- త్రిమూర్తులు కొలువైన క్షేత్రం...త్రయంబకేశ్వరం-మహారాష్ట్ర
'పాపవిముక్తికోసం గౌతముడు స్నానమాచరించిన ప్రవిత్రస్థలమది. జ్యోతిర్లింగరూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రమది. అన్నింటినీ మించి ప్రాచీనకాలం నుంచీ కుంభమేళాకు వేదికగా నిలుస్తోన్న ఆ త్రిసంధ్యాక్షేత్రానికి ఉన్న మరోపేరే త్రయంబకం' అంటూ ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన పెన్మెత్స శ్రీదేవి.
వృత్తిరీత్యా మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని సిన్నార్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా నాసిక్ దగ్గర్లోని త్రయంబకేశ్వరుణ్ణి దర్శించుకోవాలని మా బృందం అంతా కార్లలో బయలుదేరాం. ఈ మందిరం నాసిక్‌కు 28 కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్ పట్టణంలో ఉంది. దేవాదిదేవుడయిన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇదీ ఒకటి. వేదకాలంనాటి గురుకుల పాఠశాలలూ, అష్టాంగమార్గాన్ని అనుసరించే ఆశ్రమాలూ అక్కడ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీ.శ.1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాడట. చూడ్డానికి ఇదో నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో రాతిగోడలు ఉన్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరో ఆకర్షణ.
నాసిక్ మణి ఎక్కడ?
గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరోలోకాన్ని తలపించింది. శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని, చిరుదీపకాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాం. లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు ఉన్నాయి. ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ చేసే అభిషేకాలవల్ల ఆ రూపాల్లో స్పష్టత లోపించింది. లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారుతొడుగుని తొడుగుతారు. దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచీ ఈ త్రయంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడుగా అలంకరిస్తున్నారట. ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్రవైఢూర్యాలతోనూ విలువైన రాళ్లతో సుందరంగా ఉంది. ఈ కిరీటం పాండవుల కాలంనాటిదని అంటారు. దీన్ని ప్రతీ సోమవారం, కార్తీకపౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కుశావర్త తీర్థస్థలానికి తీసుకువెళతారు. తరవాత వూరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదట. మరాఠాలు- ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్‌కు చేరి ఆపై అనేక చేతులు మారింది.
కుశావర్త తీర్థంలో మునకలేశాం
జ్యోతిర్లింగ దర్శనానంతరం- ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఐదు నిమిషాల్లో కుశావర్త తీర్థానికి చేరుకున్నాం. దీన్ని వోల్‌వోకర్ శ్రీరావ్‌జీ సాహెబ్ పాఠ్‌నేకర్ క్రీ.శ. 1690-91లో నిర్మించాడట. ఈ కుశావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచీ సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులని అనుమతిస్తారట. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులూ శైవులూ మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్‌కుండ్‌లో సాన్నమాచరిస్తే, శైవ సాధువులు కుశావర్త్‌లో పుణ్యస్నానం చేస్తారట. గోదావరీ నది కుశావర్త్ నుంచి రామ్‌కుండ్‌లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ రెండు ప్రదేశాలూ కూడా పవిత్రమైనవే. అయితే భక్తులు సైతం కుశావర్త్‌లో స్నానమాచరించేందుకే మక్కువ చూపుతారు. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడంవల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్త్‌లో స్నానమాచరించడంవల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణేతిహాసం. అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరవు ఏర్పడటంతో తన ఆశ్రమం చుట్టూ ఉన్న కొద్దిస్థలంలోనే ధాన్యం పండించి, రుషులకు భోజనం పెట్టేవాడట గౌతమమహర్షి. ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే, దాన్ని తోలేందుకు ఓ దర్భను విసిరాడట. సూదిమొన గుచ్చుకుని అది ప్రాణం విడిచిందట. గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు, దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి, బ్రహ్మగిరిమీద తపస్సు చేయగా, శివుడు గంగను విడిచాడట. శివుణ్ణి వీడటం ఇష్టంలేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరిమీద ఉన్న గంగాద్వార్, త్రయంబక, వరాహ, రామలక్ష్మణ, గంగాసాగర... ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతున్నదట. దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటూ వెళ్లకుండా చేసి స్నానం చేశాడట గౌతముడు. అదే కుశావర్తంగా వాడుకలోకి వచ్చింది. మేం కూడా ఈ కుశావర్తంలోనే స్నానాలు చేశాం.
శివస్వరూపం... బ్రహ్మగిరి
పుణ్యస్నానం తరవాత బ్రహ్మగిరికి బయలుదేరాం. ఇది సముద్రమట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉంది. అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా 1800 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెబుతారు. త్రయంబకేశ్వర్ నుంచి బ్రహ్మగిరికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్ల సహాయంతో జీపులో బయలుదేరాం. దాదాపుగా అరగంటసేపు ప్రయాణించాక బ్రహ్మగిరి పర్వతం మధ్యకి చేరుకున్నాం. అక్కడ నుంచి కాలినడకన ఎక్కి గంగాద్వార్‌కి చేరుకున్నాం. గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగ ఉదుంబర(అత్తి)వృక్షంలో ప్రత్యక్షమై, తరవాత బ్రహ్మగిరి మధ్య నుంచి ఉద్భవించిందట. అదే గంగాద్వార్. గంగాదేవి మొదట కనిపించి అంతర్థానమైన చోట గంగామాత ఆలయం ఉంది. దీనిముందు గోముఖారపు రాతి కింద నుంచి గంగ ఉద్భవిస్తుంటుంది. ఆ పవిత్ర గంగాజలాల్ని చల్లుకుని పునీతులమయ్యాం. ఇక్కడ మాఘమాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఉత్సవం చేస్తారట. ఇక్కడి పంచతీర్థాల్లో గంగాద్వార్ ఒకటి. గౌతమ, అహల్యాసంగమ, బిల్వ, ఇంద్ర అనే మరో నాలుగు తీర్థాలూ త్రయంబకేశ్వరంలో ఉన్నాయి. గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన 108 శివలింగాలు ఈ గంగాద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి. 1907-1918 మధ్యలో కరంసీ హంస్‌రాజ్ అనే భక్తుడు ఈ మెట్లు నిర్మించి, గంగాద్వార్ వరకూ సౌకర్యవంతమైన యాత్రామార్గాన్ని ఏర్పరిచాడు.
ఆ ఆదిశంకరుడు లోకకల్యాణం నిమిత్తం తన జటాజూటం నుంచి గంగను ఇక్కడే విడిచాడనడానికి గుర్తుగా ఈ కొండమీద శివుడి మోకాళ్లూ మోచేతుల గుర్తులు కనిపిస్తాయి. అక్కడ ఓ శివాలయం కూడా ఉంది. అందులో స్వామిని దర్శించుకున్నాం.
ఈ బ్రహ్మగిరిమీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటివైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.
గోరఖ్‌నాథుడి గుహ
సిద్ధ పురుషుడైన గోరఖ్‌నాథుని గుహ కూడా ఈ పర్వతం పైనే ఉంది. ఇవన్నీ చూశాక అక్కడ నుంచి మేం పార్వతీదేవి మందిరానికి వెళ్లాం. కాలాసురుడు అనే రాక్షసుడు గంగాద్వారం దగ్గర ప్రవహించే గంగను చూసి తన పుక్కిట బంధించే ప్రయత్నం చేశాడట. అప్పుడు గౌతమ మహర్షి ఆదిశక్తి అయిన పార్వతీమాతను ప్రార్థించగా అమ్మవారు ఆ రాక్షసుణ్ణి వధించిందట. అయితే ప్రాణాలు విడుస్తూ శివభక్తుడయిన ఆ రాక్షసుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ఉచ్ఛరించడంతో ప్రసన్నురాలైన దేవి, అతని కోరిక మేరకు 'కోలాంబిక' అనే పేరుతో ఆ పర్వతంమీద స్థిరపడిందట. మేం అక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకుని రాబోతున్న కుంభమేళా గురించి అక్కడ పూజారిగారు ఎన్నో విషయాలు చెప్పారు.
కుంభమేళా
సత్యయుగంలో దేవదానవులిద్దరూ కలిసి సాగరమథనం చేసినప్పుడు అమృతం పుడుతుంది. ఆ అమృత కలశాన్ని దేవతల పథకం మేరకు ఇంద్రపుత్రుడు ఆకాశమార్గాన తీసుకుపోతుండగా దానికోసం దానవులు దేవతలతో తలపడి 12 రోజులపాటు భయంకర యుద్ధం చేశారట. ఈ యుద్ధకాలంలో కలశం(కుంభం) నుంచి కొన్ని అమృత బిందువులు భూమిమీద పడ్డాయట. అవి హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, త్రయంబకేశ్వర్ క్షేత్రాల్లో పడ్డ కారణంగా సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఆ అమృత బిందువుల్ని రక్షించారట. అందువల్ల సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి విభిన్న రాశుల్లో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళా జరుగుతుందట. ఆ 12 రోజుల యుద్ధం మానవజాతికి 12 సంవత్సరాలతో సమానం. దీని ఆధారంగా ప్రతి మూడేళ్లకీ ఓ ప్రదేశం చొప్పున ఆ నాలుగుచోట్లా కుంభమేళాలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే సింహరాశిలో గురుడు, సూర్యుడు వచ్చినప్పుడు గోదావరి పుట్టినచోట త్రయంబకేశ్వరంలోనూ, మేషరాశిలో సూర్యుడు, కుంభరాశిలో గురుడు వచ్చినప్పుడు హరిద్వార్‌లోనూ, వృషభరాశిలో బృహస్పతి, మకరరాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ప్రయాగలోనూ, సింహరాశిలో బృహస్పతి, వృషభరాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఉజ్జయినీలోనూ ఈ కుంభమేళాలు జరుగుతాయి.
ముఖ్యంగా సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు 33 కోట్ల దేవతలు, 999 నదీనదాలు, 68 మహాతీర్థాలతోపాటు 12 జ్యోతిర్లింగాల్లోని శక్తులన్నీ కలిసి త్రయంబకేశ్వరంలో కొలువవుతాయని శివమహాపురాణం పేర్కొంటోంది. కార్తీకమాసంలో వెయ్యిసార్లూ, మాఘమాసంలో వందసార్లూ వైశాఖంలో కోటిసార్లూ గంగాస్నానం చేస్తే ఎంత పుణ్యఫలం సిద్ధిస్తుందో అదే ఫలం సింహస్థకుంభమేళాలో కుశావర్తంలో ఒక్కసారి చేస్తే లభిస్తుందట. ఆ మహిమను పదేపదే తలచుకుంటూ రాబోయే కుంభమేళాలో మరోసారి రావాలనుకుంటూ తిరుగుప్రయాణమయ్యాం.
courtesy with Eenadu newpaper ... july 5 , 2015
- *=================================*
Visit my website : Dr.Seshagirirao.com _