రాష్ట్రంలోనే ఏకైక బ్రహ్మాలయం... చేబ్రోలు ,సృష్టికర్తలలో ఒకడు... అందరి తలరాతలు రాసేవాడు.. ఏడు కొండలవాడికి నిత్య మూ సుప్రభాత సేవలో పాల్గొని (బ్రహ్మాదయస్సువ...) తరించేవాడు... భృగుమహర్షి శాపం కారణంగా కలియుగాంతం వరకు నీటిమధ్యలో ఉండిపోయినవాడు... అన్ని దేవుళ్లకు అష్టోతర, శతనామాలతో భక్తులు పూజలు చేసుకునే అవకాశం ఉన్నా ఆయన మాత్రం పూజా పునస్కారాలకు నోచుకోని వాడు... ఎవరయ్యా అంటే ఇంకెవరూ... బ్రహ్మ అని అందరూ ఠక్కున చెప్పేస్తుంటారు. అటువంటి బ్రహ్మకు గురటూరు జిల్లాలో ఓ అరుదైన దేవాలయం ఉంది. ఆ ఆలయ విశేషాలు
-గుంటూరు జిల్లా కేంద్రానికి 14 కి మీల్ల దూరంలో చేబ్రోలులో (పొ న్నూరు మార్గంలో) క్రీశ 18వ శతాబ్దం లో దేవాలయాన్ని కట్టించి ధన్యుడయ్యాడు రాజా వాసిరెడ్డి వెంకట్రాద్రి నాయుడు. భారతదేశం లో రాజస్థాన్‌లోని పుష్కర్‌క్షేత్రం, తమిళనాడు లోని కుంభకోణం ప్రాంతాలలో మాత్రమే బ్రహ్మకు దేవాలయాలున్నట్లు చెపుతుంటారు. ఆ తరువాత ఒక్క చేబ్రోలులో మాత్రమే దేవాల యం ఉండటం గమనార్హం. బ్రహ్మశ్వరునిగా పిలుచుకుని ఈ స్వామికి నిత్యమూ ఇక్కడ ఎటువంటి పూజాదికాలు జరుగకపోయినా లింగాకారంలో ఉన్న స్వామికి ప్రతిరోజు అభిషేకం, విభూది ధారణ వంటివి మాత్రమే జరుగుతాయి. చతుర్ముఖరూపంతో అలరారే స్వామివారి ప్రాంగణం సుందరంగా ఉంటుంది.
ఉత్సవాలకకు నోచుకోని స్వామి...
సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మా ణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగువైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురంతో దేవాలయం నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పు న వంతెన నిర్మించారు.
-ఇక గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తున, నాలుగు అడుగు ల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగు ల ఎత్తున నలుచదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని వున్న భంగిమలో భక్తులకు కనిపిస్తారు. లింగాకారంగా ఉండటంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు. ఎటువంటి ఉత్సవాలకు నోచుకోని స్వామిని నిత్యం ఎంతో మంది వచ్చి చూసి వెళ్తుంటారు. అప్పట్లో ఏనుగులపై ఎర్ర ఇసుకను తీసుకువచ్చి ఈ దేవాలయాలంను నిర్మించారని చారిత్రక కథనం. కోనేరులో స్వామి వారి దేవాలయం ఉన్నా నేటికీ చెక్కుచెదరని శిల్ప సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.
మరో 9 ఆలయాలు...
దేవాలయానికి సమీపంలో మరో 9 ఆలయాలు ఉండటం విశేషం. గతంలో నూరు దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండేవట. ఉన్న ఆలయాల్లో కేశవస్వామి ఆలయం ప్రాచీ నమైందిగా చెబుతారు. విశాలమైన ప్రాకారాలు... రాజగోపురాలు.. మంటపాలు... స్తంభాలు... ఏకరాతి శిల్పాలు.. శిల్ప సంపద అంతా ఇక్కడ కొలువుదీరి ఉందా అన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్ర హమూర్తులు, నాగేశ్వరాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. విషయ మేమంటే బ్రహ్మ చూపు పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడి బ్రహ్మశ్వరాలయాలన్ని దేవతామూర్తుల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనం.
-తూర్పు, పడమర దిక్కులలో వరుసగా చంద్ర మౌళ్వేశ్వర, సహస్రలింగేశ్వర ఆలయాలు (శివాలయాలు), ఉత్తర దక్షిణాలలో వేణుగోపాలస్వామి, రంగనాధ స్వామి (వైష్ణవ) ఆలయాలు, నైరుతి, వాయువ్య, ఈశాన్య, ఆగ్నేయ దిక్కులలో శక్తి స్వరూపుణులైన అమ్మవార్ల ఆలయాలను ఏర్పాటు చేసి బ్రహ్మేశ్వర ఆలయాన్ని దిగ్బంధం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. ఇన్ని ఆలయాలు ఇక్కడ కొలువుదీరి ఉండటం వల్లే తమ ప్రాంతంలో పండిన పొగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, అలాగే ఇక్కడి చేనేతలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చేబ్రోలువాసు లు గర్వంగా చెపుతుంటారు.
చారిత్రాత్మకంగా ఎంతో పేరున్న చేబ్రోలు ను తూర్పు చాళుక్యులు వంశానికి చెందిన రెండవ యుద్ధమల్లుడు రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు చారి త్రక కథనం. ఆయన 9వ శతాబ్దానికి చెందినవాడు. ఆ తరువాత పశ్చిమ చాళుక్యు లు, కాకతీయ చక్రవర్తి సామంతుడు, సేనాధిపతి అయిన జాయపసేనాని ఈ చేబ్రోలునే రాజధానిగా చేసుకుని పరిపాలించారట. తదనంతరం వెలనాటి చోళులు, ఆపై న గోల్కొండ నవాబులు చేబ్రోలును వశం చేసుకుని పరిపాలించినట్లు ఇక్కడి చారిత్రక కథనం.
రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మకు దేవాలయాన్ని ఏర్పాటు చేసి.. ఆ దేవాయం చుట్టూ మరెన్నో దేవాలయాలను కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలై భాసిల్లేలా తీర్చిదిద్దిన ఘనత ఆనాటి పాలకులదనే చెప్పాలి.
- శిరసనగండ్ల సత్యనారాయణ శర్మ,-జర్నలిస్టు, గుంటూరు@Surya news paper-09/01/2011
*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com
No comments:
Post a Comment