Friday, January 17, 2014

Kalabhairava Temple-isannapalli(Nijamabad dist), కాలభైరవుడు ఆలయం-ఇసన్నపల్లి(నిజామాబాద్‌ జిల్లా)

  •  
  •  


మనిషిలోని 'నేను' అనే అహంకారానికి బ్రహ్మ అని పేరు. కాలభైరవతత్వం ఈ అహంకారాన్ని పోగొడుతుంది. అలా బ్రహ్మదేవుడి అహంకారాన్ని భంగం చేసినవాడు కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నిజామాబాద్‌లో ఓ పేద్ద ఆలయం ఉంది.-ఎనిమిది అడుగుల కాలభైరవుడు
కాలభైరవుడు శివుడి నుంచి ఉద్భవించినవాడు. నా అంతవాడు లేడని విర్రవీగకూడదని కాలభైరవుడి కథ చెబుతుంది. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడికి వెుదట అయిదు తలలుండేవట. తను సృష్టికర్త కూడా కావడంతో బ్రహ్మలో గర్వం ప్రవేశించిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడనని చెప్పుకోవడం వెుదలుపెట్టాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి 'నా నాభికమలం నుంచి పుట్టినవాడివి, అందువల్ల నేనే గొప్పవాణ్ణి' అన్నాడట.

వాళ్లిద్దరూ తమలో ఎవరు గొప్పో చెప్పమని నాలుగు వేదాలనూ పిలిచారట. అవి... ఇద్దరూ కాదు, పరమశివుడని చెప్పాయట. తరవాత వాళ్లిద్దరూ ప్రణవాన్ని (ఓంకారం) అడిగారు. అదీ శివుడే అధికుడని చెప్పిందట.

అప్పుడు పేద్ద జ్యోతిస్తంభం వాళ్ల ఎదుట ప్రత్యక్షమైంది. దాన్లోంచి వచ్చిన జ్యోతిని చూసి శ్రీహరి తన వాదన విరమించుకున్నాడట. కానీ, బ్రహ్మకు మాత్రం ఇంకా అహంకారం పోలేదు. అప్పుడు శివుడి నుంచి ఓ ఘోరరూపం ఆవిర్భవించిందట. 'నాలాగే తనకూ అయిదు తలలున్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో విర్రవీగుతున్నాడు. ఆ అయిదో తలను నీ కొనగోటితో తుంచెయ్‌' అని ఆ రూపాన్ని ఆదేశించాడట. కొనగోటితో బ్రహ్మ అయిదో తలను తెంచేసింది ఆ రూపం. అప్పటికిగానీ బ్రహ్మకు తత్వం బోధపడలేదు. అప్పుడు శివుడు ఆ రూపంతో 'నువ్వు బ్రహ్మ తలను కూడా తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నావు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు. కానీ, బ్రహ్మ తల తెంచినందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అందువల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్లు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. ఇకపై నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలకుడివి. కాశీపట్టణానికీ అధిపతివి. నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు' అని చెప్పాడట.

ఈ కాలభైరవుడితో సహా అష్టభైరవుల ప్రస్తావన వామన, బ్రహ్మవైవర్త వంటి పురాణాల్లోనూ కనిపిస్తుంది. ఈ కాలభైరవుని ఆలయాలు మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి మన రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోనూ ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 55 కి.మీ.దూరంలో గల కామారెడ్డి పట్టణానికి 8 కి.మీ. దూరంలో... సదాశివనగర్‌ మండలంలోని ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల సరిహద్దులో ఉంది.

అతిప్రాచీన ఆలయం
క్రీ.శ. 16వ శతాబ్దంలో... కొందరు కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తున్నారు. ఆ బండి ఇసన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రైంది. దాంతో అక్కడే విశ్రమించారు. తరువాత ఓ భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం నిటారుగా నిలబడిందట. ఆ ప్రదేశంలోనే ఆలయం నిర్మించారని పూర్వీకులు చెబుతారు.
ఈ ఆలయంలో శునకాన్ని వాహనంగా చేసుకున్న ఎనిమిది అడుగుల కాలభైరవస్వామి మూల విగ్రహం కనిపిస్తుంది. ఇసన్నపల్లి గ్రామారంభంలో రామారెడ్డి గ్రామానికి ఈశాన్య దిక్కులో పశ్చిమాభిముఖంగా కొలువుదీరాడు ఈ స్వామి. ఇలా ఎందుకు వెలిశాడు అనడానికి ఓ కారణం చెబుతారు స్థానికులు. ఒకప్పుడు ఈ గ్రామానికి అష్టదిక్కులలో అష్టభైరవులుండేవారట. వాళ్లు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని చెబుతారు. వీళ్లలో ప్రధానుడే కాలభైరవుడు. మిగతా ఏడు భైరవ విగ్రహాలూ కాలగర్భంలో కనుమరుగైపోయాయి. ఈస్వామి మాత్రమే మిగిలాడు. పూర్వం అనావృష్టి ఏర్పడిన సందర్భాలలో స్వామివారి విగ్రహాన్ని భక్తులు పేడతో కొట్టేవారట. కొట్టిన పేడ తొలగిపోయేంతగా ఆ తరవాత వర్షం కురిసేదని చెబుతారు.

ఈ ఆలయం 1974లో దేవాదాయశాఖ అధీనంలోకి వెళ్లింది. 2001లో ఆలయ నిర్మాణం చేపట్టే వరకు స్వామి విగ్రహం రేకుల షెడ్డులోనే ఉండేది. భక్తులు సమర్పించిన రూ.50 లక్షల విరాళాలతో ఆలయం నిర్మించారు. మరో రూ.6 లక్షలతో దీనికి పక్కనే 2009లో శనైశ్చరాలయం నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం రూ.20 లక్షలతో గదులు నిర్మించారు. మాజీ ఎంపీ ఆలె నరేంద్ర అందించిన రూ.10 లక్షలతో భోజనశాల ఏర్పాటుచేశారు. అలాగే భూదాన పథకం కింద గజం రూ.500 చొప్పున ఇప్పటివరకు రూ.5 లక్షలతో ఆలయకమిటీ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేశారు. గతేడాది జిల్లాలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన ఆలయం ఇదే.

కార్తీకమాసంలో ఇక్కడ ఘనంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు వస్తారు. 'అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడకు వచ్చి వారంరోజులపాటు ఆలయ ఆవరణలోని బావినీటితో స్నానం చేసి, స్వామికి పూజలు చేస్తే ఆరోగ్యవంతులవుతారు' అంటారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్‌శర్మ.

Courtesy with - గడ్డం శ్రీనివాస్‌గౌడ్‌, నిజామాబాద్‌ డెస్క్‌@eenadu sunday magazine(Sunday, November 20, 2011)

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment