Friday, January 10, 2014

Shiva Temple-Yaganti(Karnool), శివాలయం-యాగంటి(కర్నూలు జిల్లా), మహానంది, అహోబిలం క్షేత్రాలు

  •  

  •  
    చుట్టూ ఎర్రమలకొండలు... ఆ కొండల మధ్యలో అపురూపమైన శివాలయం... అందులో విగ్రహరూపంలో దర్శనమిచ్చే శివుడు... కలియుగాంతంలో రంకెలు వేస్తాడని భక్తులు నమ్మే బసవన్న... ఇలాంటి ఎన్నో విశేషాలకు ఆలవాలం కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రం.
కాకులు దూరని కారడవి అని కథల పుస్తకాల్లో చదువుతుంటాం. అలాంటి అడవుల సంగతేమోగానీ... ఒక్కటంటే ఒక్క కాకి కూడా లేని ప్రాంతాలు మాత్రం మనదేశంలో కొన్ని ఉన్నాయి. అలాంటివాటిలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో యాగంటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న యాగంటిలో కాకులు లేకపోవడానికి గల కారణాన్ని చెప్పే పురాణ కథనం ఒకటి ఉంది.

ఏకశిలపై శివపార్వతులు
పూర్వం అగస్త్య మహర్షి యాగంటి ప్రాంతంలో పర్యటించారట. చుట్టూకొండలూ, జలపాతాలతో రమణీయంగా ఉన్న ఈ ప్రాంతంలో వేంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారట. వేంకటేశుని శిలావిగ్రహాన్ని రూపొందించే సమయంలో చేతి బొటనవేలి గోరు విరిగిపోయిందట. ఎందుకిలా జరిగిందని అగస్త్యుడు శివుడికోసం ఘోరమైన తపస్సు చేశాడట. మధ్యలో కాకులు ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించాయట. కోపోద్రిక్తుడయిన ఆ మహర్షి ఈ ప్రాంతంలో ఇకమీదట కాకులు ఉండవని శపించాడట. అప్పట్నుంచీ ఇక్కడ కాకులు తప్ప మిగతా పక్షులన్నీ తిరుగాడుతుంటాయి. ఆ తరవాత అగస్త్యుడి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు పరమేష్ఠి... 'మహర్షీ, వేంకటేశుని విగ్రహం గురించి నువ్వు బాధపడనవసరం లేదు. ఇక్కడ నేను నేను లింగాకారంలో కాకుండా ఉమాసమేతుడనై ఏకశిలపై వెలసి భక్తులను కటాక్షిస్తాను' అని చెప్పాడట.

పెరిగే బసవన్న
ఆలయ ముఖ మండపంలో నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో 'యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేనయా' అని చెప్పారు. నిజంగానే ఈ నంది విగ్రహ పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. భారత పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ ఆలయాన్ని కార్తీకమాసంలోనూ, శివరాత్రి మహోత్సవాల్లోనూ కొన్ని లక్షలమంది భక్తులు దర్శించుకుంటారు.

పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న యాగంటి మరో విశేషం చిన్నకోనేరు. చుట్టుపక్కలున్న పర్వత సానువుల గుండా ఇందులోకి నీరు ప్రవహిస్తుంటుంది. అగస్త్య మహర్షి స్నానం చేసిన ఈ కోనేరును అగస్త్య పుష్కరిణి అంటారు. ఇందులోంచి నీరు ఆలయ ప్రాంగణంలోని కోనేరులోకి వస్తుంది.

యాగంటిలో మరో విశేషం... సహజ సిద్దంగా ఏర్పడిన గుహలు. వీటిలో రోకళ్ల గుహ, వేంకటేశ్వరస్వామి గుహ, శంకర గుహ ముఖ్యమైనవి. రోకళ్ల గుహలో అగస్త్యుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేశాడట. అగస్త్యుడు వేంకటేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గుహను వేంకటేశ్వర గుహగా పిలుస్తారు. శంకరగుహ వద్ద వీరబ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానోపదేశం చేసినట్లు చెబుతారు. ఇక్కడికి సమీపంలోనే ఎర్రజాల గుహలూ ఉన్నాయి.

కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది బనగానపల్లి పట్టణం. అక్కడినుంచి 15 కి.మీ. దూరం ప్రయాణిస్తే యాగంటికి చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. యాగంటి నుంచి 75 కి.మీ. దూరంలో మహానంది, అహోబిలం క్షేత్రాలు ఉన్నాయి. యాగంటికి వచ్చే భక్తులు బస చేయడానికి అద్దె గదులు, అన్నదాన సత్రాలు ఉన్నాయి.

Courtesy with - ఎస్‌.రవీందర్‌రావు-న్యూస్‌టుడే, కర్నూలు.      Thursday, March 29, 2012

*=================================*
 * Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment