'గంగాతరంగ రమణీయ జటాకలాపం...' అని విశ్వనాథాష్టకంలో కాశీవిశ్వనాథుణ్ణి కీర్తిస్తాం. గంగను తన జటాఝూటంలో ధరించిన గంగాధరుడు... ఆ గంగతోనే ఆవిర్భవించిన ఆలయం విశాఖపట్టణం జిల్లా చోడవరంలో (జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో) ఉంది.
చోళరాజు గౌరీశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రోజులవి. పరమ శివభక్తుడైన అతడికి ఒకనాడు శివుడు కలలో కనిపించి 'నీ కోటకు తూర్పున గంగాదేవితో సహా వెలసి ఉన్నాను' అని చెప్పాడట. మర్నాడు ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వి చూడగా, చుట్టూ గంగతో 4 అడుగుల ఎత్త్తెన శివలింగం కనిపించిందట. అదే రోజు ఓ రైతు తన పొలం దున్నుతుండగా నంది, ద్వారపాలకుల విగ్రహాలు బయటపడ్డాయట. రాజుకి రైతు ఈ విషయాన్ని చెప్పగానే... రాజు వెంటనే ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడట. గంగతో కలిసి ఉండటం వలన ఆ దేవాలయానికి 'గంగా గౌరీశ్వర ఆలయం' అని నామకరణం చేశారు. ఆ తరవాతి నుంచీ ఈ ప్రాంతం పాడిపంటలతో వర్ధిల్లిందట. కొన్నాళ్ల తరవాత ఈ ప్రాంతంపై తురుష్కులు దండయాత్ర చేశారు. రాజు వాళ్లతో పోరాడి గెలిచాడు. కానీ, తురుష్కులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. దాంతో శివలింగం ధ్వంసమైపోయింది. ఆలయంతోపాటూ శివలింగాన్ని కూడా పునరుద్ధరించాలనుకున్నాడు రాజు. అప్పుడు ఈశ్వరుడు కలలో కనిపించి 'లింగం ఇప్పుడున్న స్థితిలోనే పూజాదికాలు నిర్వహించు' అని ఆదేశించాడట. దాంతో, నాటినుంచి నేటి వరకూ శిథిల లింగానికే పూజలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆలయాన్ని ఎన్నిసార్లు పునరుద్ధరించినా... శివాజ్ఞ ప్రకారం లింగాన్ని మాత్రం పునఃప్రతిష్ఠ చెయ్యలేదు.
దేశంలో మరెక్కడా లేని విధంగా గంగతో సహా స్వయంభువుగా శివలింగం ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. మండు వేసవిలో సైతం ఈ ఆలయ కోనేటిలో నిండుగా నీరుంటుంది. అప్పట్లో ప్రజలు ఈ కోనేటిని తాగునీటి కోసం ఉపయోగించేవారు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమినాడు అన్నదానం చేస్తారు.
ఈ ఆలయానికి సమీపంలోనే మరో స్వయంభూ శివాలయం... సోమలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడి కొండపై పచ్చనిచెట్లమధ్య వెలసిన శివలింగం... ఉన్నచోటనే తనంతట తాను తిరుగుతుండేదట. అందుకే ఈ ప్రదేశాన్ని 'లింగాల తిరుగుడు' అని పిలుస్తారు. ఇప్పుడు మాత్రం శివలింగం తిరగడం లేదు. ఈ ఆలయానికి ప్రకృతి రమణీయత మరో అలంకారం. కార్తీకమాసంలోనూ, శివరాత్రి వంటి పర్వదినాల్లోనూ సోమవారాల్లోనూ ఈ స్వయంభూలింగాలను దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
courtesy with Eenadu sunday magazine-August 04, 2013.
- జి.నిరంజన్‌పట్నాయక్, న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం.
- చంద్రమౌళిక సాపిరెడ్డి, ఈనాడు పాత్రికేయ పాఠశాల.
- =================================
No comments:
Post a Comment