Thursday, January 9, 2014

Agasteswara Temple -Chennuru(Adilabad dist),అగస్తేశ్వరాలయం-చెన్నూరు(ఆదిలాబాద్‌ జిల్లా)

  •  
  •  

    గోదావరి నది పుట్టినచోటి నుంచి సముద్రంలో కలిసే వరకూ మరెక్కడా లేని ప్రత్యేకత ఆ ప్రాంతంలో ఉంది. నదీతీరాన్ని ఆనుకుని ఉన్న ఆ ఆలయంలోకి అడుగుపెడితే... నాలుగు శతాబ్దాలుగా ఉన్న ఒక అద్భుతం దర్శనమిస్తుంది. అగస్త్యుడు తపస్సు చేశాడని చెప్పే ఆ అద్భుత క్షేత్రం, అంజనాదేవి స్నానమాచరించిందని చెప్పే ఆ నది ఉన్న వూరు... ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు.

గోదావరి తీరం పొడవునా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిలో ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరులోని అగస్త్యేశ్వరాలయం ఒకటి. దీన్ని ఉత్తర వాహిని తీరం అని పిలుస్తారు. మరణించినవారి అస్థికలను నిమజ్జనం చేయడానికీ, పుణ్యస్నానాలు చేయడానికీ ఇక్కడకు అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇంతకీ, ఈ ప్రాంతానికి ఉత్తరవాహిని తీరం అని పేరెందుకు వచ్చిందీ ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందీ అంటే...

అగస్త్యుడు తపస్సు చేసి...
రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన ఆలయాల్లో అగస్త్యేశ్వరాలయం ఒకటి. ద్వాపరయుగంలో అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చారట. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికీ ప్రశాంతతకూ ముగ్ధుడైన ఆ మహర్షి ఇక్కడ ఓ భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అలా ఇక్కడ నిర్మితమైన ఈ ఆలయానికి అగస్త్యేశ్వరాలయం అని పేరు వచ్చింది.

ఆ తరవాత 1289వ సంవత్సరంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు స్థలపురాణం. 20 ఏళ్ల తర్వాత అల్లావుద్దీన్‌ఖిల్జీ కాలంలో సేనాని మాలిక్‌కఫూర్‌ ఈ ఆలయంపై దాడిచేసి గోపురాన్ని ధ్వంసం చేశాడట. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు చెన్నూరు ప్రాంతానికి వచ్చిన సమయంలో ఈ ఆలయాన్ని మరోసారి పునర్నిర్మించినట్టు... ఆలయ ప్రాంగణంలో దొరికిన ఒక శాసనం చెబుతోంది. ఆలయం ముందు ప్రతిష్ఠించిన ఈ శాసనం తెలుగు, కన్నడ మిశ్రమ భాషల్లో కనిపిస్తుంది.

గోదావరి ఉత్తర దిశగా...
సాధారణంగా నదులన్నీ పశ్చిమదిశ నుంచి తూర్పునకు ప్రవహిస్తాయి. కానీ, ఈ క్షేత్రంలో ఆలయానికి తూర్పున ఉన్న గోదావరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఉత్తర దిశగా 15 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాశీలో గంగానది ఆరు కి.మీ. ఉత్తర దిశగా ప్రవహిస్తుండగా... చెన్నూరు మండలంలోని పొక్కూర్‌ గ్రామం నుంచి కోటపల్లి మండలంలోని పారుపల్లి గుట్టల వరకు గోదావరి నది ఉత్తర దిశగా ప్రవహిస్తోంది. పారుపల్లి గుట్టలపై దిగంబరంగా ఉన్న భైరవుడి విగ్రహ రూపాన్ని చూడలేకే ఇలా ప్రవహించిందని చెబుతారు. గోదావరి జన్మస్థలం నుంచి సముద్రంలో కలిసే వరకు మరెక్కడా ఇలా లేదు. అందుకే ఈ ప్రాంతంలో పుణ్యస్నానాలకూ, అస్థికలు నిమజ్జనం చేయడానికీ భక్తులు తరలివస్తుంటారు. గోదావరి ప్రత్యేక ప్రవాహం వల్లే ఈ ప్రాంతానికి ఉత్తర వాహిని తీరం అనే పేరు వచ్చింది. ఎంతో విశిష్టమైన ఈ నదిలో... ఆంజనేయుడి తల్లి అంజనాదేవి స్నానమాచరించిందని స్థలపురాణం చెబుతోంది.

అఖండ జ్యోతి
ఈ ఆలయ గర్భగుడిలో అడుగుపెట్టగానే... అగస్త్యుడు ప్రతిష్ఠించిన భారీ శివలింగం దర్శనమిస్తుంది. గర్భగుడిలోని మరో విశేషం... అఖండజ్యోతి. ఇది సుమారు 410 ఏళ్ల నుంచి నిరంతరం వెలుగుతూనే ఉంది. అప్పట్లో జక్కెపల్లి సదాశివయ్య అనే బ్రాహ్మణుడు దీన్ని వెలిగించాడు. అంతేకాదు, శివలింగానికి నిత్యపూజలూ చేసేవాడు. నాటి నుంచి నేటి వరకు జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది. సదాశివయ్య తరవాత ఈ జ్యోతి బాధ్యతలనూ, నిత్యపూజలనూ ఆయన కుమారులే చూసుకుంటున్నారు. ఆయన కుటుంబంలో నాలుగో తరానికి చెందిన హిమాకర్‌శర్మ ప్రస్తుతం వీటిని నిర్వహిస్తున్నారు.

పుష్కరాలకు...
గోదావరి పుష్కరాల సమయంలో... రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు ఈ తీరంలో పుణ్యస్నానాలు చేస్తారు. వేమనపల్లి మండల కేంద్రంలోనూ(చెన్నూరునుంచి 30 కి.మీ. దూరం), కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట (20 కి.మీ. దూరం)వద్దా నిర్వహించే ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులు చెన్నూరులోని ఆలయాన్ని సందర్శించి వెళ్తారు. శివరాత్రి రోజున అఖండజ్యోతికి పూజలు నిర్వహించి, శివపార్వతుల కల్యాణం చేస్తారు. కార్తీకమాసంలో వైకుంఠ చతుర్దశి వేడుకను ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుతారు. ఆ రోజు రాత్రి భక్తులు ఉమ్మెత్త పూలతో శివలింగానికి పూజచేస్తారు. శ్రావణమాసంలో నెలరోజుల కఠోర శివదీక్షతో భక్తులు ఈ లింగానికి నిత్యాభిషేకాలు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో... గ్రామస్థుల దోషాలు పోవాలనీ, వాళ్లకు ఎలాంటి కష్టమూ కలగకూడదనీ... స్వామికి రుద్రాభిషేకం నిర్వహిస్తారు.

ఈ ఆలయం... మంచిర్యాల నుంచి సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ప్రతి గంటకూ ఒక బస్సు ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి రైల్లో నేరుగా మంచిర్యాల వచ్చి ఆలయానికి వెళ్లొచ్చు. విజయవాడ, వరంగల్‌, ఖమ్మం వాళ్లు ఖాజీపేట వరకూ రైల్లో వచ్చి, అక్కణ్ణుంచి మంచిర్యాలకు రైల్లో వెళ్లాలి.

- కాయల పూర్ణచందర్‌, ఆదిలాబాద్‌డెస్క్‌-ఫొటోలు: సిద్ది వెంకటేశ్వర్లు, న్యూస్‌టుడే, చెన్నూరు రూరల్‌

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

1 comment: