భారత ప్రభుత్వం ఓరుగల్లును చారిత్రాత్మక నగరంగా గుర్తిం చింది. కాకతీయల పాలనా కాలం ఒక సువర్ణాధ్యాయం. ఆంధ్రదేశాన్నేకాక యావత్ దక్షిణభారత దేశాన్ని పరిపాలిం చిన కాకతీయులకు రాజధాని ఓరుగల్లు. వెయ్యేళ్ల ఓరుగల్లు చరిత్ర ఆనాటి శాసనాలలోనూ, సాహి త్యంలోనూ మరుగునపడి ఉంది. వారసత్వానికి ప్రధాన నిదర్శనాలైన సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రకళ వంటి అన్ని రంగాల్లో తమదైన ముద్రను కాకతీయ రాజులు వేశారు. సంస్కృతి, సుస్థిరమైన పాలన అందించి చరిత్రపుటలలో శాశ్వతమైన యశస్సును సంపాదించుకున్నారు. వారిచ్చిన సాహితీసంపద, శిల్పరీతులు, లలితకళలు నేటికీ వారి ప్రాభవానికి నిదర్శనంగా నిలిచాయి.
భారదేశంలో విరజిల్లిన అధ్బుత శిల్పరీతుల్లో కాకతీయ శిల్పరీతి ఒకటి. దేవాలయాల్లోని స్తంభాల నిర్మాణరీతి, వాటిని నిలబెట్టిన విధానం గర్భాలయ ముఖద్వారాలను బట్టి అవి కాకతీయులు కట్టించారో లేదో స్పష్టంగా చెప్పవచ్చు. కాకతీయ శిల్పరీతికి మార్గదర్శకమైనది హోయసల శిల్పరీతి. కాకతీయ దేవాలయ నిర్మాణానికి దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసలలు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాలు మీద కని ్పంచే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ దేవాలయాలలో కూడా కనిపిస్తాయి. అయితే హోయసల శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కనిపిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటి వైపుననే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాని కాకతీయుల బయటే కాకుండా లోపలి భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. హోయసల ఆలయాలపై కనిపించేవి దేవతామూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కనిపించేవి నాటి సామాన్య స్త్రీ పురుషులవి. ఆనాటి సామాన్యుల వేషధారణ, హావభావాలను ప్రదర్శించిన ఘనత కాకతీయులదేనని నిస్సం దేహంగా చెప్పవచ్చు. రుద్రేశ్వరా లయాన్ని రుద్రసేనాని శ్రీముఖనామ సంవత్సరం 1135(క్రీ.శ. 30-3-1213)లో నిర్మించినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆలయ విశేషాలు
శ్రీ రుద్రేశ్వరాలయంలోనికి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కనిపిస్తుంది. అందులో రుద్రసేనాని వంశాభివర్ణన, అతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి పరాక్రమాలు, అలనాటి ఓరుగల్లుపుర వైభవం వర్ణింపబడినాయి. ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశలలో మూడు ద్వారాలున్నాయి. ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం ఒక కళాఖండమని చెప్పవచ్చు. ఏ దిశనుంచి చూసినా అది మననే చూసేవిధంగా ఈ నందిని రూపొందించారు. అద్భుతమైన శిల్పకళతో, అలరారుతూ మనోహరంగా, హుందాగా ఆ నంది కనిపిస్తుంది.
మదనిక శిల్పాలు
ఆలయం బయటివైపున స్తంభాలను, పై కప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలే మదనికలు. ఇవి ఆనాటి సామాన్య స్త్రీలవి. మదనిక శిల్పాలను వస్త్రాలకంటే ఆభరణాలతోనే అందంగా రూపొందించారు. అందులోనూ అప్పటి స్త్రీలు ధరించే హారాలు, శిరోభూషణాలను పొందుపరిచారు. ఒక్కో శిల్పంలో ఒక్కొక్క విశేషం కనిపిస్తుంది. ఈ శిల్పాలన్నింటిలోను కనిపించే ఆభరణాలు అలంకారాలు ఆనాటి జీవన సౌభాగ్యానికి నిదర్శనాలు. ఒక మదనిక చీరను ఒక కోతి లాగివేస్తుంటే, ఒక చేత్తో మానవసంరక్షణ చేసుకొంటూ, రెండవ చేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పంలోని ముఖకవళికలు అద్భుతం. మరొక మదనిక పాదంలో ముల్లుగుచ్చుకోగా, ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా ప్రదర్శించిన నైపుణ్యం ఆనాటి శిల్పులది.
రంగమండపం
గర్భాలయానికి ముందున్న రంగ మంటపాన్ని నిర్మించిన తీరు అమోఘం. నాలుగు స్తంభాల మీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా కనిపిస్తాయి. స్థంభం పై భాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు. స్థంభాల మధ్యలో చతురస్రకార ఫలకాలమీద, గుండ్రంగా ఉన్న భాగాలపైన వాటికి అనుగుణమైన శిల్పాలను చెక్కారు శిల్పులు.
ఒకదాని మీద సముద్ర మథనము, మరోదానిపై ముగ్గురు స్త్రీలకు నాలుగే కాళ్లున్న శిల్పం. ఒక దానిమీద పేరిణి నాట్యం. ఒక దానిమీద దండలాస్యం, కుండలాకారా నృత్యం, ఇంకోదానిపై స్త్రీలే మద్దెలలు వాయిస్తుండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్లు చెక్కిన చిత్రాలు నిజంగా అద్భుతాలే.
గర్భాలయ ప్రధానద్వారం
రుద్రేశ్వరాలయ గర్భాలయ ప్రధాన ద్వారం మరొక గొప్ప కళాఖండం. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళతో దర్శనమిస్తారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయి నుంచి లోహపు శబ్దం రావటం విశేషం. వాటి పైభా గాన సింహాల వరుసలు, లతలు, వాద్య కారుల చిత్రాలు అందంగా తీర్చిదిద్దారు.
శ్రీ రుద్రేశ్వర మహాలింగం
గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీరుద్రేశ్వర మహాలింగం చాలా గొప్పది. పానవట్టంపై భాగంలోనే కాకుండా, కింది భాగంలోనూ చెక్కిన సన్నని గీతలు శిల్పుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
దశభుజరుద్రుడు
రంగమంటపం మధ్య భాగంలోనున్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు అందంగా చెక్కారు. ఇలాంటి శిల్పమే హన్మకొండలోని రుద్రేశ్వరాలయం (వెయ్యి స్తంభాల గుడి)లో కూడా ఉన్నది.
పరమశివారాధకులైన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించారనటానికి -రుద్రదేవ మహారాజు, రుద్రమదేవి, ప్రతాపకుమార రుద్రదేవమహారాజు అన్న వారి పేర్లలో కనిపించే 'రుద్ర' శబ్దమే నిదర్శనం. ఆ దశభుజ రుద్రునికి కుడివైపున ఉన్న ఐదు చేతులతో శూలము, వజ్రాయుధము, ఖడ్గము, పరశువు, అభయముద్ర ఉన్నాయి. అట్లాగే ఎడమవైపు ఉన్న ఐదు చేతులతో నాగము, పాశము, ఘంట, అగ్ని, అంకుశము ఉన్నాయి.
ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుని 'పండితారాధ్య చరిత్ర' (వాద ప్రకరణం పు.661)లో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కనిపిస్తుంది. ఆ దశభుజరుద్రుని చుట్టూ అష్టదిక్పాలకులు భార్యాసమేతులై, తమతమ వాహనాలమీద కొలువుతీరి ఉన్నారు.
ఆ రంగమంటపం చుట్టూ ఉన్న నాలుగు అడ్డ దూలాల మీద సముద్ర మథనం, త్రిపురాసుర, గజాసుర సంహారం, వరాహమూర్తి, నాట్యగణపతి, కృత్య తదితర రూపాలను శిల్పులు మనోహరంగా చెక్కారు. ముఖ్యంగా గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మహాద్భుతం. రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పులో రకరకాల పద్మదళాలు, రాతి చక్రాలను చెక్కారు.
ప్రదక్షిణపథం
ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉన్నది. దానిమీద నడుస్తూ ఉంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కనిపిస్తాయి. వాటిలో శృంగార, క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవమూర్తులు వంటి విశేషాలు కనిపిస్తాయి.
అవేకాక మహిషాసురమర్దిని, వీరభద్రుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరా లయం పై భాగంలో పెద్ద గోపురం కనిపిస్తుంది. అది వేసర శిల్ప విధానంలో నిర్మింపబడినది. ఆలయ శిఖరానికి ఉపయో గించిన ఇటుకలు నీళ్లలో తేలుతాయి. ప్రస్తుతం అవి లభించటం లేదు. కాని అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.
అటువంటి అనేక శిల్పకళా విశేషాలతో అలరారుతున్న శ్రీ రుద్రేశ్వరాలయం దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని తప్పక దర్శించితీరాల్సిందే. ఈ చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాక, ఓరుగల్లు ప్రజలది కూడా.
Courtesy with : ఆచార్య హరి శివకుమార్@apr - Sun, 28 Apr 2013
*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com
No comments:
Post a Comment