Tuesday, February 11, 2014

North Swamimalai Temple(New Delhi),ఉత్తర స్వామిమలై మందిర్‌(న్యూఢిల్లీ),సహస్రార క్షేత్రం

  •  




  •  

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ధామాల్లో ప్రఖ్యాతి వహించిన ఆరు పడైవీడు క్షేత్రాల తరవాత అంతే స్థాయిలో ఏడవ పడైవీడుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం - ఉత్తర స్వామిమలై. ఈ ఆలయం భారత దేశ రాజధాని అయిన హస్తినాపురంలో (అంటే ప్రస్తుత న్యూఢిల్లీలో) ఉన్నది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి వారు శ్రీ స్వామినాథ స్వామిగా కొలువబడతారు.

ఉత్తర స్వామిమలై తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై క్షేత్ర నమూనాలో నిర్మిం చబడినది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, కర్పగ వినాయగర్‌, మీనాక్షీ అమ్మవారు, సుందరేశ్వర స్వా మి వార్లు, ఇతర పరివార దేవతలు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాన్ని సహస్రార క్షేత్రంగా కొలుస్తారు. సుబ్రహ్మణ్యుని ఆరు పడైవీడు క్షేత్రాలు మన శరీరంలో ఆరు చక్రములకు (షట్చక్రాలు) ప్రతీకగా పెద్దలు చెప్తారు. అవి వరుసగా...
1. తిరుచెందూర్‌ - మూలాధార చక్రం.
2. తిరుప్పరంకుండ్రం - స్వాధిష్టాన చక్రం.
3. స్వామిమలై - మణిపూరక చక్రం.
4. పళని - అనాహత చక్రం.
5. పళముదిర్చొళై - విశుద్ధి చక్రం.
6. తిరుత్తణి - ఆజ్ఞా చక్రం.

వీటితో పాటు... ఉత్తర స్వామి మలై (సహస్రార చక్రం) ఏడవదిగా ప్రసిద్ధిగాంచింది. ఆరు చక్రాలతో పాటు, బ్రహ్మ రంధ్ర స్థానం అయిన సహస్రార చక్రంగా ఈ ఉత్తర స్వా మి మలై క్షేత్రం అని గురువులు, పెద్దలు నిర్ధారించారు. అందుకే ఈ ఉత్తర స్వామిమలైని సహస్రార క్షేత్రం అంటా రు (ఇక్కడ ఆలయంలో జరిగే ప్రతీ పూజా, ఉత్సవాలు అ న్నిటా సంకల్పంలో, భరత ఖండే, ఇంద్రప్రస్థ నగరే, గురు గ్రామే, సహస్రార క్షేత్రే అని ఇక్కడ అర్చకులు చదువుతారు).

ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గర్భగుడి 90 అడుగుల ఎత్తు ఉన్న కొండ మీద ఉంటుంది. తమిళ భాషలో కొండని మలై అంటారు. కాబట్టే, ఈ క్షేత్రం ‘మలై మందిర్‌’ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, కరచరణాదులతో ఉన్న భగవంతుని మూర్తిని సాధారణంగా బ్రహ్మ స్థానం లోనూ, లేదా గర్భగుడి మధ్యలోనూ ప్రతిష్ఠ చేయరు. కానీ, ఇక్కడ ప్రత్యేకత సుబ్రహ్మణ్య స్వామివారి మూల విగ్రహ మూర్తిని బ్రహ్మస్థానంలో ప్రతిష్ఠ చేశారు.

క్షేత్ర ఆవిర్భావం...
--1940వ దశకంలో ఢిల్లీ నగరంలో దక్షిణ భారతీయులు తక్కువగా ఉండేవారు. ఆ సమయంలో స్వామినాథ స్వామి వారి యొక్క ఒక మహాభక్తుడు ఉండేవారు. వారికి భగవాన్‌ రమణ మహర్షి స్వయంగా పచ్చతో తయారు చేసిన స్వామినాథ స్వామి వారి మూర్తిని బహూకరించారు. వీరు ఆ మూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో రోజూ పూజించేవారు. ప్రతీ ఏటా కార్తీకమాసంలో తమిళులు ఎంతో భక్తి శ్రద్ధల తో జరిపే స్కంద షష్ఠి ఉత్సవాలను ఈ భక్తుడు కూడా జరి పేవారు. వీరు మొదటగా 1943 లో స్వామినాథ స్వామి వారి మూర్తిని సకల జనులూ దర్శించేవిధంగా, స్కంద షష్ఠి ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. నెమ్మదిగా ప్రతీ సంవత్సరం స్కంద షష్ఠి ఉత్సవాలలో పాల్గొనే భక్తుల సంఖ్య వేలలోకి చేరింది. స్వామివారికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించవలసిన తరుణం ఆసన్నమ యింది.

భక్తులందరూ స్వామి నాథ స్వామి ఆలయం కోసం ఒక ఎత్తయిన స్థలం వెదకడం ఆరంభించారు. అయితే, కారుణ్యమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు ఆయన మందిరం యొక్క స్థలం ఎక్కడ ఉండాలో వారే ఒక భక్తుని స్వప్నంలో కనిపించి తెలియజేశారు. స్వామి ఎంచుకున్న స్థలం, ఢిల్లీ నగరంలోనే వసంత గ్రామం అనే చోట, దట్టమైన రేగిచెట్ల నడుమ ఉన్న ఒక చిన్నకొండ. ప్రస్తుతం ఈ వసంత గ్రామాన్నే ‘వసంత్‌ విహార్‌’గా పిలుస్తారు.

స్వామి వారే స్థల నిర్ణయం చేశాక, ఇక తిరుగు ఉంటుందా... ఆ తరువాత భారత ప్రభుత్వ పురాతత్వ శాఖ వారు ఈ కొండ ఉన్న స్థలాన్ని ఆధ్యాత్మిక/ధార్మిక స్థలంగా అనువైనది అని అనుమతి మంజూరు చేశారు. అప్పట్లో శ్రీ లాల్‌ బహదూర్‌ శాస్ర్తి గారు ప్రధానిగా ఉన్న రోజులు. వారి ప్రభుత్వం వసంత విహార్‌ లోని ఈ కొండ ఉన్న స్థలాన్ని 21,000 రూపాయల ధరకు ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు.

1961 అక్టోబర్‌ 18న, సుప్రీం కోర్టు జడ్జి, సంగీత కళానిధి శ్రీ వేంకటరమణ అయ్యర్‌ గారి ఆధ్వర్యంలో శ్రీ స్వామినాథ స్వామి సేవా సమాజం స్థాపించబడినది. నెమ్మదిగా ఆలయ నిర్మా ణానికి భక్తుల నుంచి విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. నిధుల సేకరణలో భాగంగా, తమిళనాడు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థా నం వారు ఇరవైఐదు వేల రూపాయలు స్వామి మలై నిర్మా ణానికి చేయి అందించారు. 1963 లో ఆ స్థలంలో ఒక చిన్న తాత్కాలిక మందిరం నిర్మించి, ఒక ఉత్సవమూర్తిని ఉంచి, నిత్యారాధనలు ప్రారంభం చేశారు.

ఇక ప్రధాన మందిర నిర్మాణం చేపట్టే దిశగా, తమిళనాడు ప్రభుత్వ అనుమతితో, ప్రఖ్యాత ఆలయ వాస్తు-శిల్ప కళా నిపుణుడు, శ్రీ గణపతి స్థపతి గారు ఉత్తర స్వామి మలై మందిర నిర్మాణం చేసే బాధ్యత స్వీకరించారు. శ్రీ గణపతి స్థపతి గారు, శ్రీ వైద్యనాథ స్థపతి యొక్క కుమారుడు. వీరి ఆధ్వర్యంలో ఎన్నో ప్రఖ్యాత ఆలయ/భగవన్మూర్తుల నిర్మాణం జరిగింది. వీరిని కంచి పరమాచార్య స్వామి వారు ఎంతో అభిమానించి గౌరవించేవారు.

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment