Friday, January 10, 2014

Manikyamba ammarvaru-Draksharamam(E.G.dist),భీమేశురాణి-మాణిక్యాంబ ద్రాక్షారామం(తూర్పుగోదావరి జిల్లా)

  •  





  •  
మాణిక్యాంబ....ఆహో! ఎంత మనోహరమైన చల్లనిపేరు. అంబ అంటే అమ్మ అని అర్థం. మాణిక్యములు వంటి చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలు అందించే అమృతమూర్తి మాణిక్యాంబ.దేశంలోని అష్ట్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తి పీఠంగా తూర్పుగోదావరి జిల్లాలోని పురాణ ప్రసిద్ధి గాంచిన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న శ్రీమాణిక్యాంబ దేవి భక్తులచేత కొనియాడబడుతోంది. ఈ క్షేత్రానికి పౌరాణిక విశిష్టత ఉన్నది. దక్షుడు యాగం చేసిన ప్రదేశం కాబట్టి అది ద్రాక్షారామం అయ్యింది.

దక్షుడు యాగానికి భర్త పరమశివుడు వద్దన్నా సతీదేవి యాగానికి వెళుతుంది. అక్కడ ఎవరూ పలకరించకపోవడంతో తన ముఖం భర్త అయిన శివునికి చూపించలేక యోగాగ్నిని సృష్టించుకుని తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి తనువు చాలిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శంకరుడు ఉగ్రుడై వీరభద్రుని సృష్టించి ఈ దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని పంపుతాడు. యజ్ఞవాటికలో దేహత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని శంకరుడు వియోగంతో తన భుజంపై వేసుకుని విలయతాండవం చేయడంలో ముల్లోకాలు కంపించాయి.

దీనితో దేవతలు శ్రీమహావిష్ణువును ప్రార్థించగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని 18ఖండాలుగా చేశాడు. ఆ 18భాగాలు 18దివ్య స్థలాల్లో పడి అష్ట్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. సతీదేవి ‘కణత’ భాగం యాగం నిర్వహించిన చోట పడడంతో ‘మాణిక్యాంబదేవి’ వెలిసినది. శివుడు భీమేశ్వరుడుగా, మాణిక్యాంబదేవితో ఒకేసారి స్వయం ప్రతిష్ట పొందిన ప్రదేశమే ద్రాక్షారామం. ఈ ప్రాంతాన్నే త్రిలింగ దేశమంటారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం క్షేత్రాలను మూడింటిని కలిపి త్రిలింగ దేశమంటారు.

-మిగతా శక్తి పీఠా క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోటా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్టించడం విశేషం. సతీదేవి తనువు చాలించిన ప్రదేశంలోనే శక్తిపీఠం ఆవిర్భవించడం వల్ల ఒక మహిమాన్విత ప్రాంతంగా విరాజల్లుతోంది.

ద్రాక్షారామం క్షేత్రానికి దక్షిణ కాశీ అని మరోపేరు వుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి నేరుగా ద్రాక్షారామంకు బస్సు సర్వీసులు వున్నాయి. యాత్రికులకు దేవస్థానం వారి కాటేజీలు, టూరిజం శాఖవారి అతిథి గృహం, పైండా జమిందారుగారి సత్రం అందుబాటులో వుంటాయి.శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు,కుంకుమ పూజలు చేస్తారు. లక్ష కుంకుమార్చన చేస్తారు. శ్రీచక్ర యంత్రంపై అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల ప్రత్యేక అవతార రూప అలంకరణలుండవు.

- నాగదేవర సూర్యవెంకట్రావు (నాయుడు),-మేజర్‌న్యూస్‌, రామచంద్రపురం,-తూర్పుగోదావరి జిల్లా.

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment