Showing posts with label Chennakeshava Temple-Markapuram(prakasam dist). Show all posts
Showing posts with label Chennakeshava Temple-Markapuram(prakasam dist). Show all posts

Sunday, January 12, 2014

Chennakeshava Temple-Markapuram(prakasam dist),చెన్నకేశవ క్షేత్రం-మార్కాపురం(ప్రకాశం జిల్లా)

  •  

  •  
   శ్రీమహావిష్ణువు అలంకారప్రియుడు. అందుకే ఆయన్ని చెన్నకేశవుడు అని కూడా పిలుస్తారు. అంటే అందమైన కేశవుడు అని అర్థం. అలాంటి చెన్నకేశవుడు మొట్టమొదట భూమిపై వెలసిన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. నాలుగు యుగాల్లోనూ ఉన్నదని చెప్పే విశేషాలు...

మార్కండేయుడు... శివారాధన చేసి మృత్యువును జయించిన చిరంజీవి. ఆయన 'గజారణ్య సంహిత' అనే గ్రంథాన్ని రచించారు. ఈ 'గజారణ్యం' మరేంటో కాదు... ప్రకాశం జిల్లాలోని మార్కాపురమే.

కృతయుగం కంటే ముందు సంగతి. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యం. మహర్షులు తపస్సు చేసుకునేవారు. వాళ్ల తపస్సును భంగం చేసేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అప్పుడు మహర్షుల కోరికమేరకు శ్రీహరి ఇక్కడ చెన్నకేశవుడిగా స్వయంభువుగా వెలిశాడు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవిగా అవతరించింది. కృతయుగంలో ఈ ప్రాంతంలో ఉండే ఏనుగులు స్వామిని గుండికా నది (గుండ్లకమ్మ) నీటితో అభిషేకించేవట. అందుకే దీనికి 'గజారణ్యం' అనే పేరు వచ్చింది.

త్రేతాయుగంలో గౌతమ మహర్షి స్వామికోసం ఇక్కడే తపస్సు చేశాడు. ద్వాపరయుగంలో రాక్షసుల బాధలకు తట్టుకోలేని దేవతలు చెన్నకేశవుణ్ణి పూజించారట. అందుకే దీనికి 'స్వర్గసోపానం' అని పేరు వచ్చిందని చెబుతారు.

కలియుగంలో మారికా, మారకులనే భక్తులు స్వామికోసం తపమాచరించారట. వాళ్ల తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యారట. అప్పట్నుంచీ ఈ క్షేత్రాన్ని వాళ్ల పేరిట మారికాపురమనీ, మారకాపురమనీ పిలిచేవారు. అదే కాలక్రమంలో మార్కాపురం అయ్యిందంటారు.

చరిత్రలోనూ...
12వ శతాబ్దంలో పలనాటి రాజు మలిదేవుడు గురజాలలో జరిగిన కోడిపందేల్లో ఓడిపోయాడట. అప్పుడు తన మంత్రి బ్రహ్మనాయుడితో కలిసి చెన్నకేశవుణ్ణి కొలిచాడట. ఈ విషయాన్ని పల్నాటి వీరచరిత్రలో శ్రీనాథుడు ప్రస్తావించాడు. 1513లో శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకుని కల్యాణ, బ్రహ్మోత్సవాలను జరిపించారు. ఆలయ నిర్మాణానికి తన సామంతరాజు తిమ్మరాజయ్యను ఆదేశించి... స్వామివారికి గర్భాలయం, అంతరాలయం, మహాద్వారం, గర్భగుడిపై ఉన్న విమానగోపురం, రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ నిర్మాణాలను పూర్తిచేయించారు. కృష్ణదేవరాయల తరవాత అచ్యుత దేవరాయలు ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, వేణుగోపాలస్వామి, రంగనాయకస్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలు నిర్మించారు.

గాలిగోపురం నిర్మాణం వివిధ దశల్లో జరిగింది. 1929లో అప్పటి తాలూకా కచేరీ గుమస్తా పోనంగి లింగరాజు రెండు అంతస్తులు నిర్మించారు. తరవాత ఏడంతస్తులను నాటి మేజిస్ట్రేట్‌ రాయసం సంయోగేశ్వరరావు భక్తుల సహకారంతో పూర్తిచేశారు. 1936లో గోపుర కలశ స్థాపన, మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం నిర్వహించారు.
విశేషాలకు ఆలవాలం
మార్కాపురం చెన్నకేశవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి స్వామివారి మూలవిగ్రహం చుట్టూ మకర తోరణం ఉంటుంది. కృతయుగంకంటే ముందే ఉన్న ఈ తోరణంపై దశావతారాలు ఉండటం విశేషం. సాధారణంగా శ్రీహరికి కుడిచేతిలో సుదర్శనచక్రం ఉంటుంది. కానీ, ఇక్కడ ఎడమచేతిలో ఉంటుంది. స్వామి ఈ చక్రంతోనే కేశి అనే రాక్షసుణ్ణి సంహరించాడట. మూలవిరాట్టు పక్కనే మార్కండేయ మహర్షి, మారిక, మారకయ్యల విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఆస్థానమండపంలో ఉన్న స్తంభాలన్నీ ఏకశిలతో తయారుచేసినవే. ఈ మండపం చుట్టూ ఉన్న చూరు (సన్‌షేడ్‌) మరో ఆకర్షణ. ఒక రాయిని మూడు వంపులుగా చెక్కడం ఇందులోని ప్రత్యేకత. ఇలాంటి చూరు తిరుపతి, శ్రీశైలం ఆలయాల్లో మాత్రమే కనిపిస్తుంది.

ఇందులో అన్నదమ్ముల స్తంభాలు చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సోదరులైన ఇద్దరు శిల్పులు తమ మధ్యలో అడ్డంగా తెర కట్టుకుని, శబ్దభేది విద్య ద్వారా రెండు స్తంభాలను చెక్కారు. అంటే, అన్నయ్య ఉలితో శిలమీద ఒకచోట చెక్కినప్పుడు వచ్చే శబ్దం ఆధారంగా తమ్ముడు కూడా సరిగ్గా తన దగ్గరున్న శిలమీద అదేచోట, అలాగే చెక్కాడట. అలా చెక్కిన ఈ స్తంభాలు రెండూ నూటికి నూరుశాతం ఒకేలా ఉండటం విశేషం.

ధనుర్మాసంలో సూర్యోదయ సమయాన ఉదయ భానుని లేలేత కిరణాలు గర్భాలయంలోని మూలవిరాట్టు పాదాల నుంచి శిరస్సు వరకూ వ్యాపిస్తాయి.

వేదకాలం నుంచే ఉత్సవాలు
చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు వేదకాలం నుంచీ జరుగుతున్నాయని గజారణ్య సంహితలో ఉంది. ఆ సమయంలో 12 రోజులపాటు (ప్రతిరోజూ చంద్రోదయానంతరం) వాహనోత్సవాలు జరుగుతాయి. ఏటా చైత్రశుద్ధ చతుర్దశి రోజున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, పౌర్ణమి నాడు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సూర్య, చంద్ర, సింహ, శేష, యాళి, పొన్న, హనుమ, గరుడ, గజ, అశ్వ, హంస వాహనోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైంది రథోత్సవం. దీనికి సుమారు లక్షమంది భక్తులు హాజరవుతారని అంచనా.
ఇలా వెళ్లొచ్చు -- ఒంగోలు నుంచి మార్కాపురానికి 94 కి.మీ. దూరం. బస్సుల్లో రావొచ్చు. రైలుద్వారా విజయవాడ-కర్నూలు మార్గంలో ఉన్న మార్కాపురం చేరుకోవచ్చు.

- దొండపాటి మోహన్‌రెడ్డి,న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం(ఆదివారము అనుబంధము).



*=================================*
* Visit my website : Dr.Seshagirirao.co