Showing posts with label అవనాక్షమ్మ ఆలయం నారాయణవనం(చిత్తూరు జిల్లా). Show all posts
Showing posts with label అవనాక్షమ్మ ఆలయం నారాయణవనం(చిత్తూరు జిల్లా). Show all posts

Friday, January 10, 2014

Avanakshamma temple Narayanavanam(Chittoor dist)అవనాక్షమ్మ ఆలయం నారాయణవనం(చిత్తూరు జిల్లా)

  •  
  •  
వేదాలను పరిరక్షించి వెలసిన తల్లి... ఆకాశరాజు కులదైవం... పద్మావతీదేవి నిత్యం కొలిచిన దేవి... ఆమ్నాయాక్షి. శ్రీనివాసుడు, పద్మావతిలకు వివాహం నిశ్చయమయ్యాక కల్యాణానికి ముందు ఈ అమ్మనే దర్శించుకున్నారట. చిత్తూరు జిల్లా నారాయణవనం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం మరెన్నో విశేషాలకు ఆలవాలం.
ఆమ్నాం అంటే వేదమనీ, అక్షి అంటే కన్నులు అనీ అర్థం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి... ఆ తల్లికి ఆమ్నాయాక్షి అనే పేరువచ్చింది. ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది. ఆ అమ్మ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనం(వరం) గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉంది.

అమ్మవారి ఆవిర్భావం వెనుక ఓ పురాణ కథ ఉంది. పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట. అప్పుడు పార్వతీదేవీ అతణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకి అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయాక్షిగా వెలిసిందట. అప్పట్లో అమ్మ విగ్రహం చాలా చిన్నగా ఉండేదట. తరువాత కాలంలో అగస్త్య మహర్షి, ఆకాశరాజు... ఆ చిన్న విగ్రహం వెనుకనే, అవే పోలికలు ఉండేలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమకుణ్ణి సంహరించిన ఈ అమ్మ కాళికామాతను పోలి ఉంటుంది.
  
ఆకాశరాజు కుల దేవత
లక్ష్మీదేవి అవతారంగా చెప్పే పద్మావతీ దేవి తండ్రి ఆకాశరాజు. వాళ్ల కులదేవతే అవనాక్షమ్మ. అప్పట్లో ఆకాశరాజు కోట ముందుభాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్లేముందు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునేవాడట. ఆయనకు చాలాకాలం వరకూ పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాడట. ఫలితంగా పద్మావతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతీదేవి తండ్రితో సహా రోజూ ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయణవనంలోని ఉద్యానవనంలో ఓరోజు శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది పద్మావతి. ఆ శ్రీనివాసుణ్ణే తనకు భర్తను చేయమని అవనాక్షమ్మను కోరుకుందట. శ్రీనివాసుడు, పద్మావతిలకు పెళ్లి నిశ్చయమయ్యాక... వాళ్లిద్దరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పద్మావతి ఈ ఆలయంలో గౌరీవ్రతం చేసిందట. పరిణయం తరువాత వాళ్లిద్దరూ తిరుమలకు వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు 'పద్మావతీ పరిణయం' పుస్తకంలో ఉంది.
అవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్త్యీశ్వరాలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారట. ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు. ఈ గుడిలోని అమ్మవారిని మరకతవల్లి అంటారు. సాధారణంగా శివాలయాల్లో ముందు శివలింగం, దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు. కానీ, ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉండి, ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం. పద్మావతీ దేవికి ఒకానొక సమయంలో జబ్బుచేసిందట. అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయించగా వ్యాధి నయమైనట్లు 'వేంకటాచల మహత్యం'లో ఉంది.

18 రోజుల జాతర
ఈ ఆలయానికి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహం కానివారికి వివాహం అవుతుందనీ, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారనీ భక్తుల నమ్మకం. అమ్మవారికి ఏటా 18రోజులపాటు జాతర జరుగుతుంది. ఇది ఆగస్టు 22 - 26 తేదీల మధ్యలో ప్రారంభమై సెప్టెంబరు 11, 12 తేదీల్లో ముగుస్తుంది. ఏటా అక్టోబరులో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.
ఈ ఆలయానికి దాదాపు మూడువేల సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట ఆకాశరాజు, తరువాత కార్వేటి వంశస్థులు, అనంతరం తిరుత్తణి రాజులు దీని అభివృద్ధికి కృషిచేశారు. 1967లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చింది. అప్పట్నుంచీ పూజాద్రవ్యాలూ వసతులూ అన్నీ వారే సమకూరుస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం రాష్ట్రపర్యాటక అభివృద్ధి సంస్థ వసతులు సమకూర్చింది. భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు వీలుగా షెడ్డు, ఇతర సౌకర్యాల్లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించారు.

అవనాక్షమ్మ ఆలయంలో ఎన్నో విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో అమ్మవారి చిన్న విగ్రహంతోపాటు పెద్ద విగ్రహం, శాంకరీదేవి విగ్రహం, వేపచెట్టుకింద గణపతి విగ్రహం, ఆలయం వెనుక నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఆలయం ముందుభాగంలో రెండు పెద్ద రాతిస్తంభాలున్నాయి. వీటి మధ్యలో భారీ గంట ఉండేదట. అమ్మవారికి పూజలు నిర్వహించే సమయంలో దీన్ని మోగిస్తే చుట్టుపక్కల గ్రామాలూ పొలాల్లో ఉన్నవారు అవనాక్షమ్మను ప్రార్థించేవారని చెబుతారు.
 
ఇలా చేరుకోవచ్చు
అవనాక్షమ్మ ఆలయం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే బస్సు ఎక్కి నారాయణవనంలో దిగాలి. అక్కడి నుంచి కిలోమీటరు నడిస్తే ఆలయం వస్తుంది. రైళ్లలో వచ్చేవారు తిరుపతి, పుత్తూరు (5 కి.మీ. దూరం) నుంచి రావచ్చు.

Courtesy with - మాల్యాద్రి కొచ్చర్ల, చిత్తూరు డెస్క్‌ -ఫొటోలు: బి.చంద్రశేఖర్‌, న్యూస్‌టుడే, నారాయణవనం


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _