త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడి శివలింగాన్ని పూజించారంటారు. ద్వాపరయుగంలో భీమసేనుడు ఈ కొండను దర్శించాడంటారు. కలియుగంలో ఓ కవి ఇక్కడే సరస్వతీమాత సాక్షాత్కారం పొందాడంటారు. ఆ క్షేత్రమే వరంగల్‌జిల్లా మడికొండ గ్రామంలోని మెట్టుగుట్ట!
శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటిచెప్పిన పుణ్యక్షేత్రం మెట్టుగుట్ట. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. కాబట్టే ఈ క్షేత్రానికి 'దక్షిణ కాశీ'గా పేరొచ్చింది. వరంగల్ జిల్లా, హన్మకొండ మండలం, మడికొండ గ్రామంలో...హైదరాబాద్-హన్మకొండ జాతీయ రహదారి మీద కాజీపేట రైల్వే జంక్షనుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సంచరించిన సమయంలో...మెట్టుగుట్ట క్షేత్రానికి వచ్చి శివుడిని అర్చించినట్టు స్థానిక ఐతిహ్యం. అందుకే మెట్టు రామలింగేశ్వరాలయమన్న పేరు వచ్చింది. ఇక్కడున్న రామాలయమూ అంతే ప్రాచీనమైంది.
కాకతీయుల కాలంలో...
వేంగి చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. శిల్పరీతిని బట్టి చూస్తే వీరభద్రాలయాన్ని చాళుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చు. దేవగిరి యాదవరాజుల దండయాత్రలను అరికట్టడానికి మడికొండ మెట్టుగుట్ట ప్రాంతం అనువైందని కాకతీయులు గుర్తించారు. అక్కడో కోట కూడా కట్టారు. క్రీ.శ. 1198-1261 మధ్యకాలంలో కాకతీయ రాజులు మెట్టుగుట్ట మీద ఆలయాలు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.
సిద్ధుల తపస్సుతో...
కరవుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజల కోసం మాండవ్య, మరీచి, శాండిల్యాది నవసిద్ధులు తపస్సు చేయగా...పరమ శివుడు సిద్ధేశ్వరమూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. కొండమీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి పూజలందుకుంటున్నారు. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రంలో ధూపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని కానుకగా ఇచ్చారు. సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు మండలం రోజులు గుట్టపై వాగీశ్వరీ ఉపాసన చేసినట్టు చెబుతారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగులో రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందమని ఆశీర్వదించిందని ఓ కథనం. నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవ గుండాలూ ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపవినాశనిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవే. జీడి గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందంటారు. కన్ను గుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మిక. అందులో నాణెం వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు.
మెట్టుగుట్ట మీద 165 అడుగుల ఎత్తులో రెండు చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలు ఆడుకుని, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చిందనీ...ఆవే ఈ శిలలనీ ఓ కథ ప్రచారంలో ఉంది. వీటినే దొంతలమ్మ గుండ్లని వ్యవహరిస్తారు. గుట్టమీద ఓ జత పాదముద్రలున్నాయి. ఇవి, ద్వాపరయుగంలో ఇక్కడికొచ్చిన భీమసేనుడివేనంటారు. అలా, ముచ్చటగా మూడు యుగాల్లోనూ మెట్టుగుట్ట ప్రశస్తిని పొందింది.
ఘనంగా బ్రహ్మోత్సవాలు
ఏటా మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి జాగరణ, శివపార్వతుల కల్యాణం నేత్రపర్వంగా సాగుతాయి. శ్రీరామనవమి వేడుకలు, కార్తీక దీపోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంగా మెట్టుగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవంలో...తేరును లాగితే అవివాహితులకు కల్యాణయోగం ప్రాప్తిస్తుందంటారు.
ఇలా వెళ్లాలి...
నిత్యం హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలనుంచి వందలాది బస్సులు మడికొండ హైవే మీదుగా హన్మకొండ, వరంగల్ వైపు వెళ్తుంటాయి. భక్తులు మడికొండ వద్ద బస్సుదిగి మెట్టుగుట్ట ఆలయానికి నడిచివెళ్లవచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో వచ్చే భక్తులకు కాజీపేట జంక్షన్ స్వాగతం పలుకుతుంది. ఇక్కడ బస్సుదిగితే స్టేషన్ పక్కనే స్థానిక బస్టాండు ఉంటుంది. అక్కడ మడికొండ, ధర్మసాగర్, రాంపూర్, నారాయణగిరి, వేలేరు, పీసర రూటులో వెళ్లే ఏ బస్సు ఎక్కినా మడికొండ దగ్గర దిగి, మెట్టుగుట్ట క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు. భక్తుల సౌకర్యం కోసం నాలుగు సత్రాలున్నాయి.
- డి.రవీందర్‌యాదవ్, న్యూస్‌టుడే, మడికొండ
*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _