Sunday, January 12, 2014

Devaraya fort-Tumkuru(Karnataka),దేవరాయనదుర్గ-తుమ్కూరు(కర్నాటక రాష్ట్రం)

  •  


  •  
- దేవరాయనదుర్గ ప్రాంతాన్ని, దేవాలయాలని, వాటి పరిసర పర్యావరణ జాగ్రత్తల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని టి.వి.యస్‌ కంపెనీ గ్రూప్‌, సౌత్‌ ఇండియన్‌ ఆటో మొబైల్‌ కంపెనీ స్వచ్ఛందంగా చేబట్టింది. భోగ నరసింహస్వామి దేవాలయం ఇక్కడున్న కొండ కిందిభాగంలో, యోగ నరసింహస్వామి దేవాలయం శిఖరాగ్రంలో ఉంటాయి.

కర్నాటక రాష్ట్రంలో బెంగళూరుకి 65కి్ప్పమీ దూరంలో కొండలతో ప్రకృతిని తన ఒడిలో దాచుకున్న తుమ్కూరులో ఉన్న హిల్‌ స్టేన్‌ ఈ దేవరాయనదుర్గ. ఈ ప్రాంతం అంతా బండరాతి కొండల చుట్టూ పచ్చని దట్టమైన అరణ్యంతో శిఖరాగ్రాల అనేక దేవాలయా లతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

వీటిలో అత్యంత ప్రధానమైన ఆలయాలు యోగనరసింహ, భోగనరసింహ దేవాలయాలు. ఇక్కడ మరో మనోహర దృశ్యం జయమంగళి నదీ పరీవాహక ప్రాంతం. ఇక్కడే మరో అద్భుత ఆలయం మహాలక్ష్మీ దేవాలయం. ఇది ఇక్కడికి అతి సమీపంలో ఉన్న గోరవనహళి ప్రాంతంలో ఉంది.

ప్రాంత చరిత్ర:

ఈ ప్రాంతాన్ని నాటి మైసూరు మహారాజు చిక్కదేవరాజ ఒడయార్‌ హస్తగతం చేసుకున్నాడు. అంతకు ముందు ఈ ప్రదేశాన్ని అన్నెబిద్దసరి అని వ్యవహరించేవారు. తరువాత జడకన దుర్గగా నామాంతరం చెందింది. ఆ తరువాత చివరికి దేవరాయన దుర్గగా పిలవబడుతోంది. ఇక్కడ విహరించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం:

ఈ దేవాలయాన్ని మొదటి కంఠీరవ నరసరాజు పూర్తి ద్రవిడ వాస్తు కళారీతిలో నిర్మించాడు. ఇక్కడ లభించిన శిలాశాసనాలు 41, 42లో ఈ దేవాలయ స్థంభాలు, ఇతర పునర్నిర్మాణ కార్యక్రమాలు 1858లో నాటి మైసూర్‌ మహారాజైన మూడవ కృష్ణరాజ వడయార్‌ చేయించినట్టు లిఖించబడింది.

ఈనాడు ఈ ప్రాంతాన్ని, దేవాలయాలని, వాటి పరిసర పర్యావరణ జాగ్రత్తల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని టి.వి.యస్‌ కంపెనీ గ్రూప్‌, సౌత్‌ ఇండియన్‌ ఆటో మొబైల్‌ కంపెనీ స్వచ్ఛందంగా చేబట్టింది. భోగ నరసింహస్వామి దేవాలయం ఇక్కడున్న కొండ కిందిభాగంలో, యోగ నరసింహస్వామి దేవాలయం శిఖరాగ్రంలో ఉంటాయి.

ఇక్కడ మరో ఔన్నత్యం ఉట్టిపడే దేవాలయం ఒకటి తూర్పు ముఖంగా ఉండే నరసింహదేవాలయం. దీనిని కుంభి అని వ్యవహరిస్తారు. ఈ దేవాలయం గర్బగృహంలో సుఖనాసి, నవగ్రహ, ముఖమండపంతో కూడి ఉంటుంది. దీనికి అనుబంధంగా ఇక్కడ మూడు కొలనులు కూడా ఉన్నాయి. వాటిని నరసింహ తీర్థ, పరాశర తీర్థ, పాదతీర్థ అని అంటారు.

గిరి ప్రదక్షణ:

ఈ దేవాలయాలు నెలకొని ఉన్న ఈ పర్వతం చుట్టూ అనేక మంది భక్తులు ప్రదక్షణలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విశ్వ:హిందూ పరిషత్‌ నిర్వహిస్తోంది. గిరి ప్రదక్షణ చేసే భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ, తగిన ఏర్పాట్లు చూస్తున్నారు.

నమద చిలుమి:

కొండ దిగువ నుండి తుమ్కూరు వెళ్ళే మార్గంలో ఉండే ఒక ప్రదేశాన్ని నామద చిలుమి అంటారు. చిలుమి అంటే ఎగిసి పడు అని అర్థం. త్రేతాయుగంలో శ్రీరాముడు లంకకి వెడుతూ మార్గమథ్యంలో ఇక్కడ విశ్రమించాడు. ఈ ప్రాంతంలో నీటిచుక్కలేదు. అప్పుడు రాముడు భూమిలో ఒక భాణాన్ని సంధించగా అక్కడ నుంచి నీరు ఎగసి పడింది. ఆ కారణంగా దీనిని నామద చిలుమి అంటారు. ఈ ఎగసి పడే నీటి ధారని ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడే శ్రీరాముని పాదముద్రలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు అనేక సదుపాయాలతో పర్యాటకులకు వసతులు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ దేవరాయన దుర్గ చుట్టుపక్కల ఎన్నో విశేషాలు, చారిత్రక నిర్మాణాలతో బాటు ప్రకృతి సౌందర్యాల్ని కూడా తనివితీరా చూడవచ్చు.

Courtesy with : Andhraprabha News paper  -   Sun, 30 Oct 2011

*=================================*
 * Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment