Wednesday, January 8, 2014

Komaravelli Mallanna , కొమరవెల్లి మల్లన్న

  •  

  •  
శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్ళలేని వారు తమ ప్రాంతంలో ఉన్న మల్లన్న ఆలయాలను దర్శించుకోవడం తెలుగునాట చాలాకాలంగా ఉన్న సంప్రదాయం. కాశీ క్షేత్రాన్ని సందర్శించేందుకు వెళ్ళిన వారు తిరిగి రారనే పాతకాలపు సామెత మనందరికీ తెలిసిందే. ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలో పుట్టిన సామెత అది. అలాగే, శ్రీశైల మల్లి కార్జున స్వామి దర్శనానికి వెళ్ళలేని వారు విజయవాడలో దుర్గా మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నట్టే, వరంగల్‌ జిల్లాలో కొమరవెల్లి మల్లన్నను దర్శించుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌కి 95 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండలలో వెలిసిన మల్లిఖార్జున స్వామి గురించి ఒగ్గు కథ ప్రచారంలో ఉంది. మేడాలమ్మను ఆమె సోదరులు పెట్టిన షరతులకు అంగీకరించి మల్లన్న వివాహం చేసుకున్నాడన్నది ఈ కథ ఇతి వృత్తం. తనను భక్తితో కొలిచిన వారిని మల్లన్న అనుగ్రహిస్తాడన్నది భక్తుల నమ్మకం. కొమరవెల్లి మల్లన్న దర్శనం సర్వపాపహరమని అనుకుంటూ భక్తులు అర్చనలు చేస్తూ ఉంటారు.

ఇక్కడ మల్లన్న గొల్ల కేతమ్మ, మేడాలమ్మలతో వెలిశాడు. శివరాత్రికి కొమరవెల్లిలో పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది. తెలంగాణా జిల్లాల నుంచే కాక, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. తన భక్తులు ఎటువంటి ఆపదలో ఉన్నా, తనను మొక్కుకున్నట్టయితే, వారిని ఎన్ని కష్టాల నుంచైనా విముక్తి చేయగల దేవునిగా ఇక్కడి మల్లన్న ప్రసిద్ధి. ఈ క్షేత్రం యాదవ, కురుమ సామాజికవర్గాలకు చెందిన వారు మల్లన్నను ఇలవేలుపుగా భావించి అర్చనలు జరుపుతూ ఉంటారు. ఈ ఆలయ వ్యవస్థాపకుడు, ధర్మకర్తలసంఘం చైర్మన్‌ మాసానపల్లి నరసింగరావు యాదవ్‌ 1991లో కన్ను మూసేవరకూ ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో కల్యాణం జరిపించేవారు. ఇప్పుడు వారి వారసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సిద్ధి పేటకు వెళ్ళే దారిలో నెలకొని ఉన్న కొమరవెల్లి గ్రామంలో కొండపై వెలిసిన మల్లన్నను కోర్కెలు తీర్చే మల్లన్నగా భక్తులు పేర్కొంటూ ఉంటారు. ఈ ఆలయం పక్కనే కొండ పోచమ్మ ఆలయం ఉంది.మల్లన్న దర్శనానంతరం పోచమ్మ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కొండల్లో వేంచేసిన మల్లన్న భక్తుల పాలిట కల్పద్రుమంగా పేరొందాడు, మల్లన్న ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొమరవెల్లికి హైదరాబాద్‌, వరంగల్‌,సిద్ధి పేటల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి.

- స్వామి అనంత@andhra prabha -   Mon, 6 Jan 2014,


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment