Showing posts with label మోఢేరా సూర్య దేవాలయం. Show all posts
Showing posts with label మోఢేరా సూర్య దేవాలయం. Show all posts

Thursday, December 19, 2013

Modhera Sun Temple,మోఢేరా సూర్య దేవాలయం

  •  
  •  

అన్ని దేవాలయాల్లోకెల్లా సూర్య భగవానుని దేవా లయాలు చాలా అరుదనే చెప్పాలి. అయితే సూర్య భగవానుని దేవాలయం అనగానే మనకు మొదట గా గుర్తుకు వచ్చేది కోణార్క్‌ సూర్య దేవాలయం. మనరాష్ట్రం విషయానికి వస్తే.. అరసవెల్లి సూర్య దేవాలయం పేరు ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇవే కాకుండా గుజరాత్‌లోని మోఢేరా సూర్య దేవా లయానికి కూడా ఎంతో చరిత్ర ఉంది. స్కంద, బ్రహ్మ పురాణాల్లో కూడా ప్రస్తావనకు నోచుకున్న అరుదైన ప్రాంతంలో వెలసిన మోఢేరా సన్‌ టెంపుల్‌ విశేషాలు ...

అహ్మదాబాద్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న ‘పుష్పవతి’ నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్‌ సోలంకి- నిర్మించారు. క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్‌ మరియు చుట్టు పక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్‌ హమద్‌ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు.

సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పు కునే ‘అహిల్‌వాడ్‌ పాటణ్‌’ కూడా తన గొప్ప తనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో నాలుగు సూర్యదేవుని ఆలయా లున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్‌ మందిరం, రెండవ ది జమ్మూలో నున్న మార్తాండ్‌ ఆలయం, మూడవది మన రాష్ట్రంలోని అరసవెల్లి. నాలుగవది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం.

సున్నం లేకుండా నిర్మాణం...
శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అ దేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశే షం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్‌ నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోప ల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది. మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు రామాయణం, మహాభారతంలోని ప్రధానమైన విషయాలను కూడా చెక్కారు.

-స్తంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి. సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్య కిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. సభామండ పానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు. అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతు నకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.

చరిత్రలో మోఢేరా...
స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాల ను ‘దర్మరన్య’ అని పిలిచేవారు. శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపం నుంచి బయట పడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెపుతున్నాయి. అప్పుడు గురువైన వశిష్ట మహర్షి ‘ధర్మరన్య’ వెళ్ళమని శ్రీరామ చంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలవబడుతోంది.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: అహ్మదాబాద్‌ నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్‌ నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది.
రైలు మార్గం: అహ్మదాబాద్‌ వరకు రైలు మార్గం గుండా వెళ్లవచ్చు.

Courtesy with : Sunday magazine@surya Telugu daily 21-June-2013

  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _