి దేవి, వంశప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్దపడిన వాసవిదేవి త్యాగానిరతి కొనియాడబడినది.

ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణకధ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైన కన్నీటి పర్వంతమౌతారా నడం అతిశయోక్తి కాదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యదార్ధగాధకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లగా వున్న ఈ అగ్నిగుండం. ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పక్షుల కలరవాలు కూడా ఈచోట వినిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసు కొని మౌనం వహించేలా అనిపిస్తుంది మరి. ఎంత కటోరమైన మనసున్న వారినైన దయార్ధ్రులుగా మార్చగల శక్తి వున్న అగ్నిగుండ మండపం. ఆలయం నుండి బయటకి వచ్చక కూడా మన మనసుల్ని ఆ స్మృతులు వెన్నతూనే ఉంటాయి. మామూలు స్ధితికి రావడానికి కొంత సమయం పడుతుంది.

  • *=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Friday, December 20, 2013

Kodandarama Temple vontimitta ,కోదండ రామాలయం ఒంటిమిట్ట

  •  


వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన మండలం కేంద్రం ఒంటిమిట్ట. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఏకశిలానగరం ప్రసిద్ధిచెందిన ఈ ప్రాంతంలో కొలువైవున్న కోదండ రామాలయం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. జాంబవంతుడు ప్రతిష్టించిన ఆ కోదండరాముని ఆలయం...viSEshaalu.
ఎక్కడాలేని విధంగా శ్రీసీతారామలక్ష్మణులను ఒకే శిలలో ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాల యంలో ఉన్న శ్రీరామ తీర్థం ఎంతో ప్రసిద్ధిచెంది నది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థలపురాణంలో వివరించబడినది. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావె ర్నియర్‌ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశం లోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు.

అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్నిబట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.

స్థలపురాణం...
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వా మిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండుమహర్షి, శృంగిమహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా-లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఆలయ విశిష్టత...
ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపిచోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు.

స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకట కవి, వర కవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి. చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు.

చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్‌ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు.

పూజలు, ఉత్సవాలు...
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

శ్రీరామనవమి ఇక్కడ వైభవోపేతం
ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటకశాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీప వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్‌ బావి ఒకటి. ఇమాంబేగ్‌ 1640 సంలో కడపను పరిపాలించిన అబ్దుల్‌ నభీకాన్‌ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ‘మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?’ అని ప్ర శ్నించాడు. ‘చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని' వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు.



అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్య చకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాం బేగ్‌ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరూ ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.

Courtesy with : Sunday magazine@surya Telugu daily 28-10-2012


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Thursday, December 19, 2013

Bhadrakali Temple Warangal,కాకతీయుల ఇలవేల్పు.శ్రీ భద్రకాళి-వరంగల్

  •  

  •  


వరంగల్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలి టెక్నిక్‌ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన... గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంత మైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది భద్రకాళీ అమ్మవారు. ఈ దేవాలయంలో దేవివిగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండు వగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రేతా సనాసీనయై ఉన్నది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, ఛురిక, జపమాల, డమరుకం... ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ధరించి... 8 చేతులతో... అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి విశేషాలు

కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగార మై వారి కోర్కెలను తీరుస్తూ ఉన్నట్లు... ‘పతాపరుద్ర చరిత్రము’, ‘సిద్ధేశ్వర చరిత్రము’ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏ కశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న వి ద్వాంసులు అతనిని అవమానపరచి పంపివే శారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ వి ద్వాంసులను ఎలాగైనా జయించాలనే ఉద్దేశం తో ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా? అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకం టే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీక రించినట్లు అవుతుంది.

కాదంటేనే అతనిని ఓ డించినట్లవుతుంది అని నిర్ణయించి, రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండిది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసుల లో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సు దర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివా డు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు స్పష్టమవుతుంది.

క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్‌ శాస్ర్తి, స్థానిక శ్రీవైష్ణవ పండితులు శ్రీమాన్‌ ముడుంబైరామానుజా చార్య నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్‌లాల్‌ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు.

అదే రాత్రి శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారికి అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట...మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మ వారిని దర్శిం చి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహకారం అందిస్తానని శాస్ర్తి గారికి మాట ఇవ్వగా శ్రీ గణేశ శాస్ర్తి గారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది.

అమ్మవారికి మహిమకు ముగ్ధుడైన శ్రీమగన్‌లాల్‌ సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. ఆ సందర్బంలో ఆయనకు శ్రీ విద్యా నిధియైన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకటరామనర్సయ్య, అడ్లూరి సీతారామశాస్ర్తి, వంగల గురువయ్య, టంకసాల నరసింహారావు, మహాతపస్వి ని మంగళాంబిక ఇలా ఎంతోమంది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం.

ఆలయ నిర్మాణ విశేషాలు...
శ్రీ భద్రకాళీ దేవాలయము క్రీ.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆ లయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి నట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్రాకారం లో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈదేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ.

అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖ ద్వారం అన్నీ కాక తీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపి స్తుంది. అంతేకాక దేవాలయంలోని అంతరాళ స్తంభాలలో ఒకదాని మీద... ‘మహేశశ్చారు సంధత్తే మార్గణం కొనకా చలే! మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచల మ్‌!!’ అనే శ్లోకం కన్పిస్తుంది. ఈ శాసనపాఠం పురాతత్త్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్‌ జిల్లా శాసనాల్లో (పు.307) ఉన్నది. ఈ శ్లోకం లోని ఎఱ్ఱన క్రీ.శ.10వ శతాబ్దిలో కాకతిపురాన్ని పాలించి నట్లు గూడూరు శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఈయన తండ్రి విఠనామాత్యు డని, ఆయనకు మీసరగండడనే బిరుదు ఉండేదని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఇదే విషయం దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉన్నది.

అది ‘మంత్రిమీసర గండేన, విఠనామాత్య సూను నా! ఎరయాఖ్యేన సమోదాతా, న భూ తోన్‌ భవిష్యతి!!’ అనే శ్లోకం. ఈ రెండు స్తంభశాస నాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో నిర్మింప బడి ఉంటుందని ఊ హించవచ్చు. లేదా కాకతి ప్రతాపరుద్రుని సర్వసైన్యాధిపతియైన ఆడిదం మల్లుకు కూడా మీసరగండడనే బిరుదు కన్పిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింబడిందో సరిగ్గా చెప్పలేం. ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్రగలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.

1950లో పునరుద్ధరించే సమయం వరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రా చీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదనటానికి - తనరు భద్రేశ్వరి యనంగ భయదంబుగాగ - అన్న సిద్ద్శ్వరచరిత్ర (పు.24) లోని మాటలే నిదర్శనం! అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.

గర్భాలయానికి రెండువైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. ఆవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోటానికి ఉపయోగించే వేమో అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉన్నది. అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో, చెఱవు ప్రక్కన ఉన్న ఒక పెద్ద కొండమీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది. 1966లో వరంగల్‌-ఖాజీపేట ప్రధాన రహదారిగుండా శ్రీ భద్రకాళీ దేవాలయానికి బీటీ రోడ్డు, వీది దీపాలు ఏర్పాటు చేయబడినాయి. ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి గారి నేతృ త్వంలో దక్షిణభారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహా మండపం, శాలాహారదులు నిర్మించారు.

భద్రకాళీ చెఱువు...
ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెఱవు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెఱవు అంటారు. వరంగల్‌ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది.

ఇతర ఆలయాలు...
మహామండపంలో దక్షిణంవైపున ఒక శిలమీద చెక్కిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళీ అమ్మవారు ఉన్న భూమియలముతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీనకాలపువే అనిపిస్తుంది. అదీకాక, ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో కాక పార్వతీపరమేశ్వరుల రూపంలో ఉండటం ఇక్కడి విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహాశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయ ముందుభాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం, సుబ్రహ్మణేశ్వరుడు, ఆంజనేయస్వామి ప్రతిష్ఠలు ఉన్నాయి.

ఆగమ సంస్కృత విద్యాలయం...
వైదిక ధర్మోద్ధరణ ధ్యేయంగా షడంగాలతో కూడిన వేద విద్యాలయాన్ని (శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయం) ఆలయ ప్రాంగణంలో కొన్నేళ్ళ క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నెలకొల్పారు. ప్రకృతి రమణీయతతో బాటు నిరంతరం వేద ఘోషతో దేవాలయ ప్రాMగణం దర్శింప వచ్చిన భక్తులకు ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతిని కలిగిస్తోంది.


Courtesy with : Sunday magazine@surya Telugu daily 21-10-2012

*=================================*
 * Visit my website : Dr.Seshagirirao.com _

Ulagalantha Perumal Temple-Kanchipuram,ఉలగళంద పెరుమాళ్‌-కాంచీపురం

  •  





  •  

కాంచీపురంలో శ్రీమహావిష్ణువు కొలువుదీరిన సుప్రసిద్ధ ఆలయాలలో శ్రీఉలగళంద పెరుమాళ్‌ ఆలయానికి విశిష్ట స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు శ్రీఉలగళంద పెరుమాళ్‌ గా కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయ సమీపంలో శ్రీ కామాక్షి కొలువుదీరి వున్న ప్రముఖ క్షేత్రమైన ఉలగళంద పెరుమాళ్‌ ఆలయ విశేషాలు..

శ్రీఉలగళంద పెరుమాళ్‌ త్రివిక్రముడు, వామనుడు అని కూడా ప్రసిద్ధి. వామనవతారం శ్రీమహావిష్ణువు యొక్క ఐదవ అవతారం. ఇక్కడ ఆదిశేషునికి, బలిచక్రవర్తికి శ్రీఉలగళంద పెరుమాళ్‌ దర్శనమిచ్చారు. బలిచక్రవర్తి పరమ విష్ణుభక్తుడు. శ్రీఉలగళంద పెరుమాళ్‌ అర్చారూపం చాలా పెద్దగా 35 అడుగుల ఎత్తుతో ఉంటుంది. శ్రీఉలగళంద పెరుమాళ్‌ ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఈ ఆలయంలో శ్రీఉలగళంద పెరుమాళ్‌ అమృతవల్లి సహితంగా కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ ఉన్న పుష్కరిణి నాగతీర్థం. శ్రీఉలగళంద పెరుమాళ్‌ ఎడమ పాదం ఆకాశంపై ఉంటుంది. కుడి పాదం బలిచక్రవర్తి తలపై ఉంటుంది. శ్రీఉలగళంద పెరుమాళ్‌ ద్విబాహువులతో దర్శనమిస్తారు. రెండు చేతుల కుడి ఎడమలకు చాచి, కుడి చేతి ఒక వేలు, ఎడమ చేతి రెండు వేళ్ళు చూపిస్తూ ఉంటారు.

శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, శ్రీవరదరాజ పెరుమాళ్‌ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో వామన జయంతి విశేషంగా నిర్వహిస్తారు. ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తికి దానగుణం పెట్టని అలంకారం. బలిచక్రవర్తి పాతాళలోకం పరిపాలిస్తూ, దేవతలతో యుద్ధం చేసి, దేవేంద్రుడిని పదవీచ్యుడిని చేసి, స్వర్గంపై ఆధిపత్యం సాధిస్తాడు. బలిచక్రవర్తి, అసుర గురువు శుక్రాచార్యుడు సహకారంతో అశ్వమేధయాగం చేసి ముల్లోకాలపై ఆధిపత్యం సాధించటానికి సిద్ధపడతాడు. బలిచక్రవర్తి ప్రయత్నానికి ఆటంకం కలిగించటానికి శ్రీమహావిష్ణువు వామనుడుగా అవతరించి, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల నేల దానం అడుగుతాడు.‘‘ఓ నృపా! నీ దానగుణం విని మీదు మిక్కిలి సంతసించాను. నేను అడిగినది దానం యివ్వగలవా?’’ అని ఠీవిగా నిలబడి ఉన్న వామనుడు బలిచక్రవర్తిని అడుగుతాడు.

‘‘ఏమి దానంగా కావాలో కోరుకో!!’’ దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వామనుడితో బలి అంటాడు.‘‘నాకు మూడు అడుగుల స్థలం యివ్వగలవా?’’ అని వామనుడు అడుగుతాడు.‘‘అదెంత భాగ్యం!! ఇప్పుడే తీసుకో అని బలి జల పూర్వకంగా వామనుడుకి దానమివ్వ తలుస్తాడు. శ్రీమహావిష్ణువు వామనుడి రూపంలో బలి నుంచి దానం స్వీకరించటానికి వచ్చాడని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు, బలిని దానం యివ్వవద్దని కోరతాడు.
‘‘గురువర్యా!! దానం యిస్తాను అని వాగ్ధనం చేసిన తర్వాత ఆడితప్పటం సరికాదు. శ్రీమహావిష్ణువే స్వయంగా వామనుడి రూపంలో దానం స్వీకరించటానికి వస్తే మిక్కిలి సంతసిస్తాను అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో పలికి, జలసహితంగా 3 అడుగుల నేల దానం చెయ్యటానికి సిద్దపడి జల పాత్రను కరములలోకి తీసుకొంటాడు.

కీడు శంకించిన శుక్రాచార్యులు కందిరీగ రూపందాల్చి జలం పాత్రలోనుంచి జలం బయటకు రాకుండా అడ్డుగా ఉంటాడు. ఇది గ్రహించిన వామనుడు పుల్లతో జలపాత్రలో అడ్డుగా ఉన్న కందిరీగని పొడుస్తాడు. ఆ పుల్ల కందిరీగ రూపంలో ఉన్న శుక్రాచార్యులు ఒక కన్నుకి తగిలి దృష్టిపోతుంది. బలిచక్రవర్తి జలసహితంగా 3 అడుగుల భూమి వామనుడుకి దానం యిస్తాడు.ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై వామనుడు త్రివిక్రముడై ముల్లోకాలు ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడు. ఒక అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో అడుగు పెట్టటానికి స్థలం చూపమని వామనుడు బలిచక్రవర్తిని కోరతాడు. బలిచక్రవర్తి మూడో అడుగు తన తలపై పెట్టమని కోరతాడు. త్రివిక్రముడు మూడో అడుగు బలిచక్రవర్తి తలపై మోపి బలిని పాతళలోకానికి తొక్కేస్తాడు.


Courtesy with : Sunday magazine@surya Telugu daily 09-June-2013

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Modhera Sun Temple,మోఢేరా సూర్య దేవాలయం

  •  
  •  

అన్ని దేవాలయాల్లోకెల్లా సూర్య భగవానుని దేవా లయాలు చాలా అరుదనే చెప్పాలి. అయితే సూర్య భగవానుని దేవాలయం అనగానే మనకు మొదట గా గుర్తుకు వచ్చేది కోణార్క్‌ సూర్య దేవాలయం. మనరాష్ట్రం విషయానికి వస్తే.. అరసవెల్లి సూర్య దేవాలయం పేరు ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇవే కాకుండా గుజరాత్‌లోని మోఢేరా సూర్య దేవా లయానికి కూడా ఎంతో చరిత్ర ఉంది. స్కంద, బ్రహ్మ పురాణాల్లో కూడా ప్రస్తావనకు నోచుకున్న అరుదైన ప్రాంతంలో వెలసిన మోఢేరా సన్‌ టెంపుల్‌ విశేషాలు ...

అహ్మదాబాద్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న ‘పుష్పవతి’ నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్‌ సోలంకి- నిర్మించారు. క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్‌ మరియు చుట్టు పక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్‌ హమద్‌ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు.

సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పు కునే ‘అహిల్‌వాడ్‌ పాటణ్‌’ కూడా తన గొప్ప తనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో నాలుగు సూర్యదేవుని ఆలయా లున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్‌ మందిరం, రెండవ ది జమ్మూలో నున్న మార్తాండ్‌ ఆలయం, మూడవది మన రాష్ట్రంలోని అరసవెల్లి. నాలుగవది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం.

సున్నం లేకుండా నిర్మాణం...
శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అ దేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశే షం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్‌ నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోప ల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది. మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు రామాయణం, మహాభారతంలోని ప్రధానమైన విషయాలను కూడా చెక్కారు.

-స్తంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి. సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్య కిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. సభామండ పానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు. అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతు నకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.

చరిత్రలో మోఢేరా...
స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాల ను ‘దర్మరన్య’ అని పిలిచేవారు. శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపం నుంచి బయట పడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెపుతున్నాయి. అప్పుడు గురువైన వశిష్ట మహర్షి ‘ధర్మరన్య’ వెళ్ళమని శ్రీరామ చంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలవబడుతోంది.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: అహ్మదాబాద్‌ నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్‌ నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది.
రైలు మార్గం: అహ్మదాబాద్‌ వరకు రైలు మార్గం గుండా వెళ్లవచ్చు.

Courtesy with : Sunday magazine@surya Telugu daily 21-June-2013

  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _

Wednesday, December 18, 2013

Sri Subramanyeswara Temple-Mopidevi,శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం-మోపిదేవి




  •  

దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో ప్రస్తావించబడిన ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు ...

అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపో యాయి. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమ హర్షికి, విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వ తం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిం చింది. తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.‘వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌’ అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.కుమారస్వామి ఉరగ (పాము) రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు.

వారు ఒక పర్యా యం పరమేశ్వర దర్శ నానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతాస్ర్తీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీదేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రివలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ అని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ‘అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్‌’ అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు.

తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారుచేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు.అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి gaa స్ధిరపడిందని చెపుతారు.

క్షేత్ర విశిష్టత...
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

విశేష పూజలు...
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.

ఇలా వెళ్ళాలి...
కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపిదేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.

Courtesy with : Sunday magazine@surya Telugu daily 14-June-2013
  • =========================
visit my website : Dr.Seshagirirao.com

Monday, December 16, 2013

Hamsaladeevi Venugopala Swamy,హంసలదీవి వేణుగోపాలస్వామి


  •  

  •  
కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం హంసలదీవి. ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారి పోతాయన్న కథనం ఈ ప్రాంతంలో ప్రబలంగా విన్పిస్తోంది. అలాంటి అత్యంత పవిత్ర స్థలంలో కొలువైవున్నాడు వేణుగోపాల స్వామి. హంసలదీవి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ పవిత్ర క్షేత్ర విశేషాలు

పూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకి లాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధిం చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భ వించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం లో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి. నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాప తమస్సును కాకి వలె ధరించి కృష్ణా సాగ రసంగమ పవిత్ర ప్రదేశం లో మునిగింది. పాపప్రక్షాళన పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి. ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అటువంటి పరమహం సలు సంచరించిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథనం.

ఆలయ విశేషాలు...
ఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి. ఈ ఆలయం ఒక రాత్రిలో దేవతలు నిర్మించిందిగా స్థలపురాణం. దేవాలయ నిర్మాణం పూర్త యి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని, దేవ తలు వెళ్లి పోయారని, అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందని చెప్పేవారు. ఆ తరువాత దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. 1977లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు దీన్ని ప్రారంభించారు.మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండ వచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్తంభాలమీద అనేక శాసనాలు మనకు కన్పిస్తాయి.

క్షేత్రపురాణం...
శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రాదుర్భావాన్ని గూర్చి కథ ఒకటి జనశృతిగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవాడట. మేతమేసిన ఆవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పుట్టలోకి పాలు కార్చేవట. సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడంతో అనుమానమొచ్చి, మాటువేసి కారణం కనిపెట్టారు గోపాలురు. ఆవులు పుట్ట పైకి వెళ్లి పాలుకార్చడం చూచి, కోపం ఆపుకోలేక, చెత్తంతా పోగు చేసి పుట్టమీద వేసినిప్పుపెట్టారట. పుట్టలోని స్వామికి వేడితగలడం, ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పడం, క్షమాభిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించడం జరిగిపోయింది.కాలాంతరంలో ఆ విగ్రహం భిన్నమైపోగా, స్వామి గ్రామస్తులకు కలలో కన్పించి కాకరపఱ్ఱు మునసబు గారి దొడ్లో ఉన్నానని చెప్పడంతో గ్రామస్తులు వెళ్లి ఊరేగింపుగా స్వామి వారిని తీసుకొచ్చి ప్రతిష్టించారట. ఆ విగ్రహమే ఇప్పుడు పూజలందుకుంటున్నది. భిన్నమైన విగ్రహం ఇప్పటిక్కూడా అలంకరించబడిన మూలవిరాట్‌ ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది.

సరిగంగ స్నానాలు...
ఈ ఆలయంలో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదే శంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరే ళ్ళు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిద్ర చే స్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగు తుందని చెపుతారు. ఆలయం చుట్టూ ఉన్న కుడ్యాలలో ఎన్నో అంద మైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయా నికి ఈశాన్యంలో పురాతన కట్టుబడితో కళ్యాణమండపం కన్పిస్తుంది.

ఉత్సవాలు...
మాఘపౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు. కార్తీకమాసంలో సముద్ర స్నానం చేసిన వేలాదిమంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.

ప్రత్యేకతలు...
ఈ ఆలయం తుపానులు, ఉప్పెనల నుండి గ్రామస్తులను కాపాడుతూ వస్తోంది. 1864, 1977 ఉప్పెనల నుండి ఎందరో గ్రామస్తుల ప్రాణాలను కాపాడిన ఘనచరిత్ర ఈ ఆలయానిది. సుమారు 6, 7 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఉప్పెనలకు చెక్కుచెదరకుం డా నిలబడటమే కాకుండా, కొన్నివందల ప్రాణాలను నిల బట్టిన ఘనత ఈ ఆలయ సొంతం. ఇటువంటి గట్టి కట్టడా న్ని నిర్మించిన ఆ శిల్పులను ఒక్కసారి గుర్తుచేసుకొని జోహా ర్లు అర్పించాలి. శ్రీజనార్ధనస్వామి, శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే బాలాత్రిపుర సుందరి, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణం లో అక్కడక్కడ పడి ఉన్న కొన్ని శిథిల శిల్పాలు చెదిరిన మన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కనబడతాయి.

ఎక్కడుంది?
కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోను బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.

Courtesy with : Sunday edition of Surya Telugu daily ఆదివారం 14-8-2013
  • =================================
Visit my website : Dr.Seshagirirao.com

Manudevi Temple Aadgaon -మనుదేవి ఆలయం అడగాన్‌ గ్రామం

  •  

  •  
భారతావనిలో దేవతలు వివిధ రూపాల్లో దర్శనమివ్వడంలో... అనేక కారణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. ప్రతి విగ్రహరూపానికి ఒక్కో కథ ఉంటుంది. అలాగే మహారాష్టల్రోని మనుదేవి ఆలయానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. నవదంపతుల ఆరాధ్య దైవంగా కొనియాడబుతున్న మనుదేవి ఆలయ చరిత్ర...

-మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను వేరు చేసే అందమైన సాత్పురా పర్వతశ్రేణుల మధ్య కొలువై ఉన్నది మనుదేవి ఆలయం. ఈ ఆలయంలో ఖందేష్‌ దేవిమాత కొలుదీరి, భక్తుల మొక్కులు తీర్చుతోంది. ఈ పురాతన ఆలయం మహారాస్ట్ర కు  ఈశాన్య దిక్కుగా ఉండే యావల్‌-ఛోప్రా జాతీయ రహదారి కాసరఖేడ్‌-అడగాన్‌ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ కనువిందు చేసేలా తివాచీ పరిచినట్టుగా కనిపించే పచ్చటి పర్వతశ్రేణులు ఆలయానికి మరింత శోభను కనిపిస్తున్నాయి. ఆలయానికి సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి ఖందేష్‌ మాతను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని వెళుతుంటారు.

సాత్పురా పర్వతశ్రేణుల్లోని గ్వాలివదా ప్రాంతానికి క్రీస్తుపూర్వం 1200 కాలంలోఈశ్వర్‌ సేన్‌ అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయకు అపార పశుసంపద ఉండేది. కొన్ని గోవులు రోజు ప్రస్తుత మహారాష్టల్రోని తపతి నదికి నీరు త్రాగడానికి వెళ్లేవి. మిగిలిన గోవులు మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదికి వెళ్లేవి. అయితే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో మాన్‌మోది అనే భయానక వ్యాధి వ్యాపించసాగింది. ఖాందేశ్‌ ప్రాంతమంతా ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో ఖాందేశ్‌తో పాటు, సాత్పురా పర్వతశ్రేణుల్లో భారీగా పశు ప్రాణనష్టం సంభవించింది.
ఈ భయానక వ్యాధి నుంచి రాజ్యాన్ని రక్షిం చేందుకు క్రీస్తుపూ ర్వం 1250 కాలం లో రాజు ఈశ్వర్‌ సేన్‌ గ్వాలివదా నుం చి మూడు కిలోమీట ర్ల దూరంలో మను దేవి మాత ఆలయా న్ని నిర్మించారు.

అ నంతరం గ్వాలివదా కు, ఆలయానికి మధ్యలో ఆయన 13 అడుగుల వెడల్పుతో గోడను నిర్మించారు.
గ్వాలివదాకు మాన్‌మోది వ్యాధి నుంచి, భూతప్రేతాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. మనుదేవి మాత ప్రస్తా వనను మనం భగవద్గీతలోనూ చూడవచ్చు. మధుర వెళ్లే ఘట్టంలో సాత్పురా పర్వతశ్రేణుల్లో మనుదేవి మాత ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రస్తావన ఉంది. ఈ పురాతన ఆలయంలో ఏడు నుంచి ఎనిమిది బావులు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో మనుదేవి, గణేష్‌, శివలింగం, అన్నపూర్ణ మాత విగ్రహాలు బల్పడ్డాయి. ఆలయం చుట్టూ, ముందు భాగంలోనూ ప్రకృతిశోభాయమానమైన కొండలు ఉన్నాయి. అంతేకాకుండా అదమైన వాటర్‌ఫాల్‌ ‘కావ్‌తాల్‌’ ఉంది.

-ఈ ఆలయానికి భక్తులు ఏడాదిలో నాలుగు సార్లు వస్తుంటారు. నవరాత్రి సమయాల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. మను దేవి కృపా కటాక్షాల కోసం దేశం నలుమూ లల భక్తులు ఇక్కడకు వచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా మహారాష్టల్రో నూతన దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉంది. తమ సంసార జీవితం సాఫీగా సాగాలని కొత్త దంపతులు పూజలు చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం, సాత్పురా మనుదేవి ఆలయ ట్రస్టు సంయుక్తంగా ఆలయం వరకు రోడ్డు వేశాయి. ఈ రోడ్డు వేయక ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు ఆలయానికి కాలిబాటన వచ్చేవారు.
ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం ద్వారా.. భుసావల్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో యావల్‌ ఉంది. అక్క డ నుంచి బస్సులో మనువాడి ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా.. దేశం లోని ప్రధాన ప్రాంతాల నుంచి భుసావల్‌కు రైలు సౌకర్యం ఉంది. విమానమార్గం.. ఔరంగాబాద్‌ విమానా శ్రయం 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Courtesy with : Sunday edition of Surya Telugu daily 23 Nov 2013
  • =============================
visit my website : Dr.Seshagirirao.com

Sunday, December 15, 2013

Mumbai Mahalakshmi,ముంబయి మహాలక్ష్మి





దేశ వాణిజ్య రాజధాని ముంబయి... ఆర్థిక నగరంగా వెలగొందడానికి అక్కడ వెలసివున్న శ్రీమహాలక్ష్మే కారణం అని చెబుతారు. అక్కడికి వెళ్లిన వారెవరైనా ఆ దేవి ఆలయాన్ని సందర్శించకుండా తిరిగిరారు. సముద్రతీరంలో మహాలక్ష్మి వెలసివున్న ఆ ప్రాంతాన్ని కూడా 'మహాలక్ష్మి' పేరిటనే వ్యవహరించటం విశేషం. లక్ష్మీదేవి ఆల యమైనా, అక్కడ దేవి, కుడివైపున శ్రీమహాకాళి, ఎడమవైపున శ్రీమహా సరస్వతి కనిపిస్తారు. ఆ విధంగా మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న ఆ చల్లని తల్లి కొలువైవున్న మహాలక్ష్మి ఆలయ విశేషాలు

పురాతన దేవాలయాల్లో ముంబయి లోని మహాలక్ష్మి దేవాల యం ఒకటి. ఈ దేవాలయం ముంబయి నగరంలో బ్రీ చ్ క్యాండీలోని బి.దేశా య్ రోడ్‌లో నెలకొని ఉంది. అరేబియా స ముద్రపు ఒడ్డున కొలు వైవున్న మహాలక్ష్మి మా తను సందర్శించి ఆమె దీవెనలు పొందేందుకు లక్షలమంది భక్తులు వస్తుం టారు. అష్టైశ్వర్యాలను ఒసగే మహాతల్లిగా హిందువులు మహా లక్ష్మిని కొలుస్తారు. ఈ దేవాలయాన్ని ఒకసారి పరికించి చూస్తే... ఆలయ ప్రధాన ద్వారం అద్భుతంగా తాపడం చేయబడి వుంటుంది. లక్ష్మీమాతకు పూజలు చేసేందుకు పూలు, ఇతర పూజ సామగ్రి ఆలయ ప్రాంగ ణంలోని షాపులలో లభ్యమవుతాయి.

స్వర్ణాభరణాలతో సంపదల తల్లిగా గోచరించే ఇక్కడి మహాలక్ష్మి రూపు హిందూ గృహాల్లో కనబడుతుంటుంది. సిరిసంపదలనొసగే ముంబయి మహాలక్ష్మికి భక్తకోటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. దేవాలయం చరిత్ర గురించి చూసినప్పుడు... ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర వుంది.

ఆసక్తి గొలిపే ఆలయ చరిత్ర...
నాలుగు దశాబ్దాల క్రితం విదేశీయుల ఆక్రమణలకు వెరచిన స్థానికులు తమ దేవతలను కాపాడుకోగలిగిన వారు కాపాడుకున్నారు. కుదరనివారు, ఆయా దేవతలను సగౌరవంగా సముద్రం పాలు చేశారు. అలా సమద్రగర్భం లోకి చేరిన కొన్ని విగ్రహాలు కాలాంతరాన కొట్టుకువచ్చి, మళ్లీ జనం చేత పూజలందున్న గాథలూ వున్నాయి. సరిగ్గా అలాంటి చరిత్ర గల ఆలయాల్లో ఒకటి శ్రీమహాలక్ష్మి ఆలయం. 1775 ప్రాంతాల్లో ముంబయి ప్రాంతంలోని ఏడు ద్వీపాలనూ బ్రిటిష్‌వారు పోర్చుగీసువారికి అప్పజెప్ప వలసివచ్చింది. సప్తద్వీపనగరంగా బొంబాయిని ఏకంగా తీర్చాలని లార్డ్ హాననీ అనే బ్రిటిష్ అధికారి ప్రయత్నిం చాడు. ఎంత శ్రమించినా, సముద్రతరంగాల ధాటికి ఆగలేక పనులన్నీ పాడయ్యేవిట. అందరికీ ఆశ్చర్యమూ, ఆందోళనా కలుగుతున్న తరుణంలో, కాంట్రాక్టర్ రామ్‌జీ శివాజీప్రభుకు, స్వప్నంలో శ్రీదేవి దర్శనమిచ్చి, తన విగ్రహం సముద్రంలో నిక్షిప్తమై వుందనీ, దాన్ని ముందు జలంలోంచి బయటికి తీస్తే పనులు నిరాటంకంగా సాగుతాయనీ చెప్పిందట. ఆ సంగతి అతను పై అధికారులకు చెబితే, నిజానిజాలు పరీక్షించగోరిన వారు, సముద్రంలో వెతకసాగారు. ఎంత వెతికినా విగ్ర హం కానరాలేదు. వారి పనులూ ప్రారంభం కావటం, ఆగి పోవటం జరుగుతూనేవున్నాయి. చివరికి కొందరు నావి కులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, మహా భయంకరంగా వర్షం ప్రారంభమైంది. ఆ వర్షంలోనే కృష్ణ మోరే అనే నావికునికి, దేవి మూడు శిరస్సులతో దర్శనమి చ్చింది. అందరూ తమ ప్రాణాలు కాపాడమని ప్రార్థించిన మీదట, కృష్ణమోరే వేసిన వలలో మూడు విగ్రహాలు లభించాయి. తరువాత ఆంగ్లేయులు ఆ దేవీవిగ్రహాలను ప్రతిష్ఠాపించి, ఆలయ నిర్మాణం చేయించారు. మంగళ వారాల్లో ఈ తల్లికి విశేషంగా పూజలు జరుగుతాయి. నవ దంపతులు ఈ దేవి ఆశీస్సుల కోసం వస్తుంటారు. ముంబ యిలోని మహమ్మదీయులకు సైతం, ఈ దేవి పట్ల భక్తిప్రపత్తులు వుండటం మరో విశేషం.

ఆలయంలో మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి విగ్రహాలున్నాయి. మూడు విగ్రహాలకు ముక్కు పుడకలతోపాటు, బంగారు గాజులు వజ్ర వైఢూర్యాలతో తయారుచేసిన నగలు వున్నాయి. ముగ్గురమ్మలను చూసిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోవాల్సిందే. ఎవరైతే త్రికరణశుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోర్కెలు తప్పక నెరవేరతాయని చెప్పబడింది. అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు బారులు తీరి వుంటారు. సమయం ఎంతైనా... లక్ష్మీమాతను దర్శించి పూజలొనర్చిన తర్వాతే భక్తులు తిరుగుముఖం పడతారు.

ఎలా వెళ్లాలి...
వాణిజ్య కేంద్రమైన ముంబయికు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ముంబయి చేరుకున్నవారు స్థానిక బస్సులలో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో వుంటాయి. ఈ టాక్సీలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాలనుంచి కూడా వుంటాయి.

Courtesy with Surya Telugu daily news paper sunday magazine 25.Aug.2013
  • ===========================
visit my website : Seshagirirao.com

Saturday, December 14, 2013

Gang-Gowriswara temple,గంగా గౌరీశ్వర ఆలయం,Shiv Ling in Water,గంగలో శివలింగం

  •  

  •  
Gang-Gowriswara temple,గంగా గౌరీశ్వర ఆలయం,Shiv Ling in Water,గంగలో శివలింగం

'గంగాతరంగ రమణీయ జటాకలాపం...' అని విశ్వనాథాష్టకంలో కాశీవిశ్వనాథుణ్ణి కీర్తిస్తాం. గంగను తన జటాఝూటంలో ధరించిన గంగాధరుడు... ఆ గంగతోనే ఆవిర్భవించిన ఆలయం విశాఖపట్టణం జిల్లా చోడవరంలో (జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో) ఉంది.

చోళరాజు గౌరీశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రోజులవి. పరమ శివభక్తుడైన అతడికి ఒకనాడు శివుడు కలలో కనిపించి 'నీ కోటకు తూర్పున గంగాదేవితో సహా వెలసి ఉన్నాను' అని చెప్పాడట. మర్నాడు ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వి చూడగా, చుట్టూ గంగతో 4 అడుగుల ఎత్త్తెన శివలింగం కనిపించిందట. అదే రోజు ఓ రైతు తన పొలం దున్నుతుండగా నంది, ద్వారపాలకుల విగ్రహాలు బయటపడ్డాయట. రాజుకి రైతు ఈ విషయాన్ని చెప్పగానే... రాజు వెంటనే ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడట. గంగతో కలిసి ఉండటం వలన ఆ దేవాలయానికి 'గంగా గౌరీశ్వర ఆలయం' అని నామకరణం చేశారు. ఆ తరవాతి నుంచీ ఈ ప్రాంతం పాడిపంటలతో వర్ధిల్లిందట. కొన్నాళ్ల తరవాత ఈ ప్రాంతంపై తురుష్కులు దండయాత్ర చేశారు. రాజు వాళ్లతో పోరాడి గెలిచాడు. కానీ, తురుష్కులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. దాంతో శివలింగం ధ్వంసమైపోయింది. ఆలయంతోపాటూ శివలింగాన్ని కూడా పునరుద్ధరించాలనుకున్నాడు రాజు. అప్పుడు ఈశ్వరుడు కలలో కనిపించి 'లింగం ఇప్పుడున్న స్థితిలోనే పూజాదికాలు నిర్వహించు' అని ఆదేశించాడట. దాంతో, నాటినుంచి నేటి వరకూ శిథిల లింగానికే పూజలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆలయాన్ని ఎన్నిసార్లు పునరుద్ధరించినా... శివాజ్ఞ ప్రకారం లింగాన్ని మాత్రం పునఃప్రతిష్ఠ చెయ్యలేదు.

దేశంలో మరెక్కడా లేని విధంగా గంగతో సహా స్వయంభువుగా శివలింగం ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. మండు వేసవిలో సైతం ఈ ఆలయ కోనేటిలో నిండుగా నీరుంటుంది. అప్పట్లో ప్రజలు ఈ కోనేటిని తాగునీటి కోసం ఉపయోగించేవారు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమినాడు అన్నదానం చేస్తారు.

ఈ ఆలయానికి సమీపంలోనే మరో స్వయంభూ శివాలయం... సోమలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడి కొండపై పచ్చనిచెట్లమధ్య వెలసిన శివలింగం... ఉన్నచోటనే తనంతట తాను తిరుగుతుండేదట. అందుకే ఈ ప్రదేశాన్ని 'లింగాల తిరుగుడు' అని పిలుస్తారు. ఇప్పుడు మాత్రం శివలింగం తిరగడం లేదు. ఈ ఆలయానికి ప్రకృతి రమణీయత మరో అలంకారం. కార్తీకమాసంలోనూ, శివరాత్రి వంటి పర్వదినాల్లోనూ సోమవారాల్లోనూ ఈ స్వయంభూలింగాలను దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.

courtesy with Eenadu sunday magazine-August 04, 2013.
- జి.నిరంజన్‌పట్నాయక్‌, న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం.
- చంద్రమౌళిక సాపిరెడ్డి, ఈనాడు పాత్రికేయ పాఠశాల.

  • =================================
Visit my website : Dr.Seshagirirao.com