Tuesday, February 4, 2014

Simhachalam in Jermany , జర్మనీలో సింహాచలం




    'సింహాచలం ఎక్కడ ఉందీ అనడిగితే విశాఖపట్నం దగ్గర అని తెలుగువాళ్లెవరైనా చెబుతారు. అదే జర్మన్లయితే 'మా దేశంలోని పసావ్‌ పట్టణ సమీపంలో ఉంద'ని చెబుతారు. అంతేకాదు... భక్తి పారవశ్యంతో ఆ నృసింహదేవుని స్తుతిస్తూ ఆలయాన్నీ చూపిస్తార'ని చెబుతున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన హైదరాబాద్‌కి చెందిన పేరిచర్ల రాజగోపాలరాజు.

మనదేశానికి వెలుపల ఉన్న రెండో అతిపెద్ద నృసింహ దేవాలయమే జర్మనీలోని సింహాచల ఆలయం. దీనికన్నా పెద్దది అమెరికాలోని డల్లాస్‌లో ఉంది.
ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన బవేరియన్‌ ఫారెస్ట్‌ నేచర్‌ పార్కులో ఆండెల్స్‌బ్రన్‌ అనే సువిశాల వ్యవసాయ ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నెలకొల్పారు. ఇది మ్యునిక్‌కి 200 కిలోమీటర్లూ; ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల సరిహద్దుల్లోని పసావ్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ కృష్ణచైతన్య సంస్థ ఇస్కాన్‌ నిర్మించిన ఈ గుడి వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకలా ఉంటుంది.

భక్త సులభుడు
సాధారణ వైష్ణవ ఆలయాల్లో ఉండాల్సినవన్నీ అక్కడ కనిపిస్తాయి. వాస్తుకనుగుణంగా నిర్మించిన ఈ ఆలయంలో ధ్వజస్తంభం, రథం అన్నీ ఏర్పాటుచేశారు. ఇక్కడి నృసింహదేవుడు తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు ఒడి చేరితే చల్లబడతాడని అక్కడి ప్రధాన పూజారి చెప్పారు. అందుకే ఇక్కడ స్వామి ఆ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. భక్తసులభుడుగా పేరొందిన ఈ స్వామిని సంవత్సరంలో ఎప్పుడయినా ఎంత చలిలో అయినా దర్శనం చేసుకునేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. నరసింహస్వామి విగ్రహంతోపాటు ఇస్కాన్‌కు చెందిన ప్రభుపాదుల విగ్రహం, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తి, ఇతర దేవతా మూర్తుల ప్రతిమలూ ఇక్కడ నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణభక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అక్కడివాళ్లను చూస్తే- శ్రద్ధ, నిర్మలత్వం, అంకితభావం - మనకన్నా మన భావజాలాన్ని అందిపుచ్చుకున్న విదేశీ ఇస్కాన్‌వారికే ఎక్కువ అనిపించింది. ఈ ప్రహ్లాద నృసింహ దేవుణ్ణి కీర్తనలతో భజనలతో షోడశోపచార పూజలతో కొలుస్తారు. వేకువ జామునే మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వేళల్లోనూ ఇక్కడ అర్చన, అభిషేకం, సుప్రభాతం యథావిధిగా జరుగుతాయి. మన సింహాచలం దేవాలయంలో మాదిరిగానే పూజా వేళల పట్టిక ఉంటుంది. వైష్ణవసంప్రదాయం ప్రకారం ఇక్కడ అన్ని పండగలూ నిర్వహిస్తారు. మే, జూన్‌ నెలల్లో వచ్చే నృసింహజయంతిని వైభవంగా చేస్తారు. అనేకమంది యూరోపియన్లు ఈ గుడిలో వైష్ణవ మతాన్ని స్వీకరించి పేర్లు మార్చుకుంటుంటారు. ప్రతి శనివారం వేదఘోష సాయంకాలం వేళ హోమం ఉంటుంది. ప్రతిరోజూ అగ్నిహోత్రపూజ జరుపుతారు. ఆలయాన్ని నిర్వహించేవారిలో భారతీయ సంతతికి చెందినవారు నలుగురే. మిగిలిన వారంతా ఐరోపావాసులే. వేదమంత్రాలతో వివాహం చేసుకోవాలనుకునే ఐరోపావాసులు ఈ ఆలయాన్ని ఆశ్రయిస్తుంటారు.
ఆలయ పచ్చిక బయళ్లలో సుమారు యాభై ఆవులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. వాటిమెడలో గంటలు చేసే చిరుసవ్వడి ఆ నిశ్శబ్ద వాతావరణంలో వీనులవిందుని కలిగిస్తుంటుంది. ఈ ఆవులపట్ల ఎవరూ హింసాత్మకంగా ప్రవర్తించకూడదు. పూలతోటలకీ కూరగాయల మొక్కలకీ ఈ ఆవుల పేడను మాత్రమే ఎరువుగా వాడతారు. ఈ ఆవుల పాలు, పాల ఉత్పత్తులను ఆలయ అవసరాలకి ఉపయోగిస్తారు.

ప్రసాదాలవిందు!
వైష్ణవసంప్రదాయంలో ప్రసాదాలకి ప్రాధాన్యం ఎక్కువ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామికి నివేదించిన అన్న ప్రాసాదాలను భక్తులకు సహపంక్తి భోజనాల్లో కొసరి కొసరి వడ్డిస్తారు. ఇక్కడి పొలాల్లో పండిన పండ్లూ ఆకుకూరలూ కాయగూరలతో చేసిన సలాడ్లూ పండ్లరసాలూ భక్తులకు అందిస్తారు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు వంటల్లో వాడరు. మడిపద్ధతిలోనే వంటలు చేసి వడ్డిస్తారు. వాటి రుచి అమోఘం.

తాగేనీరులో కూడా తులసి దళాలను కలిపి ఇస్తారు. ఇందుకోసం గ్రీన్‌హౌస్‌ పద్ధతిలో తులసి మొక్కలను పెంచుతున్నారు. పూజకోసం ఎన్నో రకాల పూలను ఇక్కడ పూయిస్తున్నారు. ఇక్కడ ఉండే యాత్రికులకోసం అన్ని ఏర్పాట్లతో కూడిన వసతి గృహం ఉంది. నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. పిల్లలకోసం వేసవిలో సమ్మర్‌ క్యాంపుల్నీ నిర్వహిస్తోంది ఆలయకమిటీ. సంప్రదాయ వాద్యాలతో ఉదయం సాయంత్రం కీర్తనలూ భజనలూ ఉంటాయి. వీటితోపాటు ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ వంటివీ ఉంటాయి. ఇక్కడకు వచ్చే భక్తులకోసం ఆలయ కమిటీకి (49 85 83 316)కి ఫోన్‌ చేస్తే, పసావ్‌కు కారు పంపిస్తారు. మనిషికి నాలుగు యూరోలు మాత్రమే తీసుకుంటారు. సొంతకారున్నవాళ్లు నేరుగా వెళ్లిపోవచ్చు.

www.simhachalam.de లోకి వెళ్తే ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఉంటాయి.


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment