Monday, February 17, 2014

Venugopalaswamy Temple-Janam chunduru(Guntur),సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయ-జూనం చుండూరు గ్రా.(గుంటూరు)

  •  
Venugopalaswamy Temple-Janam chunduru(Guntur),సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయ-జూనం చుండూరు గ్రా.(గుంటూరు)
  •  

చేతిలో పిల్లనగ్రోవి.. అటూ.. ఇటూ శంఖు, చక్రాలు.. కుడిభాగంలో దశావతారాలు.. ఎడమ భాగంలో సప్తరుషులు... విగ్రహం కింది భాగంలో ఇరువైపులా ఉభయ దేవేరులైన రుక్మిణీ, సత్యభామలు.. గోవులు.. ఇదీ గుంటూరుకు సమీపంలోని చౌడవరం పంచాయితీ పరిధిలోగల జూనం చుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయ దృశ్యం. నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది.

-క్రీస్తు పూర్వం అంటే దాదాపు 1500 సం వత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాల యంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్‌ ప్రణవ స్వరూపం లో (ఓంకారం) ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామిని శిల్పి మలిచారు. దేశంలో మరెక్కడా ఇటు వంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండన్నది పెద్దల కథనం. ఈ ఆదిప్రణవ స్వ రూపంలో చుట్టూ దశావతరాలు, సప్త్తరుషు లు, వేణుగోపాలునికి ఇరుప్రక్కల గోపికల మాదిరి రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు. చూసే వారికి ఈ విగ్రహంలో స్వామివారి పరమార్థం, ఆంతర్యం గోచరించక మానదు. శక్తి మొత్తం ఈ విగ్రహంలోనే వుందనటానికి ఈ ‘‘నిదర్శనాలు’’ కనిపిస్తున్నాయి.

ఇదీ ఆలయ చరిత్ర
బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యు ల వంశచరిత్రలో స్వామివారిని వీరు దర్శించుకున్నట్లు తగిన ఆధారాలున్నా యి. కొండవీటి రెడ్డి రాజులైన కొమరిగిరి రెడ్డి (కర్పూర వసంత రాయలు) వారి సోద రులు పలుమార్లు స్వామి వారిని దర్శించిన ఆధారాలున్నాయి. వీరి ఆస్థాన నర్తకి ‘‘లకుమాదేవి’’ ఈ స్వామిని ఆరాధ్యదైవంగా కొలించిందట. నాడు గుంటూరు జమిందారులు ఆరోగ్య పరిస్థితులు సరిగాలేని సమయంలో స్వామివారిని దర్శించిన పిమ్మట వారి ఆరోగ్యం కుదుటపడటంతో వీరు స్వామివారి కి కొంత భూమిని దానం చేశారు. ఇప్పటీకీ ఆ భూమి దేవాలయం వారి ఆధీనంలో సాగుబడి జరుగుతోంది. ఈ చరిత్ర మిగిల్చిన సాక్షాలను ఇంకా మద్రాసు వాత్రప్రతుల గ్రంథాలయంలో అక్షర రూపం దాల్చి నిక్షిప్తంగా మిగిలి ఉన్నాయి.

ఈ దేవాలయాన్ని ఎప్పుడు ఏరాజులు నిర్మించారో ఇతమిద్ధంగా తెలియనప్పటికీ క్రీస్తుపూర్వం నాటి ఆధారాలవల్ల ఈ దేవాల యాన్ని ఆనాడే నిర్మించే ఉంటారని గ్రంథా లయ ద్వారా స్పష్టమౌతోంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచినా నేటికీ స్వామివారి విగ్రహంలో ‘‘తేజస్సు’’ చెక్కు చెదరక పోవ డం విశేషంగా చెప్పుకోవచ్చు. అదే ఈ ప్రాంతవాసులను కాపాడుతుందన్నది వారి కి నిగూఢమైన విశ్వాసం. ఇప్పటికీ ఈ దేవాలయం నాలుగుసార్లు పునఃనిర్మాణం జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. వార్షికం గా స్వామివారి ‘‘తిరు కళ్యాణం’’ ఫాల్గుణ పౌర్ణమికి జరుగుతుంటాయి. వార్షిక పం డుగ ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తు న్నారు. ప్రధానంగా స్వామి వారి గ్రామోత్స వాలలో గ్రామ యువకులు ప్రముఖ పాత్ర వహిస్తారు.

నాటి బ్రాహ్మణ అగ్రహారమే..
పూర్వం ఇది బ్రాహ్మణ అగ్రహారం. ‘‘నేతి’’ వారి దంపతులకు జన్మించిన పుత్రికల పేరున ఈ గ్రామ నిర్మాణం జరిగింది. జ్వాలాముఖి, చండికా అనేవీరి పేర్లు మీదుగా నిర్మాణమై జ్వాలా చండికాపురం జూనం చుండూరుగా రూపాంతరం చెందింది. ఇది గుంటూరు పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ని ఓ చిన్న కుగ్రామం. ఈ జూనం చూండురు అగ్రహారం కాస్తా నేడు కుచించుకు పోయి చివరకు ఒకే కుటుంబం స్వామివారి అర్చక నిమిత్తం వుండిపోయింది. వారు మాత్రమే స్వామి వారికి సేవలు చేసుకుంటూ స్వామిని ప్రగాఢంగా నమ్ముకొని నివాసం ఏర్పాటు చేసుకొని జీవితం వెళ్లదీస్తున్నారు.

స్వామి వారిపై ప్రముఖుల ఆశుపద్యాలు
కొండవీటి రెడ్డి రాజుల ఆస్థాన విద్యాధికారి, కవి సార్వభౌముడు ‘శ్రీ నాధ కవి’ స్వామి వారిని చూసి సమ్మోహనుడై ‘గోపాలశతకం’ రచించినట్లు నానుడి. ఈ 20వ శతాబ్దంలోని ప్రముఖ కవులెందరో ఈ స్వామి వారిని కనులారా వీక్షించి, జన్మ ధన్యతను పొందారు. వీరిలో ముఖ్యులు కీ.శే. కరుణశ్రీ జంధ్యా పాపయ్య శాస్ర్తి, కుర్తాళం పిఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి (ప్రసాదరాయకులపతి) డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు, కోగంటి సీతారామచా ర్యులు, కీ.శే. పరాశరం గోపాల కృష్ణమాచార్యులు, ప్రముఖ నవలా రచయిత లల్లాదేవి, జంధ్యాల జయకృష్ణ బాపూజీ వంటి మహనీయులు ప్రణవస్వరూపుని దర్శించి వీక్షించి ఆశుపద్యాలను వినిపించారు.

  • courtesy with : Surya Telugu daily news paper-27/02/2011
*=================================* *
 Visit my website : Dr.Seshagirirao.com _

Kolluru Mukambika Temple(Karnataka),కొల్లూరు మూకాంబికా దేవాలయం-కొల్లూరు(కర్నాటక)





-కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 130 కి.మీ దూరంలో కొల్లూరులో నెలవైన విద్యనిచ్చే చదువులతల్లి మూకాంబిక దేవాలయం పశ్చిమ కనుమల సానువుల్లో దట్టంగా చిక్కటి అడవులు, గలగలా పారే సౌపర్ణికా నదీ పరవళ్ళు, లేలేత సూర్యకిరణాలు ప్రసరించే ఉషోదయాన మెరిసిపోతున్న వేళ ప్రకృతి అందాలు మరింత ఇనుమడించిన ఆ పవ్త్రి జలాల్లో స్నానమాచ రించి మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవడం పరమ పవ్త్రిం. విద్యార్థి లోకానికి సర్వ వర ప్రదాయిని ఈ మూకాంబికా అమ్మవారు. ఆలయం దట్టమైన అడవుల మధ్య వెలసిన అతి ప్రాచీనమైన దేవాలయం. దేశంలోని నలుమూలలనుండి మూకాంబికా దర్శనం కోసం వేంచేస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలోని ఏడు మోక్ష పురాల్లో సుబ్రహ్మణ్య, కుంభాసి, కోడేశ్వర, ఉడిపి, శంకర నారాయణ, గోకర్ణం, కొల్లూరు మూకాంబికా గుడి ఒకటి. పూర్వాశ్రమంలో కొల్లూరును మహారణ్యపురమని పిలిచేవారు.

ఆలయ వైశిష్ట్యం: మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగల వారై జ్ఞాన సంపన్నులౌతారని ప్రతీతి. అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం ఉంది. సింహ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే, గుడివైపున కాలభైరవుడు దర్శమిస్తాడు. 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన మూకాంబిక ఆలయాన్ని ప్రతిరోజూ కొన్నివేలమంది భక్తులు దర్శించుకుంటారు. వీరిలో ఎక్కువశాతం కేరళవాసులే కావడం విశేషం. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసిన ‘పంచకడ్జాయం’ అనే ప్రసాదం పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత, ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట.

ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కొని ఆ ప్రసాదాన్ని తిన్నాడట. అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం తిన్నందువల్ల, అతడు మహా పండితుడయ్యాడని అంటారు. అందుచేత కేరళ ప్రజల్లో అమ్మవారిపై అపార విశ్వాసం. ప్రతిరోజు ఈ ఆలయంలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాలు భక్తుల విశ్వాసానికి నిదర్శనం.

కొల్లూరు క్షేత్ర మహిమ
ఈ కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడం, దేవి ప్రత్యక్షమవ్వడం తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడగడం, దేవి కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట నడవడం కాని వెనక్కి తిరిగి చూడ వద్దని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పడం...ఆ షరతుకు అంగీకరిం చిన శంకరాచార్య ముందుకు నడుస్తూ.. . వెనుక అమ్మవారు వెళ్తూ వెళ్తూ కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో వెనుకకు తిరిగి చూడడం ఇచ్చిన మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరుల వారు శ్రీ చక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి.

  • పి.శారద, (పి.హెచ్‌.డి) జర్నలిజం.November 15, 2012@Surya Telugu daily news paper

  • *=================================*
 * Visit my website : Dr.Seshagirirao.com _

Mukambica temple(karnataka-Udipi dist.), మూకాంబికాదేవి దేవాలయం(కర్నాటకలోని ఉడిపిజిల్లా, కుందాపూర్ తాలూకా)






కామాసురుడు మృత్యుంజయుడుగా ఉండాలనుకుంటే స్త్రీ శక్తి ఊరుకుంటుందా? ఊరుకోదనడానికి ఉదాహరణే మూకాంబిక దేవత. ఈ దేవత, ఆమె క్షేత్ర మహిమ గురించి తెలుసుకోండి.

అత్యంత ప్రాచీన శక్తి క్షేత్రాలలో మూకాంబికాదేవి క్షేత్రం ఒకటి. ఇది కర్నాటకలోని ఉడిపిజిల్లా, కుందాపూర్ తాలూకాలో 17వ జాతీయ రహదారిని ఆనుకుని, పడమటి కనుమలలోని కొడచాద్రి పర్వతపాదాల చెంత ఉంది. ఈ క్షేత్రానికి ఉత్తరాన సౌపర్ణికా నది ఉంది. సుపర్ణ అనే పేరుగల గరుడపక్షి ఈ నది ఒడ్డున తపస్సు చేసి మోక్షాన్ని పొందినందున దీనికి సౌపర్ణికానది అనే పేరు వచ్చిందంటారు. ఈ తీర్థంలో ఎన్నో ఔషధాలున్నాయని, అందువల్ల ఇక్కడ స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ దేవి స్వయంభూలింగంగా వెలిసిందనీ, సాక్షాత్తు పరమశివుడు తన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామికి ఈ క్షేత్ర మహిమ తెలియచేయగా ఆయన ఇక్కడ తపస్సు చేశాడని కథనం.

మూకాసురుని సంహారం

కృతయుగంలో ఈ పరిసరాల్లో కామాసురుడనే రాక్షసుడు దేవతలను, ఋషులను నానా హింసలు పెట్టేవాడట. వాడు తపస్సు చేసి, పరమేశ్వరుడి అనుగ్రహంతో మరణం లేకుండా చేసుకోవాలని సంకల్పించాడట. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే వరాన్ని కోరుకోవడానికి వీలులేకుండా దేవి కామాసురుడి నోరు పడిపోయేలా చేసిందట. అయినా కామాసురుడు దేవతలను, ఋషులను వేధిస్తుంటే జేష్ట శుక్ల అష్టమినాడు (ఈ క్షేత్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న మారణఘట్టం) కొడచాద్రి కొండమీద దేవి వీడిని వధించిందట. మూకాసురున్ని వధించింది కనుకనే దేవికి మూకాంబికాదేవి అని పేరు వచ్చిందని కథనం.

దేవికి ఎం.జి.ఆర్. కరవాలం కానుక

ఈ దేవాలయం కేరళ వాస్తు శైలిలో నిర్మించబడి ఉంటుంది. లోపలికి ప్రవేశించగానే 20 అడుగుల దీపస్తంభం వెలుగులు విరజిమ్ముతూ కన్పిస్తుంది. దానికంటె కొద్ది చిన్నగా ఉన్న గజస్తంభం బంగారుపూతతో మెరుస్తూ ఉంటుంది. ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాత భక్తులు గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. గర్భగుడిలోకి పురుషులు చొక్కా, బనియన్లతో వెళ్లకూడదు. మూకాంబికాదేవి భక్తులకు పద్మాసనంలో దర్శనమిస్తుంది. శాంత ప్రేమ స్వరూపిణిగా కన్పిస్తుంది. నాలుగు చేతుల దేవికి పై రెండు చేతుల్లో శంఖుచక్రాలుండగా, కింద చేతులు ఒకటి అభయముద్రలోనూ, మరొకటి వరదముద్రలోనూ ఉంటాయి. దేవిలో శౌర్యాన్ని చూపించే బంగారు కత్తిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎం.జి. రామచంద్రన్ బహూకరించారు. ఆయన దేవిని తరచూ దర్శించుకునేవారట.

ప్రస్తుతం ఉన్న దేవి పంచలోహ విగ్రహాన్ని శ్రీచక్రంతో పాటు తయారుచేయించి ప్రతిష్టించినవారు ఆదిశంకరాచార్యులవారట. దేవి గర్భగుడి వెనుక పశ్చిమ భాగంలో ఆదిశంకరాచార్యుల వారి పీఠం ఉంది. మొదట్లో దేవి ఉగ్రరూపంలో ఉండేదని, శంకరాచార్యులవారు బాల్యంలో కాలినడకన ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఆమె ఉగ్రరూపం చూసి భయపడి ప్రసన్నురాలిని చేసుకొని శాంతస్వరూపిణిగా మార్చారని కథనం. దేవి అనుగ్రహంతోనే ఆయన తపస్సు అనంతరం ఉత్తర ప్రాంతానికి తరలి వెళ్లారంటారు. తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులందరూ ఈ క్షేత్రాన్ని ఎంతోకొంత అభివృద్ధి చేస్తూ వచ్చారు.

వినాయకుడికి కుడివైపు తొండం

మూకాంబికాదేవి మూర్తికి ముందు ఆమె స్వయంభూ లింగం ఉంటుంది. ఈ లింగం ఒక గీతతో రెండు (సమానం కాని) భాగాలుగా విడదీయబడి ఉంటుంది. చిన్నభాగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్థావరమని, పెద్ద భాగం సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీల నెలవని - అక్కడే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఉంటాయంటారు. అలంకరణలు, పూజలు మూకాంబికాదేవికి, అభిషేకాలు మాత్రం లింగానికి నిర్వహిస్తారు. ఉదయం 5 గంటలనుండి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంచే ఈ దేవాలయ దక్షిణ భాగంలో పది చేతులున్న దశముఖ బాలమురారి గణపతి మందిరం ఉంది. ఈ గణపతికి తొండం కుడి వైపున ఉండటం విశేషం. దేవాలయ ప్రాంగణంలో సరస్వతీ మందిరం కూడా ఉంది. రాత్రి ఊరేగింపు తర్వాత మూకాంబికా ఉత్సవ విగ్రహాన్ని సరస్వతీ దేవి మంటపంలో ఉంచుతారు. ఇక్కడ చాలామంది తమ పిల్లల చేత అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు.

సెప్టెంబర్ - అక్టోబర్‌లలో సందడి

కొల్లూరు క్షేత్రానికి హనుమంతుడితో కూడా అనుబంధం ఉందట. ఆయన లంకనుండి హిమాలయాలకు వెళ్లేటప్పుడు, సంజీవని పర్వతంలోని కొంత భాగం విరిగి కొడచాద్రి పర్వత ప్రాంతంలో పడింది కాబట్టే ఈ ప్రాంతంలో అనేక ఔషధ మూలికలు దొరుకుతాయని కథనం. ఈ క్షేత్రం ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు కూడా పేరొందింది. మూకాంబికా క్షేత్ర దర్శనం ఒక మరువరాని ఆధ్యాత్మిక అనుభూతి. కొల్లూరులో యాత్రికులు బస చేయడానికి ఆధునిక సౌకర్యాలతో దేవస్థానం వారి వసతి గృహాలు ఉన్నాయి. మార్చి - ఏప్రిల్ నెలల్లో జరిగే రథోత్సవానికి, సెప్టెంబర్ - అక్టోబర్‌లలో జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలకు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రాలలో కొల్లూరు మూకాంబికాక్షేత్రం ఒకటి.

  • - కృష్ణావఝల సుబ్రహ్మణ్యం@Andhrajyoti news paper December 27th, 2010December 27th, 2010


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Saturday, February 15, 2014

Mogileeswarudu temple-Mogili vil(Chittoor dist..),మొగిలీశ్వరుడు-మొగి లి గ్రామం(చిత్తూరు జిల్లా)




-హిందువులకు మహాపవిత్ర దినమైన మహాశివరాత్రి నాడు వ్రతమాచరిస్తే శత అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆరోజు శివలింగాన్ని అభిషేకించే లింగా ర్చనకు ఎనలేని ప్రాధాన్యం. అటువంటి క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో మల్లిఖార్జున ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్రాక్షారామం, భీమేశ్వరాలయం ఎంతో ప్రాముఖ్య తను పొందాయి. వాటితో పాటు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గంలోని బంగారు పాళ్యం మండల పరిధిలోని అటవీ ప్రాంతా నికి దగ్గరగా దక్షిణ కాశీగా పేరొందిన మొగి లి గ్రామం కూడా ప్రసిద్ధమైనదే. ఇక్కడ వెలసి న శ్రీ ప్రసన్న కామాక్షి సమేత శ్రీమొగిలీశ్వరా లయం పంచ క్షేత్రాల్లో మొదటిగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

ప్రతి ఏడాది మహశివరాత్రి సందర్భంగా పది రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మో త్సవాలకు చిత్తూరు జిల్లా వాసులేగాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. దేవాలయం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, ప్రకృతి ప్రసాదించినట్లుగా చల్లటి గాలితో ఆహ్లాదకరంగా కనిపించే వాతావరణం వుంటుంది. ఇక్కడి పకృతి పచ్చదనాని కి ఆకర్షితులై కూడా అనేక మంది పర్యాట కులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

--ఆలయ చరిత్ర : ప్రస్తుతం పుష్కరిణిగా ఉన్న ప్రదేశంలో మొగిలిపొద ఎక్కువగా ఉండేది. ఈ పుష్కరిణిలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా నంది విగ్రహం నోటి నుంచి నీరు కరువులోను నిరంతరాయంగా వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ అంతుబట్టలేదు. అప్పట్లో ఓ మొగిలి పొదలు మధ్య ఒక నీటి దారువ ఉండేదని, మేత మేసిన పశువులు ఈ పొదల మధ్య సేద తీర్చుకొని పక్కన ఉన్న నీటి ధారలో నీళ్ళు తాగుతూ ఉండేవని చెబుతుంటారు. ఒక రోజు నీటి ధారలో నల్లటి రాయి పశువులు తాగే నీటికి అడ్డు రావడంతో మొగిలప్ప ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించాడు. ఆ రాయి కదలక పోవడంతో తన వద్దనున్న గొడ్డలతో రాయిపైకొట్టగా ఆ దెబ్బకు ఆ రాతి నుంచి రక్తం కారడంతో భయభ్రాంతులకు గురయ్యాడు. దెబ్బ తగిలిన ఆ రాతికి అతను ఆకు పసురుతో చికిత్స చేసి ప్రతి రోజు భక్తితో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

-మొగిలప్పకు చెందిన ఆవుల్లో ఒక ఆవు పాలు పితకనివ్వక తంతూ గ్రామానికి దక్షిణ దిశలో మూడు కిలో మీటర్లుదూరంలో గల దేవర కొండకు వెళుతూ ఉండేది. ఆ రహస్యం తెలసుకోవడానికి ఓ రోజు మొగిలప్ప ఆవును వెంబడించగా ఆవు కొంతదూరం వెళ్ళి స్వరంగ మార్గం గుండా వెళ్ళింది. ఆ ప్రదేశంలో సాక్షాత్తు కైలాసాన్ని మరుపింప చేసే అద్బుత దృశ్యాన్ని చూసి చీకట్లో అలాగే నిశ్చేష్టుడై ఉండి పోయాడు. పార్వతి దేవి అక్కడ ఉన్న శివలింగానికి పాలభిషేకం చేస్తూ చీకట్లో నిలబడి ఉన్న మొగిలిప్పను చూసింది. అందుకు భయభ్రాంతులకు గురైన మొగిలప్ప శరణు కోరగా ఈ రహస్యాన్ని ఎక్కడా బయటకు చెప్పరాదని చెప్పింది. దీంతో అతను దైవ చింతనా పరాయణుడిగా మారిపోయాడు. భర్త దైవచింతనను గమనించిన భార్య గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించింది. తాను నిజం చెబితే మరణిస్తానని మొగిలప్ప ఎంత చెప్పినా వారు వినకపోవడంతో విధిలేని పరిస్ధిలో మొగిలప్ప చితిపేర్చమని చెప్పి, చితిపై కూర్చోని తాను చూసిన సంఘటలన్నీ వివరించాడు. వెంటనే మొగిలప్ప తల పగిలి మృతి చెందాడు.

ఇతని పేరుమీదనే ఈ దేవాలయంలోని దేవునికి మొగిలీశ్వరుడు అనే నామం ఏర్పడింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఈ దారిగుండా వెళ్తూ శివలింగాన్ని దర్శించుకొని వ్యాపారంలో అధిక లాభాలు అర్జించేవారు. తమ భక్తికి నిదర్శనంగా మొగిలీశ్వరునికి మొగిలివద్ద ఆలయం నిర్మించారు. ఆ నాటినుండి నేటి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొగిలిలో అతి వైభవంగా జరుగుతున్నాయి.

  • Courtesy with : Surry Telugu daily news paper sunday edition-27/02/2011

*=================================*
 * Visit my website : Dr.Seshagirirao.com

Friday, February 14, 2014

Matsya girindrudu swami temple-kottagattu(karimnagar dist),మత్స్య గిరీంద్రుడి దేవాలయం-కొత్తగట్టు గుట్ట(కరీంనగర్‌ జిల్లా)




మత్స్యగిరీంద్రుని అవతారం విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోకి ఎంతో విశిష్టమైంది. దశావతారాలకు సంబంధించిన ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ.. మత్సావతారానికి సంబంధించిన ఆలయాలు చాలా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన మత్సేంద్రుడి ఆలయమే.. కరీంనగర్‌ జిల్లా కొత్తగట్ట గ్రామంలో వెలసిన మత్స్య గిరీంద్రుడి దేవాలయం. మత్స్యవతారానికి సంబంధించి దేశం మొత్తంలో రెండే ఆలయాలు ఉండడం.. అవి రెండూ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. ఒకటి కరీంనగర్‌ జిల్లా కొత్తగట్టు మత్స్యగిరీంద్రుడు కాగా.. మరొకటి అనంతపురం జిల్లాలో ఉంది.

-కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో.. వరంగల్‌ - కరీంనగర్‌ ప్రధాన రహదారిలో.. కొత్తగట్టు గ్రామం వద్ద గుట్టపై వెలిశాడు. శ్రీమత్స్యగిరీంద్రస్వామి. క్రీశ 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో దేవాలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతున్నది.

మత్స్యగిరీంద్రుడి చరిత్ర...
శ్రీ మహా విష్ణువు లోక కళ్యాణర్థమై సప్త సముద్రాలలో విహారిస్తున్న సమయంలో ఆయన కునుకు తీయడంతో వేదాలు సముద్రంలో జారిపడతాయి. దాంతో రాక్షసుడు అపహరించి సముద్రం అంతర్భాగంలో దాచి పెడతాడు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని వేడుకోవడంతో మహా విష్ణువు అవతారలలో అత్యంత విశిష్ట అవతారమైన శ్రీమత్స్యగిరీంద్రస్వామి అవతారమెత్తి సముద్ర అంతర్భాగంలోనున్న వేదాలను పైకి తీసి, రక్షించి లోకాపకారం చేశాడని ప్రతీతి. అలాంటి అవతార పురుషుని అంశమే కొత్తగట్టు గ్రామంలో గుట్టపై మత్స్యగిరీంద్రునిగా వెళిశాడని ప్రతీతి. అలా ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల అభీష్టములను నెరవెర్చుతూ పూజలందు కుంటు న్నట్లు పూర్వీకుల కథనం.

-గుట్టుపై ఉన్న కోనేరులో స్నానమా చరించి స్వామివారిని దర్శిం చుకుంటే తమ పాపాలు హరించి, కోరిన కోర్కెలు నెరవెరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేగాక ఈ ప్రాంత వాసులు కోనేరులోని నీటిని పంట పొలాల్లో చల్లితే ఎలాంటి చీడపీడలు లేకుండా పంటలు బాగా పండి అధిక దిగుబడి వస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఆలయ సమీపంలో ఉన్న కోనేరు ఎప్పటికీ పోకపోవడం విశేషం. అందులో నీరు పూర్తిగా ఎన్నడూ ఇంకిపోలేదని చారిత్రక సాక్షాధారాల వల్ల తెలుస్తోంది.

మాఘ శుద్ద పౌర్ణమితో జాతర ఉత్సవాలు ప్రారంభం...
-ప్రతి ఏడాది మాఘ శుద్ద పౌర్ణమితో జాతర ఉత్సవాలు ప్రారంభమై పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల లో భాగంగా శ్రీ మత్స్యగిరీంద్రుడికి భూదేవి, నీళదేవిలతో కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం తర్వాత మరుసటి రోజు జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు.

  • - మొల్గూరి వేణుగోపాల్‌గౌడ్‌,-మేజర్‌న్యూస్‌, శంకరపట్నం@Surya daily news paper (ఆదివారం 24 జూలై 2011)


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Mahabalipuram , మహాబలిపురం(Tamilanadu)




మహాబలిపురం(Mahabalipuram) తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మి దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నై కి 70 కి.మి దూరం లొ ఉన్నది.  మహాబలిపురం వెళ్తున్న దారిమధ్యలోనే మనకి crocodile పార్క్ కనిపిస్తుంది . మనం లోపలి ప్రవేశించగానే .. ముందుగా  మనకి పాములు , తాబేలులు  స్వాగతం పలుకుతాయి. బయట బోర్డు crocodile అని పెట్టి పాములను చూపిస్తున్నాడు ఏమిటి అనుకుంటూ లోపలి నడుస్తూ ఉంటే , ఒక్కొక్కటి మనకి కనిపిస్తూ ఉంటాయి . వీటికి ఆహారం  మాంసపు ముక్కలు వేయడం  చేసారు .

 మహాబలిపురం
7 వ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కధనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.

  There are three temples of which two Shiva Temples face east and west respectively. The other one is the Vishnu Temple. The Vishnu temples were built by Narasimha Varman I and the other two were built by Narasimha Varman II. One can find the beautifully carved twin Dwarka Palaks (gate keepers) at the entrance of the east facing Shiva Temples. On both sides of the temple inside are the marvelous sculptures of Lord Brahma and Lord Vishnu with their better halves. The top part of the Shivalinga figure inside the temple is found damaged. There are sculptures of Somaskanda - lord Shiva with his better half, Parvati, and his sons, Skanda and Ganesha are found on the near wall. Apart from Lord Shiva’s sculpture, one can find the sculptures of Narasimha and Goddess Durgha also.
ఆరోజుల్లోనే ఇలాంటి నిర్మాణాలు చేయడం అంటే మాటలా... ఎటువంటి టెక్నాలజీ లేకుండా రాయిని గుడిగా మార్చడం అంటే ..ఇక్కడ సముద్రం చాల అందంగా కనిపిస్తున్న .. కెరటాలు మాత్రం దూసుకుని వస్తూ ఉంటాయ్.
 మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్న బుద్ధా విగ్రహాలు , వినాయకుని విగ్రహాలు దొరుకుతాయ్ ..

 Pancha Rathas :

బీచ్ దగ్గరనుంచి ఒక కిలోమిటర్ దూరంలో పంచరధాలు ఉంటాయ్ ..రధాలు అన్నారు కదా అని వీటికి చేక్రాలు ఉంటాయ్ అనుకోవద్దు .. ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపతి కి కుడా రధం ఉంటుంది. అవి వరుసగా ద్రౌపతి ,భీమ ,అర్జున ,ధర్మరాజు , నకులుడు & సహదేవుడు రధం ఉంటుంది.

 ద్రౌపతి రధం  (Draupadi ratha),
అర్జుని రధం Arjuna Ratha-ఇక్కడ ఏక శిలపై చెక్కిన ఏనుగు , సింహం ,నంది ఉంటాయి ..
భీముని రధం..Bhima Ratha--భీముడు అని అంటేనే పెద్ద శరీరం ఎలామనకు కనిపిస్తుందో అయన రధం కూడా అలానే ఉంటుంది .
ధర్మరాజుగారి రధం ..Dharma raju ratha ,-

 దారిలో కొండపైన లైట్ హౌస్.. కనిపిస్తుంది .. వీటితోపాటు కొండపైన చెక్కిన నిర్మాణాలు కూడా చూడవచ్చు ... అక్కడ నుంచి మహాబలిపురం ఇంచుమించు కనిపిస్తుంది.
 మహాబలిపురం లో చూస్తున్నా కోద్ది.. ఇలాంటి విగ్రహాలు రోడ్ పక్కనే ఉంటాయ్.. అక్కడకు వెళ్ళిన వెంటనే వాతావరణం మరీపోతుంది .. మనవాళ్ళ టాలెంట్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు ..

 పంచరాదాలు
 ఈ లోపల లక్ష్మి దేవి మరియు వామనావతారం .. చెక్కిన శిల్పాలు ఉంటాయ్ .

 వినాయక రధం
వినాయక రధం ఒకటే పూర్తీ అయి ఉన్నట్టు  కనిపిస్తుంది మనక

 శ్రీ కృష్ణుని వెన్న ముద్ద ....
ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం.

త్రిమూర్తులు
 బీచ్ దగ్గర ఉన్న టెంపుల్ ని చూసి అక్కడ  రధాలు ఉన్నచోటికి వెళ్ళండి  చూసాక అక్కడనుంచి లైట్ హౌస్ ఇంకా లైట్ హౌస్ దగ్గరలోనే మరికొన్ని నిర్మాణాలు ఉంటాయ్
  • Courtesy with : http://www.templeinformation.in/


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Tuesday, February 11, 2014

North Swamimalai Temple(New Delhi),ఉత్తర స్వామిమలై మందిర్‌(న్యూఢిల్లీ),సహస్రార క్షేత్రం

  •  




  •  

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ధామాల్లో ప్రఖ్యాతి వహించిన ఆరు పడైవీడు క్షేత్రాల తరవాత అంతే స్థాయిలో ఏడవ పడైవీడుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం - ఉత్తర స్వామిమలై. ఈ ఆలయం భారత దేశ రాజధాని అయిన హస్తినాపురంలో (అంటే ప్రస్తుత న్యూఢిల్లీలో) ఉన్నది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి వారు శ్రీ స్వామినాథ స్వామిగా కొలువబడతారు.

ఉత్తర స్వామిమలై తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై క్షేత్ర నమూనాలో నిర్మిం చబడినది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, కర్పగ వినాయగర్‌, మీనాక్షీ అమ్మవారు, సుందరేశ్వర స్వా మి వార్లు, ఇతర పరివార దేవతలు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాన్ని సహస్రార క్షేత్రంగా కొలుస్తారు. సుబ్రహ్మణ్యుని ఆరు పడైవీడు క్షేత్రాలు మన శరీరంలో ఆరు చక్రములకు (షట్చక్రాలు) ప్రతీకగా పెద్దలు చెప్తారు. అవి వరుసగా...
1. తిరుచెందూర్‌ - మూలాధార చక్రం.
2. తిరుప్పరంకుండ్రం - స్వాధిష్టాన చక్రం.
3. స్వామిమలై - మణిపూరక చక్రం.
4. పళని - అనాహత చక్రం.
5. పళముదిర్చొళై - విశుద్ధి చక్రం.
6. తిరుత్తణి - ఆజ్ఞా చక్రం.

వీటితో పాటు... ఉత్తర స్వామి మలై (సహస్రార చక్రం) ఏడవదిగా ప్రసిద్ధిగాంచింది. ఆరు చక్రాలతో పాటు, బ్రహ్మ రంధ్ర స్థానం అయిన సహస్రార చక్రంగా ఈ ఉత్తర స్వా మి మలై క్షేత్రం అని గురువులు, పెద్దలు నిర్ధారించారు. అందుకే ఈ ఉత్తర స్వామిమలైని సహస్రార క్షేత్రం అంటా రు (ఇక్కడ ఆలయంలో జరిగే ప్రతీ పూజా, ఉత్సవాలు అ న్నిటా సంకల్పంలో, భరత ఖండే, ఇంద్రప్రస్థ నగరే, గురు గ్రామే, సహస్రార క్షేత్రే అని ఇక్కడ అర్చకులు చదువుతారు).

ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గర్భగుడి 90 అడుగుల ఎత్తు ఉన్న కొండ మీద ఉంటుంది. తమిళ భాషలో కొండని మలై అంటారు. కాబట్టే, ఈ క్షేత్రం ‘మలై మందిర్‌’ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, కరచరణాదులతో ఉన్న భగవంతుని మూర్తిని సాధారణంగా బ్రహ్మ స్థానం లోనూ, లేదా గర్భగుడి మధ్యలోనూ ప్రతిష్ఠ చేయరు. కానీ, ఇక్కడ ప్రత్యేకత సుబ్రహ్మణ్య స్వామివారి మూల విగ్రహ మూర్తిని బ్రహ్మస్థానంలో ప్రతిష్ఠ చేశారు.

క్షేత్ర ఆవిర్భావం...
--1940వ దశకంలో ఢిల్లీ నగరంలో దక్షిణ భారతీయులు తక్కువగా ఉండేవారు. ఆ సమయంలో స్వామినాథ స్వామి వారి యొక్క ఒక మహాభక్తుడు ఉండేవారు. వారికి భగవాన్‌ రమణ మహర్షి స్వయంగా పచ్చతో తయారు చేసిన స్వామినాథ స్వామి వారి మూర్తిని బహూకరించారు. వీరు ఆ మూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో రోజూ పూజించేవారు. ప్రతీ ఏటా కార్తీకమాసంలో తమిళులు ఎంతో భక్తి శ్రద్ధల తో జరిపే స్కంద షష్ఠి ఉత్సవాలను ఈ భక్తుడు కూడా జరి పేవారు. వీరు మొదటగా 1943 లో స్వామినాథ స్వామి వారి మూర్తిని సకల జనులూ దర్శించేవిధంగా, స్కంద షష్ఠి ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. నెమ్మదిగా ప్రతీ సంవత్సరం స్కంద షష్ఠి ఉత్సవాలలో పాల్గొనే భక్తుల సంఖ్య వేలలోకి చేరింది. స్వామివారికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించవలసిన తరుణం ఆసన్నమ యింది.

భక్తులందరూ స్వామి నాథ స్వామి ఆలయం కోసం ఒక ఎత్తయిన స్థలం వెదకడం ఆరంభించారు. అయితే, కారుణ్యమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు ఆయన మందిరం యొక్క స్థలం ఎక్కడ ఉండాలో వారే ఒక భక్తుని స్వప్నంలో కనిపించి తెలియజేశారు. స్వామి ఎంచుకున్న స్థలం, ఢిల్లీ నగరంలోనే వసంత గ్రామం అనే చోట, దట్టమైన రేగిచెట్ల నడుమ ఉన్న ఒక చిన్నకొండ. ప్రస్తుతం ఈ వసంత గ్రామాన్నే ‘వసంత్‌ విహార్‌’గా పిలుస్తారు.

స్వామి వారే స్థల నిర్ణయం చేశాక, ఇక తిరుగు ఉంటుందా... ఆ తరువాత భారత ప్రభుత్వ పురాతత్వ శాఖ వారు ఈ కొండ ఉన్న స్థలాన్ని ఆధ్యాత్మిక/ధార్మిక స్థలంగా అనువైనది అని అనుమతి మంజూరు చేశారు. అప్పట్లో శ్రీ లాల్‌ బహదూర్‌ శాస్ర్తి గారు ప్రధానిగా ఉన్న రోజులు. వారి ప్రభుత్వం వసంత విహార్‌ లోని ఈ కొండ ఉన్న స్థలాన్ని 21,000 రూపాయల ధరకు ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు.

1961 అక్టోబర్‌ 18న, సుప్రీం కోర్టు జడ్జి, సంగీత కళానిధి శ్రీ వేంకటరమణ అయ్యర్‌ గారి ఆధ్వర్యంలో శ్రీ స్వామినాథ స్వామి సేవా సమాజం స్థాపించబడినది. నెమ్మదిగా ఆలయ నిర్మా ణానికి భక్తుల నుంచి విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. నిధుల సేకరణలో భాగంగా, తమిళనాడు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థా నం వారు ఇరవైఐదు వేల రూపాయలు స్వామి మలై నిర్మా ణానికి చేయి అందించారు. 1963 లో ఆ స్థలంలో ఒక చిన్న తాత్కాలిక మందిరం నిర్మించి, ఒక ఉత్సవమూర్తిని ఉంచి, నిత్యారాధనలు ప్రారంభం చేశారు.

ఇక ప్రధాన మందిర నిర్మాణం చేపట్టే దిశగా, తమిళనాడు ప్రభుత్వ అనుమతితో, ప్రఖ్యాత ఆలయ వాస్తు-శిల్ప కళా నిపుణుడు, శ్రీ గణపతి స్థపతి గారు ఉత్తర స్వామి మలై మందిర నిర్మాణం చేసే బాధ్యత స్వీకరించారు. శ్రీ గణపతి స్థపతి గారు, శ్రీ వైద్యనాథ స్థపతి యొక్క కుమారుడు. వీరి ఆధ్వర్యంలో ఎన్నో ప్రఖ్యాత ఆలయ/భగవన్మూర్తుల నిర్మాణం జరిగింది. వీరిని కంచి పరమాచార్య స్వామి వారు ఎంతో అభిమానించి గౌరవించేవారు.

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Thursday, February 6, 2014

Gokarna Temples-Gokarnam(Karnataka),ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం-దేవాలయాలు-గోకర్ణం(కర్ణాటక)

  •  
  •  

మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.

పురాణ కథ

ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.

అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.

ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట.

పురాతన ప్రాశస్త్యం

దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట.

కోటితీర్థం

గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది.

మహాబలేశ్వరాలయం

పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

తామ్రగౌరీ ఆలయం

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

మహాగణపతి ఆలయం

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.

గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్‌కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.

గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు :

ధారేశ్వర ఆలయం
ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది.

గుణవంతేశ్వర ఆలయం
ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది.

మురుడేశ్వర ఆలయం
పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది.

apr -   Tue, 21 Feb 2012,

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Tuesday, February 4, 2014

Simhachalam in Jermany , జర్మనీలో సింహాచలం




    'సింహాచలం ఎక్కడ ఉందీ అనడిగితే విశాఖపట్నం దగ్గర అని తెలుగువాళ్లెవరైనా చెబుతారు. అదే జర్మన్లయితే 'మా దేశంలోని పసావ్‌ పట్టణ సమీపంలో ఉంద'ని చెబుతారు. అంతేకాదు... భక్తి పారవశ్యంతో ఆ నృసింహదేవుని స్తుతిస్తూ ఆలయాన్నీ చూపిస్తార'ని చెబుతున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన హైదరాబాద్‌కి చెందిన పేరిచర్ల రాజగోపాలరాజు.

మనదేశానికి వెలుపల ఉన్న రెండో అతిపెద్ద నృసింహ దేవాలయమే జర్మనీలోని సింహాచల ఆలయం. దీనికన్నా పెద్దది అమెరికాలోని డల్లాస్‌లో ఉంది.
ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన బవేరియన్‌ ఫారెస్ట్‌ నేచర్‌ పార్కులో ఆండెల్స్‌బ్రన్‌ అనే సువిశాల వ్యవసాయ ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నెలకొల్పారు. ఇది మ్యునిక్‌కి 200 కిలోమీటర్లూ; ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల సరిహద్దుల్లోని పసావ్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ కృష్ణచైతన్య సంస్థ ఇస్కాన్‌ నిర్మించిన ఈ గుడి వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకలా ఉంటుంది.

భక్త సులభుడు
సాధారణ వైష్ణవ ఆలయాల్లో ఉండాల్సినవన్నీ అక్కడ కనిపిస్తాయి. వాస్తుకనుగుణంగా నిర్మించిన ఈ ఆలయంలో ధ్వజస్తంభం, రథం అన్నీ ఏర్పాటుచేశారు. ఇక్కడి నృసింహదేవుడు తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు ఒడి చేరితే చల్లబడతాడని అక్కడి ప్రధాన పూజారి చెప్పారు. అందుకే ఇక్కడ స్వామి ఆ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. భక్తసులభుడుగా పేరొందిన ఈ స్వామిని సంవత్సరంలో ఎప్పుడయినా ఎంత చలిలో అయినా దర్శనం చేసుకునేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. నరసింహస్వామి విగ్రహంతోపాటు ఇస్కాన్‌కు చెందిన ప్రభుపాదుల విగ్రహం, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తి, ఇతర దేవతా మూర్తుల ప్రతిమలూ ఇక్కడ నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణభక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అక్కడివాళ్లను చూస్తే- శ్రద్ధ, నిర్మలత్వం, అంకితభావం - మనకన్నా మన భావజాలాన్ని అందిపుచ్చుకున్న విదేశీ ఇస్కాన్‌వారికే ఎక్కువ అనిపించింది. ఈ ప్రహ్లాద నృసింహ దేవుణ్ణి కీర్తనలతో భజనలతో షోడశోపచార పూజలతో కొలుస్తారు. వేకువ జామునే మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వేళల్లోనూ ఇక్కడ అర్చన, అభిషేకం, సుప్రభాతం యథావిధిగా జరుగుతాయి. మన సింహాచలం దేవాలయంలో మాదిరిగానే పూజా వేళల పట్టిక ఉంటుంది. వైష్ణవసంప్రదాయం ప్రకారం ఇక్కడ అన్ని పండగలూ నిర్వహిస్తారు. మే, జూన్‌ నెలల్లో వచ్చే నృసింహజయంతిని వైభవంగా చేస్తారు. అనేకమంది యూరోపియన్లు ఈ గుడిలో వైష్ణవ మతాన్ని స్వీకరించి పేర్లు మార్చుకుంటుంటారు. ప్రతి శనివారం వేదఘోష సాయంకాలం వేళ హోమం ఉంటుంది. ప్రతిరోజూ అగ్నిహోత్రపూజ జరుపుతారు. ఆలయాన్ని నిర్వహించేవారిలో భారతీయ సంతతికి చెందినవారు నలుగురే. మిగిలిన వారంతా ఐరోపావాసులే. వేదమంత్రాలతో వివాహం చేసుకోవాలనుకునే ఐరోపావాసులు ఈ ఆలయాన్ని ఆశ్రయిస్తుంటారు.
ఆలయ పచ్చిక బయళ్లలో సుమారు యాభై ఆవులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. వాటిమెడలో గంటలు చేసే చిరుసవ్వడి ఆ నిశ్శబ్ద వాతావరణంలో వీనులవిందుని కలిగిస్తుంటుంది. ఈ ఆవులపట్ల ఎవరూ హింసాత్మకంగా ప్రవర్తించకూడదు. పూలతోటలకీ కూరగాయల మొక్కలకీ ఈ ఆవుల పేడను మాత్రమే ఎరువుగా వాడతారు. ఈ ఆవుల పాలు, పాల ఉత్పత్తులను ఆలయ అవసరాలకి ఉపయోగిస్తారు.

ప్రసాదాలవిందు!
వైష్ణవసంప్రదాయంలో ప్రసాదాలకి ప్రాధాన్యం ఎక్కువ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామికి నివేదించిన అన్న ప్రాసాదాలను భక్తులకు సహపంక్తి భోజనాల్లో కొసరి కొసరి వడ్డిస్తారు. ఇక్కడి పొలాల్లో పండిన పండ్లూ ఆకుకూరలూ కాయగూరలతో చేసిన సలాడ్లూ పండ్లరసాలూ భక్తులకు అందిస్తారు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు వంటల్లో వాడరు. మడిపద్ధతిలోనే వంటలు చేసి వడ్డిస్తారు. వాటి రుచి అమోఘం.

తాగేనీరులో కూడా తులసి దళాలను కలిపి ఇస్తారు. ఇందుకోసం గ్రీన్‌హౌస్‌ పద్ధతిలో తులసి మొక్కలను పెంచుతున్నారు. పూజకోసం ఎన్నో రకాల పూలను ఇక్కడ పూయిస్తున్నారు. ఇక్కడ ఉండే యాత్రికులకోసం అన్ని ఏర్పాట్లతో కూడిన వసతి గృహం ఉంది. నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. పిల్లలకోసం వేసవిలో సమ్మర్‌ క్యాంపుల్నీ నిర్వహిస్తోంది ఆలయకమిటీ. సంప్రదాయ వాద్యాలతో ఉదయం సాయంత్రం కీర్తనలూ భజనలూ ఉంటాయి. వీటితోపాటు ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ వంటివీ ఉంటాయి. ఇక్కడకు వచ్చే భక్తులకోసం ఆలయ కమిటీకి (49 85 83 316)కి ఫోన్‌ చేస్తే, పసావ్‌కు కారు పంపిస్తారు. మనిషికి నాలుగు యూరోలు మాత్రమే తీసుకుంటారు. సొంతకారున్నవాళ్లు నేరుగా వెళ్లిపోవచ్చు.

www.simhachalam.de లోకి వెళ్తే ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఉంటాయి.


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Sun Temple-Nandikotkuru(Karnool dist),సూర్యదేవుడి ఆలయం-నందికొట్కూరు(కర్నూలు జిల్లా )

  •  
  
  •  

    ఉషాకిరణాల్లో బ్రహ్మదేవుడూ, మధ్యాహ్నపు ఎండలో పరమశివుడూ, సంధ్యాకాంతుల్లో శ్రీమహావిష్ణువూ ఉంటారని చెబుతారు. ముమ్మూర్తులా త్రిమూర్తులను తనలో ఇముడ్చుకున్న సూర్యనారాయణమూర్తి జన్మదినమే రథసప్తమి (ఫిబ్రవరి 6). ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని పురాతన సూర్యాలయ పరిచయం...వెలుగుల దేవరా...వందనం!

కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాతః కిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో కూర్మయంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే, ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతారు అర్చకులు. పదమూడో శతాబ్దంలో చోళవంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చాడు. అలసిసొలసి ఓ చెట్టు నీడన సేదతీరుతుండగా సూర్యభగవానుడు కలలో కనిపించి...అక్కడ తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ ఆనతి ప్రకారం సిరిసింగరాయలు చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని ఐతిహ్యం.

గర్భాలయంలో మూలమూర్తి వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం. కుడి చేతిలో తెల్లని పద్మం ఉంటుంది. ఎడమ చేయి అభయముద్రలో కనిపిస్తుంది. చోళుల పాలన అంతరించిపోయాక కూడా ఎంతోమంది రాజులు స్వామివారిని కొలిచారు. కాలక్రమంలో ఆ చారిత్రక ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పదహారేళ్ల క్రితం భక్తజనం తలోచేయీ వేసి జీర్ణోద్ధారణ చేశారు. ఆదివారం వచ్చే అమావాస్యను భాను అమావాస్య అంటారు. భాను సప్తమి కూడా అంతే ప్రత్యేకమైంది. ఆ రోజుల్లో భాస్కరుడిని విశేష పూజలతో కొలుస్తారు. సూర్యగ్రహ శాంతులు, హోమాలు, అభిషేకాలు, జిల్లేడు ఆకు పూజలూ నిర్వహిస్తారు. జిల్లేడు ఆకులంటే సూర్యుడికి చాలా ఇష్టం. వీటినే అర్క పత్రాలనీ అంటారు. రథ సప్తమినాడు స్వామివారి ఆలయంలో ఘనంగా కల్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. కర్నూలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందికొట్కూరు పట్టణాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు.

రథ సప్తమి...
సప్తసప్త మహాసప్త
సప్తద్వీప వసుంధరా
సప్తార్క పరమాధార
సప్తమీ రథసప్తమీ
సూర్యోదయం జరిగే తూర్పు దిక్కునే ముందుగా సృష్టించాడట బ్రహ్మ. మాఘశుద్ధ సప్తమినాడు తొలిసారిగా సూర్యుడు ఏడుగుర్రాల రథమెక్కివచ్చి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడంటారు. ఆ సందర్భంగానే ఏటా రథసప్తమి జరుపుకుంటాం. సూర్యవ్రతాన్నీ నిర్వహిస్తాం. ఆరోజు, తలమీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రాగి ఆకులు కానీ పెట్టుకుని తలస్నానం చేయడం సంప్రదాయం. కొత్తబియ్యం, కొత్త బెల్లంతో వండిన పాయసాన్ని చిక్కుడు ఆకులమీద వడ్డించి, నైవేద్యంగా పెడతారు. ముంగిళ్లలో రథం ముగ్గేసి సూర్యనారాయణుడికి ఆహ్వానం పలుకుతారు. ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య కటాక్షం పొందుతారు.

రథసప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది. నాటితో సూర్య గమనంలోనూ మార్పు వస్తుంది. శీతకాలం నుంచి వసంత, గ్రీష్మ రుతువుల దిశగా మార్పులు సంభవించే సమయమూ ఇదే. రథసప్తమి నాటి బ్రహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని ప్రధాన నక్షత్రాలన్నీ తేరు ఆకారంలో అమరిపోయి సూర్యరథాన్ని గుర్తుకు తెస్తాయంటారు. సూర్యుడికి సంబంధించినంతవరకూ ఏడు - చాలా విశిష్టమైన సంఖ్య. సప్తమి - ఏడో రోజు. సూర్యుడి గుర్రాలు ఏడు. సూర్యకాంతిలోని వర్ణాలు కూడా ఏడే. సూర్యారాధన చాలా ప్రాచీనమైంది. సూర్యుడిని స్తుతిస్తూ వేదాల్లో అనేక రుక్కులున్నాయి. వివిధ ఆదిమతెగల్లో సూర్యారాధన ఉంది. భారతీయులు అన్న మాటకు సూర్యారాధకులు అనే అర్థమూ ఉందంటారు.
పురాణేతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావనలు అనేకం. రామాయణంలో - రఘువంశీయుడైన శ్రీరాముడు ఆదిత్య హృదయ పారాయణ తర్వాతే రావణ సంహారం చేశాడు. ఆంజనేయుడు భాస్కరుడి వద్దే విద్యాభ్యాసం చేశాడు. భారతంలో - పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు...ద్రౌపది సూర్యుణ్ణి ప్రార్థించే అక్షయపాత్రను పొందింది. భాగవతంలో - సత్రాజిత్తుకు శమంతకమణిని ఇచ్చిందీ సూర్యుడే.

ఆరోగ్య నారాయణుడు
ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌ - ఆరోగ్యానికి సూర్యుడే అధిపతి. భానుదేవుడు నమస్కార ప్రియుడు. సూర్యనమస్కారాలు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని ఆధునిక పరిశోధనలు అంగీకరిస్తున్నాయి. 'సన్‌ యోగా', 'సన్‌ థెరపీ' లాంటి చికిత్సలు పాశ్చాత్యదేశాల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. ఆరునూరైనా తప్పని ఆ కాలగతి, ఆధునిక మానవుడికి ఓ క్రమశిక్షణ పాఠం. తిమిరంతో సాగించే నిత్య సమరం, సమస్యలతో సతమతమయ్యే సగటు జీవులకు ఆశావాద సూత్రం. ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం తెలియని మహాదాతృత్వం - సూర్య కిరణాలు మోసుకొచ్చే మానవతా సందేశం.
తం సూర్యం ప్రణమామ్యహమ్‌!

Courtesy with- కె.రాఘవేంద్రగౌడ్‌, ఈనాడు, కర్నూలు--ఫొటోలు: సోమలింగేశ్వరుడు@eenadu sundy 02-feb-2014

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com