-ద్యావనపల్లి సత్యనారాయణ
గోదావరి నదికి ఇరువైపులా గల ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు, వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్లు చిన్నయ్య, పెద్దయ్య. చిన్నయ్య పెద్దయ్య/ చిలుకల్ల భీమయ్య అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు, పెద్దయ్య అంటే ధర్మరాజు, వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు అని స్పష్టమవుతోంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలవడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు వివాహమాడటంతో స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు. భీముడి కంటే ధర్మరాజు పెద్దవాడు కాబట్టి, అర్జునుడు గొప్పవాడు కాబట్టి వారిని కూడా పూజిస్తారు. ఐతే ఎవర్ని పూజించే చోటనైనా భీముడ్ని పూజించడం తప్పనిసరి. అలా చిన్నయ్య గుడి (ఇల్లారి)లో కూడా మనకు భీముడి చిహ్నాలు, చరిత్రలే ఎక్కువగా కన్పిస్తాయి.
చిన్నయ్య ఇల్లారి ఆదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలంలో ఉంది. ఈ ఇల్లారి ప్రదేశం పవిత్రతకే కాకుండా ప్రకృతి సౌందర్యానికి కూడా పెట్టింది పేరు. హైదరాబాద్ నుంచి సుమారు 230 కి.మీ.లు ప్రయాణించి (కరీంనగర్, చొప్పదండి మీదుగా) లక్షెట్టిపేట చౌరస్తా చేరుకొని, అక్కడి నుంచి 5 కి.మీ.ల దూరంలో వచ్చే వెంకట్రావుపేట మీదుగా 10 కి.మీ లు ప్రయాణించి చెల్లంపేట గూడేనికి చేరుకుంటే దానికి ఒక కి.మీ. దూరంలోనే ఉంటుంది ఈ చిన్నయ్య దేవర స్థలం.
చిత్రమైన విగ్రహాలు
చిన్నయ్య ఇల్లారికి సుమారు రెండు కి.మీ.ల ముందే ఒక సెలయేరు పారుతూంటుంది. అన్ని కాలాల్లోనూ భక్తులు, పర్యాటకులు దీని దగ్గరే ఆగి వంటా వార్పూ చేసుకోవాలి. ఈ సెలయేరు ఎతె్తైన పచ్చని చెట్ల మధ్య నుంచి పారుతూండటం ఒక సుందర దృశ్యం. ఆంధ్రాలోని మారేడుమిల్లి పర్యాటక కేంద్రాన్ని చూసిన వారికి దానితో దీనికి పోలిక కన్పిస్తుంది.
చిన్నయ్య ఇల్లారి తూర్పు అభిముఖంగా ఉన్న ఒక చిన్న గుడిసె లేదా పాక. అందులో మధ్యలో చిన్నయ్య దేవుడిగా చెప్పే నల్లని విగ్రహముంది. దానే్న అల్లుబండ అని కూడా అంటారు. నిజానికి అది గజానమని (వినాయకుని) పోలికలతో ఉంది. దాని చుట్టూ రెండు అడుగుల ఎతె్తైన ఏనుగులు, ఎద్దులు, గుర్రాల బొమ్మలు తమ వీపులపై పల్లకీలను మోస్తున్నట్లుగా గంటలతో అలంకరించబడి ఉంటాయి. ఇవి మట్టితో చేసి కాల్చబడిన టెర్రాకోట్ బొమ్మలు. వీటి వెనుక ముందు కూడా ఇలాంటివి చిన్నచిన్న బొమ్మలు వందల్లో ఉంటాయి. వాటిని భక్తులు తమ కోర్కెలు తీరినందుకు, తమకు సంతానం కలిగినందుకు మొక్కు చెల్లింపుగా చేయించినవి. ఇలా ఇక్కడ చెల్లింపులు జరుగుతాయి. కాబట్టే ఈ ఊరి పేరు చెల్లంపేట అయ్యిందేమో!
చిన్నయ్య ఇల్లారికి ఎడమ పక్కన పెద్దయ్య ఇల్లారి ఉంది. ఇది మొదటి దానికంటే చిన్నగా ఉంటుంది. ఇందులో రెండు అల్లుబండలుంటాయి. మనసులో ఒక పని గురించి తలచుకొని ఒక అల్లుబండను రెండు చేతులతో లేపే ప్రయత్నం చేస్తే ఆ పని విజయవంతంగా జరిగేటట్లయితే ఆ బండ లేవదని, ఆ పని ఫెయిలయ్యేటట్లయితే ఆ బండ అవలీలగా పైకి లేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ అల్లుబండలు/ విగ్రహాల ముందే రైతులు/ భక్తులు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇస్తారు. వాటి రక్తంతో తడిసిన బండారిని (పసుపు) గోండు/ నాయకపు పూజారి మంత్రించి ఇస్తాడు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులు ఆ బండారిని అత్యంత పవిత్రంగా భావించి, తమ పంట పొలాలపై చల్లుకొని, అది కీటకనాశినిగా పనిచేసి తమ పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. నిజంగానే పసుపు కీటకనాశిని కావడం గమనార్హం.
భీముడి చారిత్రక ఆనవాళ్లు
స్థానికంగా గిరిజనులు, రైతుల నోట భీముడికి సంబంధించిన చరిత్ర ఆనవాళ్ల గురించి చాలా వింటాం. మరి వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని ప్రతి విగ్రహాన్ని, రాళ్లను, గుహలను, గుట్టలను సూక్ష్మంగా పరిశీలిస్తూ వెళల్తే ఆశ్చర్యకంగా కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. చిన్నయ్య పెద్దయ్య ఇల్లారుల్లోగల అల్లుబండల/ విగ్రహాలకు ఇరుపక్కలా భీమన్న గదలుగా చెప్పబడే రెండు అడుగుల ఎత్తుగల ఇత్తడి గదలున్నాయి. వాటిల్లో ఒక దానికి భీముడు ఘటోత్కచుని ఎత్తుకున్నట్లున్న చిత్రం కింద హిడింబి చిత్రం చెక్కి ఉంది. ఈ ఇల్లారిల వెనుక రెండు గుహలున్నాయి. అందులో నైరుతి వైపున ఉన్న గుహలోకి కొన్ని గజాల దూరం పాక్కుంటూ వెళితే తరువాత నిలువెత్తు పొడవైన మార్గం కనిపిస్తుంది. అది ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దయ్య ఇల్లారి వరకు సాగుతుందని, పెద్దయ్య చిన్నయ్య మీద ఈర్ష్యతో ఈ మార్గానికి అడ్డంగా రాయి పడేశాడని, లేదు బహిష్టులో ఉన్న ఒక అమ్మాయి ఆ మార్గంలో నడవడంతో ఆ రాయి అడ్డం పడిందని భిన్న కథనాలు విన్పిస్తాయి. నిజమెలా ఉన్నా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుహ ప్రారంభంలోనే దాని పైకప్పును చూస్తే మనకు భీముడు, హిడించి పెళ్లి చేసుకొని సుఖించిన ముత్యాల పందిరికి సంబంధించినవిగా చెప్పబడే గుంజలు, గొడుగు (శిఖర కిరీటం) గుర్తులు కన్పిస్తాయి. మరికాస్త పరిశీలిస్తే చరిత్ర పూర్వయుగ మానవులకు సంబంధించిన చిత్రాలకు మల్లే కన్పిస్తాయి. కాని ఈ గుహలో ఉన్న గబ్బిలాలు, చీకటి సూక్ష్మంగా పరిశీలించే అవకాశాన్నివ్వవు. ఇల్లారికి వాయవ్యంలో ఉన్న గుహలో కూడా చాలా ప్రాచీనమైన విగ్రహాలున్నాయి. కాని అందులో కూడా ఇదే పరిస్థితి.
నైరుతి గుహలోని గుర్తులు గనుక చరిత్ర పూర్వ యుగానికి చెందినవైతే తెలంగాణ చరిత్రకారులకు పండుగే. అవి భీముడికి సంబంధించినవైతే కూడా కావొచ్చు. ఎందుకంటే భీముడు కూడా చరిత్ర పూర్వ యుగానికి చెందినవాడే. ఇటీవల పుష్కర్ భట్నాగర్ అనే ఒక ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి అమెరికా నుండి టైమ్ మెషీన్‌ను దిగుమతి చేసుకొని, అందులో భారతంలో వివరించబడిన ఖగోళ స్థితి వర్ణనలను పొందుపరచి పాండవులు వనవాసం చేస్తూ దక్షిణాదికి (ఆంధ్రప్రదేశ్) వచ్చింది సుమారు క్రీ.పూ. 3150 ప్రాంతంలో అని శాస్ర్తియంగా నిర్ధారించారు. దీన్నిబట్టి ఈ గుహలోని చిత్రాలు 5160 సంవత్సరాల కిందటివని తేలుతుంది.
పాండవులు వనవాసం వచ్చినప్పుడు భీముడు ఇక్కడి స్థానిక గిరిజన యువతి హిడింబిని పెళ్లి చేసుకొని, ఘటోత్కచుడు అనే కుమారుణ్ని కని, ఆమెతో ఉన్నన్నాళ్లు ఇక్కడ ఏదులతో (అడవి దున్నలతో) వ్యవసాయం కూడా చేశాడనేది ఇతిహాసం. అందుకు నిదర్శనంగా మనకు ఈ చిన్నయ్య ఇల్లారి ఉన్న దండెపల్లి మండలంలోనే ‘ఏదులపాడు’ అనే గ్రామముందని తెలిపే ఆధునిక శిలాశాసనమొకటి చిన్నయ్య దేవరకు నైరుతి మూలన కన్పిస్తుంది. ఈ ఇల్లారికి వాయవ్యంలో ఒక కిలోమీటరు దూరంలో ఒక పెద్ద పరుపుపై భీముడు ఏదులతో దున్నిన నాగలి కోండ్ర చాళ్లున్నాయి. వాటి కిందుగా భీముడి పాదముద్రలుగా చెప్పబడుతున్న మూడు గజాల పొడవు, గజంన్నర వెడల్పులతో ఉన్న రెండు నీటి గుంటలు కనపడతాయి. వాటిల్లో ఒక గుంట ఒడ్డున భీముడు మలశుద్ధికై కూర్చున్నప్పుడు పడిన అతని కటి కింది భాగపు గుర్తులు, పాదముద్రలు కన్పిస్తాయని చెప్తారు. ఈ గుంటలకు కొంచెం దూరం నైరుతిలో హిడింబి స్నానానికి ఉపయోగించినవిగా చెప్తున్న కుండల ఆకారంలోగల గుంటలు కన్పిస్తాయి. నిజానికి ఈ గుంటల్లో కొన్నింటికి మెట్లు తొలిచిన ఆనవాళ్లు కన్పిస్తాయి కాబట్టి ప్రాచీన కాలంలో ఎవరో వీటిని నీటి సదుపాయాలకు ఉపయోగించు కున్నారనవచ్చు.భీముణ్ని కొలిచేవారు అందమైన ఏదు కొమ్ములను తలపాగాగా అలంకరించు కోవటం చూస్తూంటాం. భీముడు చంద్రవంశానికి చెందినవాడు. ఈ ప్రాంతంలో సంచరించడానికి ఈ చంద్రవంక జెండాలే దారి చూపుతాయి.
ఇక్కడ సున్నా ఆకారంలో గిరిగీసిన కొండల మధ్య కొలోజియం వంటి ఐదారు వందల ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో రెండు మూడు సెలయేళ్లు పారుతున్నాయి. ఇలా ఈ స్థలం వ్యూహాత్మకంగా ప్రజలను రక్షించే విధంగానూ, వ్యవసాయాభివృద్ధికి దోహదపడే విధంగానూ ఉంది. కాబట్టి ప్రాచీన కాలంలో ఇక్కడ స్థానిక రాజ్యమైనా వర్థిల్లిందంటే నమ్మవచ్చు.
చప్పట్లకు నీళ్లు రాలుతాయా?ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కాని ఇక్కడ మాత్రం మాటలు, చప్పట్ల ప్రతిధ్వనికి నీళ్లు రాల్చే కొండలున్నాయి. అందుకే అవి ‘మంచి కొండలు’, వాటి నుంచి వచ్చే నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి వాటిని ‘మంచుకొండలు’ అని కూడా పిలుస్తారు. ఈ కొండల నుంచి జాలువారే ఒక సెలయేరు
పరిసరాల నుండే సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి ఈ కొండలను చేరుకోవాలి. నీళ్లున్న పరిసరాలలో పచ్చని చెట్లు ఏపుగా పెరుగుతాయి. వాటిని ఆశ్రయించి పక్షులు, జంతువులు జీవిస్తాయి. కాబట్టి మనం వినసొంపైన వాటి అరుపుల మధ్య చిక్కని చెట్ల గుండా సెలయేరును ఆనుకొని నడిచే ట్రెక్కింగ్ ఒక మరిచిపోలేని అనుభూతి.
అలా ఓ అరగంట నడిచిన తరువాత - ఒక కుండ ఆకారంలో కొండల మధ్య ఏర్పడిన లోయ. దాని పొడవు, వెడల్పు, ఎత్తు.. చుట్టు కొలతలు అన్నీ సుమారుగా వందేసి మీటర్లే. ఆ ఇరుకైన లోయలోకి వెళితే మన మాటల స్వరం మారిపోతుంది. కారణం అవి ప్రతిధ్వనిస్తాయి. ఇక మనం గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడితే వాటి ద్వారా వచ్చే ప్రతిధ్వనులు ఆ లోయలోనే చక్కర్లు కొట్టి చుట్టూ ఉన్న కొండల్లో ప్రకంపనలు పుట్టించి వాటిల్లో నిక్షిప్తమైన నీళ్లను బయటికి లాగుతాయి. అలా చప్పట్లకు నీళ్లు రాలుతాయి. ఐతే వర్షాల సీజన్‌లో మాత్రం చప్పట్ల అవసరం లేకుండానే ఆ కొండల మీది నుంచి జలపాతం దుముకుతుంది.
ఈ మంచు కొండలు భీమ - హిడింబిల సయ్యాటలకే కాకుండా క్రీ.శ.1159లో పొలవాస (జగిత్యాల దగ్గర) రాజు రెండవ మేడరాజు, అతని కుమారుడు జగ్గరాజులకు కూడా ఆశ్రయమిచ్చాయి. కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుని చేతిలో ఓడిపోయిన ఈ మేడరాజు ‘రుద్రుడు’ తన రాజధానిని కాల్చినందుకు బాధపడక ఈ మంచి కొండల్లో ఉన్న వృక్షాలను ఆశ్రయించి ఆనందించాడని రుద్రుని మంత్రి గంగాధరుని హనుమకొండ శాసనంలో ఉంది.
Chinnaiahgutta published in Andhrabhoomi on 11-3-2012
*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _
No comments:
Post a Comment