Friday, January 10, 2014

Bhairavakona Shiv Temple-kottapalli(Prakasam dist),భైరవకోన శివాలయం-కొత్తపల్లి(ప్రకాశం జిల్లా)




భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన...

సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.

-వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

శివలింగాలన్నీ ఒక్కచోటే...
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.

ఒకేచోట త్రిమూర్తులు...
-ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు...
-ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం...వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.

కోనకు ఇలా వెళ్ళాలి...
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబ వరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.

Courtesy with Sunday edition of Surya news paper 02-Mar-2011



*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment